కొద్ది నెలల క్రితం డ్రాగన్ కంట్రీ చైనాను కరోనా వైరస్ మరోసారి వణికించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో పాటిజివ్ కేసులు, మరణాలు సంభవించడంతో చైనా ప్రభుత్వం చైనీయులపై కఠిన ఆంక్షలు విధించింది. కాగా, జిన్‌పింగ్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.
అయితే, కరోనా వ్యాప్తి సమయంలో చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న చాలా మంది చైనీయులు కనిపించకుండా పోతున్నారు. దీంతో, ఈ విషయంతో చైనాతో పాటు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఈ విషయాన్ని విదేశీ మీడియా కనిపెట్టింది. ఇక, మిస్ అవుతున్న వారిలో ఎక్కువగా చైనా మహిళలు ఉండటం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వివరాల ప్రకారం.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై ఇప్పుడు జిన్‌పింగ్ చర్యలకు దిగుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చైనా ప్రభుత్వం ఇప్పటివరకు 100 మందిని చడీచప్పుడు చేయకుండా అదుపులోకి తీసుకుని అజ్ఞాతంలోకి తరలించిన వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. వీరిలో చాలా మంది మహిళలు ఉన్నారు.
ముఖ్యంగా వీరంతా అమెరికా, బ్రిటన్‌లో చదువుకుని వచ్చిన రచయితలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, సంగీతకారులు ఉన్నట్లు సమాచారం. అయితే, ముఖ్యంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులపై జిన్‌పింగ్ ప్రభుత్వం కన్నేసి ఉంచింది. వీరితో ఆందోళనలకు దిగేలా ప్రేరేపించిన వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు కాలంలో తనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జిన్‌పింగ్ వ్యూహాల్లో భాగంగానే నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment