అఫ్గానిస్తాన్‌ పర్యవసానాలు ఇలా... | Buddiga Zamindar Article On Tensions Rise In Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గానిస్తాన్‌ పర్యవసానాలు ఇలా...

Published Mon, Jul 19 2021 12:05 AM | Last Updated on Mon, Jul 19 2021 4:23 AM

Buddiga Zamindar Article On Tensions Rise In Afghanistan - Sakshi

అగ్రరాజ్య అమెరికా చరిత్రలో అతి పెద్ద యుద్ధం చేసిన సైన్యాలు అఫ్గానిస్తాన్‌ నుంచి మూటాముల్లె సర్దుకొని వెనుదిరిగాయి. 2011 సెప్టెంబరు 11న ట్విన్‌టవర్స్‌ కూలిన తర్వాత ‘టెర్రరిజంపై యుద్ధం’ పేరిట అఫ్గానిస్తాన్‌ను అమెరికా, నాటో దేశాలు కలిసి ఆక్రమించాయి. రెండు దశాబ్దాల తర్వాత ఉగ్రవాదం ఉత్తరాఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య దక్షిణాసియాల్లో పెరిగిందే తప్ప తగ్గలేదు. తాలిబాన్ల పుట్టుక సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ప్రోత్సహించిన అమెరికా అండదండలతో జరిగింది. ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ ఉగ్రవాదులను ఉసిగొల్పి, శిక్షణనిచ్చి కోట్ల డాలర్లు కుమ్మరించిన అమెరికా ఉత్పత్తి పుత్రుడే బిన్‌ లాడెన్‌. 

ఇరవై ఏళ్లపాటు అఫ్గానిస్తాన్‌లో అమెరికా తిష్ఠవేయడానికి కారణం, ఆ దేశ పౌరులపై  ప్రేమ, జాలితో కాదు. అఫ్గానిస్తాన్‌ భౌగోళికంగా సెంట్రల్‌ దక్షిణాసియా దేశాల మధ్య మినరల్స్, ఖనిజసంపదతో నిండిన వ్యూహాత్మక దేశమవటమే. అఫ్గానిస్తాన్‌ ఆర్థిక, రాజకీయ పర్యవసానాలు అనాదిగా మన ఇరుదేశాల మధ్యగల సంబంధాలపై  ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుత అఫ్గాన్‌ ప్రభుత్వం అమెరికా కీలుబొమ్మగా పేరుగాంచి మొత్తం 43 శాతం భూభాగంతో   ప్రాబల్యంలేనిదిగా ఉంది. దీనికి విరుద్ధంగా ఛాందసవాద తాలిబాన్లు మెజారిటీ ప్రావిన్సులను ఆక్రమించి, అమెరికా సేనలతో పోరాడి చివరికి దేశాన్ని వదిలిపోయేలా చేశారు. దాడులు ముమ్మరమైనప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందారు. ఉగ్రవాదం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌ల మీదుగా భారతదేశ కశ్మీరు వరకూ తాలిబాన్ల రూపంలో పాకింది.

సుదీర్ఘయుద్ధం వల్ల అమెరికా పరువు మసకబారింది. ఆర్థికంగా, సైన్యపరంగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. చివరికి 2021 సెప్టెంబరు 11 నాటికల్లా, 20 సంవత్సరాల ఆక్రమణ పూర్తి సమయానికి ఇంకా మిగిలి ఉన్న   సైన్యాన్ని వెనుకకు రప్పిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌. బ్రౌన్‌ యూనివర్సిటీ అంచనాల ప్రకారం మొత్తం అమెరికా యుద్ధఖర్చు రెండు లక్షల, 36 వేల కోట్ల డాలర్లయింది(177 లక్షల కోట్ల రూపాయలు). యుద్ధంలో కనీసం 2,41,000 మంది ప్రత్యక్షంగా చనిపోగా, లక్షలాది మంది ఆకలితో చనిపోయారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లలో 71,344 మంది పౌరులు, అమెరికా నాటో సైన్యాలు 3,586 మంది, అఫ్గాన్‌ మిలిటరీ, పోలీసులు 78,314 మంది, ప్రతిపక్ష సాయుధులు 84,191 మంది చనిపోయారు. యునిసెఫ్‌ నివేదిక ప్రకారం కనీసం 37 లక్షల చిన్నారులు స్కూళ్లకు దూరమయ్యారు. వీరిలో 60 శాతం బాలికలే ఉన్నారు. 2007లో 33 శాతం పేదరికం 2020 నాటికి 55 శాతానికి పెరిగింది. 2002లో 74 వేల హెక్టార్లలో సాగయిన మాదక ద్రవ్య పంట ఓపియవ్‌ు, 2019 నాటికి 1,63,000 హెక్టార్లకు పెరిగింది.

అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ ‘యూఎస్‌ మిషన్‌ అఫ్గాన్‌లో విఫలమైంది. మధ్యదక్షిణాసియాలో ప్రాంతీయ భద్రతా పరిష్కార మార్గం ఇప్పుడు చైనా, రష్యా, ఇరాన్, భారత్‌లపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి చరమగీతం పాడి సహకరించాలి’ అన్నారు. ఈ దిశగా చర్చలు జరపటానికి మన విదేశాంగ ప్రతినిధి వర్గమొకటి కతార్‌లో తాలిబాన్లను కలుసుకొందని వార్తలొచ్చాయి. రష్యా చొరవతో అస్థానాలో, మాస్కోలో అనేక పర్యాయాలు శాంతిచర్చలు జరిగాయి. భారత్‌–రష్యా అనేక వేదికలలో కలిసి పని చేయటానికి విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాస్కో వెళ్లారు. తాజాగా ఉత్తర అఫ్గాన్‌లో తాలిబాన్ల దూకుడుతో అక్కడి ప్రజలు తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్‌లకు తరలిపోతుండటంతో ఆ దేశాల సుస్థిరత పట్ల రష్యా ఆందోళన చెందుతోంది. ఇది మధ్య ఆసియా దేశాలకు తక్షణ సవాలుగా ఉంది గనుక అర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్‌లను కూడా కలుపుకొని సహకార భద్రతా కూటమిగా ఏర్పడాలని రష్యా భావిస్తోంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి చైనాకు వ్యతిరేకంగా పాల్గొంటున్న భారతదేశం అదే సమయంలో పశ్చిమాన పాకిస్తాన్, తాలిబాన్లతో విరోధ బాటన పయనించటం శ్రేయస్కరం కాదనీ, కనుకనే మన విదేశాంగ విధానం ఇటీవల తన వైఖరిని మార్చి పాకిస్తాన్, తాలిబాన్లకు స్నేహహస్తం అందించిందనీ, తాలిబాన్ల ప్రభావం కశ్మీర్‌పై పడకుండా ఉండటానికే ఇటీవల మన ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసిందనీ విశ్లేషకులు అంటున్నారు.

బుడ్డిగ జమిందార్‌ 
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం, కార్యవర్గ సభ్యులు; 9849491969

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement