China’s Xi Jinping Makes First Official Visit To Tibet As President - Sakshi
Sakshi News home page

టిబెట్‌లో జిన్‌పింగ్‌ పర్యటన.. అధ్యక్ష హోదాలో తొలిసారి

Published Fri, Jul 23 2021 2:10 PM | Last Updated on Fri, Jul 23 2021 6:54 PM

Xi Jinping Makes Rare Visit To Tibet First Time As President - Sakshi

టిబెట్‌లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ (ఫోటో కర్టెసీ: మళయాళ మనోరమ)

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అరుదైన పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జిన్‌పింగ్‌ చైనాకు రాజకీయంగా సున్నిత ప్రాంతమైన టిబెట్‌లో పర్యటిస్తున్నారని.. ఆ దేశ అధికారిక మీడియా శుక్రవారం వెల్లడించింది. గత మూడు దశాబ్దాల్లో చైనా అధ్యక్షుడు టిబెట్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. చైనా జాతీయ మీడియా సీసీటీవీ శుక్రవారం విడుదల చేసిన ఫుటేజీలో, విమానం నుంచి దిగిన జిన్‌పింగ్‌కు సంప్రదాయ దుస్తులు ధరించి, చేతిలో చైనీస్ జెండాలను పట్టుకుని ఊపుతూ, సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తూ రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన దృశ్యాలు ఉన్నాయి.

బుధవారం టిబెట్ ఆగ్నేయంలోని నియింగ్చి మెయిన్లింగ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ, రెండు రోజుల వరకు కూడా జిన్‌పింగ్‌ పర్యటన గురించి అధికారిక మీడియాలో ప్రస్తావించలేదు. "అన్ని జాతుల కార్యకర్తలు, ప్రజల ఆదర స్వాగతం అనంతరం జిన్‌పింగ్‌ న్యాంగ్ నది వంతెన వద్దకు వెళ్లి.. యార్లుంగ్ త్సాంగ్పో నది, న్యాంగ్ నది జీవావరణ, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు’’ అని సీసీటీవీ వెల్లడించింది. 

జిన్‌పింగ్‌ గతంలో రెండుసార్లు టిబెట్‌లో పర్యటించారు. 1998 లో ఒకసారి ఫుజియాన్ ప్రావిన్స్ పార్టీ చీఫ్‌గా, 2011 లో మరోసారి ఉపాధ్యక్షునిగా ఉన్న సమయంలో టిబెట్‌లో పర్యటించారు. అధ్యక్ష హోదాలో టిబెట్‌లో పర్యటించడం మాత్రం ఇదే ప్రథమం. టిబెట్‌ను సందర్శించిన చివరి చైనా అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌. 1990 లో జియాంగ్ టిబెట్‌లో పర్యటించారు. 

కొన్ని శతాబ్దాలుగా తమ నియంత్రణలో ఉన్న టిబెట్‌ని 1951 లో శాంతియుతంగా విముక్తి చేశామని.. అంతేకాక గతంలో అభివృద్ధి చెందని ఆ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు, విద్యను తీసుకువచ్చింది తామే అని చైనా చెప్పుకుంటుంది. కానీ బహిష్కరించబడిన చాలా మంది టిబెటన్లు చైనా ప్రభుత్వం తమ నేలపై మతపరమైన అణచివేతకు పాల్పడుతూ.. వారి సంస్కృతిని నాశనం చేస్తుందని ఆరోపించారు. 2008లో చైనా చర్యల వల్ల ఈ ప్రాంతంలో తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. 

చైనా టిబెట్ వివాదం ఎప్పుడు మొదలైంది..
చైనా, టిబెట్ మధ్య గొడవ.. టిబెట్ చట్టబద్ధ హోదాకు సంబంధించినది. టిటెబ్ 13వ శతాబ్దం మధ్య కాలం నుంచీ తమ దేశంలో భాగంగా ఉందని చైనా చెబుతుంది. కానీ టిబెటన్లు మాత్రం తమ దేశం ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉందని, తమపై చైనా అధికారం నిరంతరంగా కొనసాగలేదని చెబుతారు.

మంగోల్ రాజు కుబ్లాయ్ ఖాన్ యువాన్ రాజవంశాన్ని స్థాపించి.. తన రాజ్యాన్ని టిబెట్‌తో పాటు, చైనా, వియత్నాం, కొరియా వరకూ విస్తరించాడు. తర్వాత 17వ శతాబ్దంలో చైనా చింగ్ రాజవంశానికి టిబెట్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 260 ఏళ్ల బంధం తర్వాత చింగ్ సైన్యం టిబెట్‌ను ఆక్రమించింది. కానీ మూడేళ్లలోనే టిబెటన్లు వారిని తరిమికొట్టి.. 1912లో 13వ దలైలామా టిబెట్ స్వతంత్ర దేశమని ప్రకటించారు.

1951లో చైనా సైన్యం మరోసారి టిబెట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్‌ ప్రతినిధి బృందంతో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టిబెట్ సౌర్వభౌమాధికారాన్ని చైనాకు అప్పగించారు. దాంతో దలైలామా భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఆయన టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతూనే ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement