
‘దేశానికి’ కాలదోషం పట్టిందా?
ఒక అవినీతి కేసులో నిందితుడ్ని భగత్‌సింగ్‌లా చిత్రీకరించడం బాబు టీడీపీకే చెల్లింది. దీని ద్వారా బాబు తమ కార్యకర్తలకు, నాయకులకు పంపుతున్న సందేశం ఏమిటి? యథేచ్ఛగా అవినీతి, అక్రమాల్లో మునిగి తేలవచ్చని కాదా?
‘‘యథారాజా తథాప్రజ’’ అనే నానుడి అందరికీ సుపరిచి తమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా ధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త అవతారం చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు, గౌరవం ఏమౌతాయోనని ఆం దోళన కలుగుతోందని కొం దరు మిత్రులు ఇటీవల ప్రస్తా వించారు. ఒక అవినీతి కేసులో ప్రధాన ముద్దాయిగా పట్టుబడిన టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రాగానే... ఆ పార్టీ కార్యాలయంలోనూ, బయటా, చర్లపల్లి జైలు వద్దా ఆ పార్టీ స్పందించిన తీరు వర్ణించలేనంత ఏవగింపును, జుగుప్సను కలిగించాయని వారన్నారు.
ఈ సందర్భంలో ఎన్టీఆర్ బతికి ఉంటే ఎలా ఉండేదని? ఆ మిత్రులు అన్నారు. నాకు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం కళ్ల ముందు కదలాడింది. ‘‘ప్రజలే దేవుళ్లు, చట్టసభలే ఆధునిక దేవాలయాలు’’ అని మనసా, వాచా నమ్మిన నాయకుడు ఎన్టీఆర్. ఆనాటి రాజకీయ పరిస్థి తుల్లో ఆయన జనాకర్షణ, బలహీనవర్గాలకు ప్రాధాన్య మిచ్చిన ఆయన సామాజిక సిద్ధాంతం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. వారిని ఆయన వెంట నడిపించాయి. ఆ కార్యకర్తలతోనే ఎన్టీఆర్ పార్టీని నడిపారు. విద్యావం తులు, న్యాయవాదులు, డాక్టర్లు, నిస్వార్థపరులు, సమా జ మార్పును కాంక్షించే ప్రగతిశీలవాదులు ఎందరో ఆయన హయాంలో చట్ట సభలకు ఎన్నికయ్యారు.
ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా పనిచేసిన రామచంద్రరావు పదివేల రూపాయల అవినీతికి పాల్ప డనున్నారని తెలిసి, ఏసీబీకి పట్టించిన ఘనత ఆయనది. ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం ప్రపంచంలోనే తెలుగువారికి మంచి గుర్తింపును తెచ్చిపెడితే... చంద్ర బాబు టీడీపీ తలవంపులు తెచ్చిపెడుతోంది. ఎన్టీఆర్ అవినీతిపరుల్ని ఏసీబీకి పట్టిస్తే... చంద్రబాబు అవినీతి పరులను రక్షించుకునేందుకు బరితెగిస్తున్నాడు. ఆయన ప్రజల కోసం, పార్టీ కోసం పని చేసేవారికి ప్రాధాన్యం ఇస్తే...ఈయన డబ్బు సంచులు తెచ్చేవారికి పదవులు కట్టబెడుతున్నాడు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి అందులో పనిచేస్తున్న సీనియర్లు ఇంకా ముఖ్య స్థానాల్లో ఉన్నారు. వారు భయంతోనో, పదవీ కాంక్ష తోనో, నిర్వేదంతోనో బాబుకు వంతపాడే దుస్థితిలో ఉం డటం దురదృష్టకరం. లేకుంటే ఆ పార్టీ పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేటర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, అవినీతిపరులు, నేరచరితులతో నిండిపోయేది కాదు. నేడా పార్టీ విధాన నిర్ణేతల్లో 90 శాతం ప్రజావ్యతిరేకులు, స్వార్థపరులే.
నిజానికి చంద్రబాబు ప్రజాబలంతో గెలిచిన సందర్భాలే లేవు. 1995లో బాబు ముఖ్యమంత్రి గద్దెనె క్కింది... నీతిబాహ్యంగా ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్క్వోడం ద్వారా మాత్రమే. ఆ తర్వాత1999లో, కార్గిల్ యుద్ధ భావోద్వేగ వాతావరణంలో బీజేపీ మద్ద తుతో గెలిచాడు. ఇక 2014లో మార్పును కోరుతున్న ప్రజలు, మోదీ ప్రచారం, పవన్ అభిమానుల సహాయం తో అధికారంలోకి వచ్చారు... అదీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో! ప్రజానేతకు ఉండాల్సిన ఏ ఒక్క లక్షణ మూ చంద్రబాబుకు లేదు. ఆయనకు తెలిసింది ఒకే ఒక్క విద్య... కుతంత్రం.
‘‘ఓటుకు కోట్లు’’ అవినీతి వ్యవహారంలో రేవంత్ నేరం చేస్తూ పట్టుబడ్డాడు. ప్రజాభిప్రాయానికి భయ పడైనా అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తారనుకుంటే అది చేయలేదు. ఇంతలో చంద్రబాబు ఆడియో టేపే బయట కొచ్చింది. అప్పుడైనా ఆయన పార్టీ, ప్రభుత్వ బాధ్య తల నుంచి తప్పుకుని వేరే వారికి అప్పగిస్తాడనుకుంటే, అదీ చేయలేదు. ఒక హవాలా కేసులో తన పేరు ప్రస్తా వించి నందుకే బీజేపీ నేత అద్వానీ రాజీనామా చేశారు. ఆయనతో పోలిస్తే బాబు తీరును ఎవరైనా గర్హించక తప్పదు. పైగా ఆయన ప్రజల్ని వేరే విషయాలపై రెచ్చ గొడుతూ, తన అవినీతికి మద్దతు ఇవ్వాలని విశాల ప్రజానీకాన్ని పరోక్షంగా ఆదేశిస్తున్నాడు.
‘‘తెలంగాణ పులిబిడ్డ- నిను మరవబోదు ఈ గడ్డ’’ అంటూ రేవంత్‌పై పాట రాయించి మరీ బెయిల్ రాగానే వేలాది మందితో ఊరేగించాలని ఆదేశించడం ఆయనకే చెల్లింది. ఒక అవినీతి కేసులో నిందితుడ్ని భగత్‌సింగ్‌లా చిత్రీకరించడం బాబు టీడీపీకే సాధ్యం. టీడీపీ తమ కార్యకర్తలకు, నాయకులకు పంపుతున్న సందేశం ఏమిటి? ఒక నాయకుడు లేదా కార్యకర్త అవినీతి కేసులో ఇరుక్కుంటే పార్టీ అధ్యక్షుడు తమను కాపాడతాడని, తన అవినీతికి, అనైతిక చర్యలకూ వీరత్వాన్ని ఆపాదించి కీర్తి స్తాడని కాదా? యథేచ్ఛగా అవినీతి, అక్రమాల్లో మునిగి తేలవచ్చని కాదా? స్వయంగా అధినేతే అవినీతి కేసులో ఇరుక్కున్నాక ఆయన వల్లించే నీతులను ఎవరు మాత్రం ఆచరిస్తారు? సమాజం పట్ల ఏ మాత్రం అంకిత భావం లేకుండా, ధనార్జనే ధ్యేయంగా భావించే ఫక్తు వ్యాపార వేత్తలు రాజకీయ నేతలుగా అవతారమెత్తాక... ఇక ఆ పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని ఎలా చూస్తుంది? స్వార్థపరు లతో, నేరస్తులతో నిండిన పార్టీ ప్రజలకు అవసరం లేదనే చెప్పాలి.
ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మహానుభావులు ఎవరైనా ఆ పార్టీలో మిగిలితే వారికి నాదో విన్నపం. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదలు, బలహీనవర్గాల కోసం, కార్య కర్తల కోసం నీతి, నిజాయితీ, విలువల ప్రాతిపదికపై తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించండి. ముందే ప్రస్తావిం చినట్టు ‘యథారాజా తథాప్రజ’ అని ప్రజలంతా చంద్ర బాబును అనుసరించడం మొదలు పెడితే మన సమా జం ఎక్కడికిపోతుందో ఊహించడమే కష్టం. మీడియా సైతం రాజకీయాల నుంచి స్పష్టమైన దూరం పాటించ కపోతే ప్రజల దృష్టిలో దొంగలకూ, దొరలకూ తేడా తెలియకుండా పోయే ప్రమాదం దాపురిస్తుంది. అయితే ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న తెలుగు ప్రజలు చైతన్య వంతులు. ఈ విపరీత, వికృత ధోరణులను సహిస్తారని అనుకోవడం లేదు.
(వ్యాసకర్త ఏపీ శాసన మండలి కాంగ్రెస్ పక్ష ఉపనేత)
మొబైల్: 81069 15555