చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (ఫైల్ ఫొటో)
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గ్యాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ బేస్‌ను సందర్శించారు. దక్షిణ చైనా సముద్రం మీద డ్రాగన్ పెత్తనంపై దిగ్గజ దేశాలు భగ్గుమంటున్న వేళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్‌్ప్స(నావికా దళం)ను ఉద్దేశించి ప్రసంగించారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, విశ్వసనీయత కలిగి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ షినువా మంగళవారం ఓ కథనం ప్రచురించినట్లు సీఎన్‌ఎన్ తెలిపింది. ‘‘మీ అందరూ ఈ విషయంపై దృష్టి సారించి, శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధానికి సన్నద్ధం కావాలి’’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. కాగా వాస్తవాధీన రేఖ వెంబడి దుందుడుకు వైఖరి, దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్ జలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనా తీరు పట్ల అగ్రరాజ్యం అమెరికా సహా భారత్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర క్వాడ్ దేశాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: భారత సరిహద్దులో 60 వేల చైనా సైన్యం: అమెరికా)
ఈ నేపథ్యంలో ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవల టోక్యోలో సమావేశమై డ్రాగన్ దేశమే లక్ష్యంగా కీలక ప్రకటన విడుదల చేశారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత, స్వేచ్ఛాయుత వాతావరణమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని పునరుద్ఘాటించారు. ఇక ఈ సమావేశం అనంతరం స్వదేశానికి చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చైనాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘భారత ఉత్తర సరిహద్దులో చైనా 60 వేల మంది సైనికులను మోహరించింది. వుహాన్‌లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రశ్నించినందుకు ఆస్ట్రేలియాపై వేధింపులకు పాల్పడింది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పాలన వల్ల ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది’’ అంటూ డ్రాగన్ వైఖరిని ఎండగట్టారు. దీంతో మరోసారి అమెరికా- చైనాల మధ్య తలెత్తిన విభేదాలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. (సానుకూలంగా చర్చలు.. కానీ)
అంతేగాక అమెరికా, తైవాన్‌కు అన్ని రకాలుగా అండగా నిలవడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అండతో తమతో సవాలు చేస్తే యుద్ధం తప్పదంటూ తైవాన్‌ను కూడా హెచ్చరించింది. మరోవైపు.. భారత్‌తోనూ సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్, మంగళవారం నాటి మిలిటరీ చర్చల్లో సానుకూల చర్చ జరిగిందని మంగళవారం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అయితే అదే సమయంలో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన లదాఖ్, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన వంతెనల గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment