దౌత్యం ఒక ప్రత్యేక కళ. అవతలి పక్షం నుంచి రాబట్టుకోవాలన్నా, మనం ఇచ్చేది ఘనంగా కనబడేట్టు చేయాలన్నా నేర్పుతో, ఓర్పుతో, చాకచక్యంతో మాట్లాడాల్సివుంటుంది. చైనాది మొరటు పద్ధతి. అక్కడి పాలకులకు ఆంతరంగికంగా ఇబ్బందులెదురైనా, సరిహద్దు అవతల తనకు నచ్చని పరిణామం చోటుచేసుకున్నా వెంటనే తన సైనికులను హద్దు దాటించి అలజడి రేకెత్తించటం అలవాటు.
అలాంటిది కుదరనప్పుడు నామకరణ మహోత్సవానికి దిగటం రివాజు. తాజాగా చైనా చేసిందదే. ఒక ప్రాంతానికి దక్షిణ టిబెట్ ప్రాంతమని పేరెట్టి, మాండరిన్ భాషాపదమైన జంగ్ నన్‌గా దాన్ని వ్యవహరిస్తూ మన అరుణాచల్ ప్రదేశ్ అందులో భాగమని ఎప్పటినుంచో వాదిస్తోంది. ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌కు సమీపంలోని పట్టణంతో సహా 11 ప్రాంతాలకు తన సొంత పేర్లతో తాజా జాబితా విడుదల చేసింది.
ఇందులో అయిదు పర్వత శిఖరాలు, రెండు జనావాస ప్రాంతాలు, రెండు నదులు, మరో రెండు ఇతర స్థలాలు ఉన్నాయి. లోగడ 2017లో ఒకసారి, 2021లో మరోసారి చైనా ఈ నామకరణ మహోత్సవాలు చేసింది. చైనా దబాయింపులపై ఎప్పటి కప్పుడు మన దేశం అభ్యంతరం చెబుతూనే వస్తోంది. ఇప్పుడు తాజాగా పేర్ల జాబితా విడుదల చేస్తూ ‘చారిత్రక, పాలనాపర అంశాల ప్రాతిపదికగా’ కొత్త పేర్లు పెట్టామని చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పుకుంటోంది.
చరిత్ర తిరగేస్తే జనం ఒకచోటు నుంచి మరో చోటుకు స్వేచ్ఛగా సంచరిస్తూ వెళ్లటం, ఎక్కడ జీవనం సవ్యంగా గడుస్తుందనిపిస్తే అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవటం కనబడుతుంది. ఈ ఆవాసాలకూ, దారిలో తారసపడే ప్రదేశాలకూ, నదులకూ, పర్వతాలకూ పేర్లు పెట్టడం కూడా మామూలే. దేశాలు తమ తమ సరిహద్దుల్ని ఖరారు చేసుకోవటం ఇంచుమించు 17వ శతాబ్దంలో మొదలైంది.
ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దుల విషయంలో సమస్య ఏర్పడినప్పుడల్లా చరిత్రలో ఆ ప్రాంతాలకు మాండరిన్ భాషలో ఫలానా పేరుందని, కనుక అది తమదేనని మర్కట తర్కానికి దిగటం చైనాకు తెలిసిన విద్య. మన దేశంతో మాత్రమే కాదు... దక్షిణాసియాలో ఇంచుమించు చాలా దేశాలతో దానికి ఇదే తగువు.
ఉదాహరణకు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని రెండు ప్రధాన ద్వీప సమూహాల్లోని స్ప్రాట్లీ, పరాశల్ దీవుల విషయంలో బ్రూనై, ఇండొనేసియా, మలే సియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాంలతో చైనాకు లడాయి నడుస్తోంది.
శతాబ్దాల క్రితం చైనీ యులు చేపల వేటకు ఉపయోగించిన మార్గాన్ని ‘ఖరారు’ చేసి ఆ ప్రాంతమంతా తనదేనని వాదించటం చైనాకే చెల్లింది. ఆ లెక్కన హాంకాంగ్ మొదలు బోర్నియో వరకూ గల దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని 35 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 90 శాతం చైనాదే అవుతుంది! తూర్పు చైనా సముద్ర ప్రాంతంలోని సెంకాకు దీవులు జపాన్ అధీనంలో ఉండగా హఠాత్తుగా ఆ ప్రాంతాన్ని దియోయూ అంటారనీ, అది తనదేననీ 1950లో పేచీకి దిగింది.
చైనా ఇలా పేర్లు మార్చినప్పుడల్లా అది జారీచేసే పాస్‌పోర్టుల్లోనూ, అంతర్జాతీయ మీడియాకు విడుదల చేసే ప్రకటనల్లోనూ ఆ కొత్త పేర్లు వచ్చి కూచుంటాయి. దేశదేశాల్లో ఉండే చైనా పౌరులు వాటిని పదే పదే వల్లిస్తారు. ఈ తంతు అంతా పూర్తి చేశాక తన భూభాగాన్ని అవతలి పక్షం ‘చట్టవిరుద్ధంగా’ ఆక్రమించుకున్నదని అదును చూసుకుని గొడవ మొదలెడుతుంది.
వివాదాలు ముదిరి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు కెళ్లినప్పుడు ఆ ప్రాంతం తన పాలనా నిర్వహణలోనే ఉన్నదని చెప్పుకోవటం, దానికున్న పేరు తాను పెట్టిందేనని నిరూపించుకోవటం, సంబంధిత మ్యాప్‌లు చూపటం అవసరమవుతుంది. ఇలా చడీచప్పుడూ లేకుండా చిన్నగా వివాదం ప్రారంభించటం, ఆనక దాన్ని పెద్ద సమస్యగా మార్చటం చైనాకు అలవాటు.
వియత్నాంతో ఉన్న వివాదం విషయంలో అది మరింత వింతగా ప్రవర్తించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా వాదనకు అనుగుణమైన మ్యాప్ ముద్రించి ఉన్న టీ షర్టులతో 2018లో 14 మంది చైనా పర్యాటకులు వచ్చినప్పుడు వియత్నాం ప్రజలు ఆగ్రహంతో రగిలి పోయారు. ఆ టీ షర్టులు తీసేవరకూ బయటకు అడుగుపెట్టనీయబోమని విమానాశ్రయ అధికారులు చెప్పటంతో గత్యంతరంలేక వారు మార్చుకోవాల్సి వచ్చింది. చూడటానికి ఇది తుంటరి చేష్టగా కనబడుతుంది. పెద్ద పట్టించుకోవటం ఎందుకనిపిస్తుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న చర్యలే మున్ముందు అక్కర కొస్తాయన్నది దాని ఆలోచన.
చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉంది. దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మన దేశం మొదటినుంచీ అన్నివిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. అయినా దలైలామాను మన అధికార పక్ష నేతలు కలిసినప్పుడో, అరుణాచల్ ప్రదేశ్‌లో కేంద్రమంత్రులు పర్యటించినప్పుడో నిరసన స్వరం వినిపించటం చైనాకు అలవాటు.
మరికొన్ని వారాల్లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) మంత్రుల స్థాయి సదస్సుకు చైనా రక్షణ మంత్రి మన దేశం రావాల్సివుంది. జూలైలో ఆ సంస్థ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వస్తారు. ఎస్‌సీఓకు ప్రస్తుతం మన దేశం సారథ్యం వహి స్తోంది. ఇలాంటి సమయంలో కొత్త తగువు రేకెత్తించాలన్నది చైనా ఎత్తుగడ కావొచ్చు.
మన దేశం చెప్పినట్టు కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన భౌగోళిక వాస్తవాలు మారిపోవు. వివాదాలు పరిష్కారమై పోవు. వివేకం తెచ్చుకుని హుందాగా వ్యవహరించటం నేర్చుకుంటే గౌరవం నిలబడుతుంది. చిల్లర తగాదాలతో కాలక్షేపం చేద్దామనుకుంటే అది చైనాకే చేటు తెస్తుంది.
చైనా వింత చేష్టలు!
Published Wed, Apr 5 2023 12:33 AM | Last Updated on Wed, Apr 5 2023 12:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment