భౌగోళిక స్వరూపం, భిన్న తెగల సమ్మేళనం, కిరాయి సేనలతో యుద్ధాన్ని వృత్తిగా స్వీకరించిన స్థానిక ప్రభువుల ఉనికి అఫ్గానిస్తాన్‌కు ప్రత్యేకం. ఇవే ఆ చిన్న దేశాన్ని ఇస్లామిక్ ఉగ్రవాద ప్రయోగశాలగా మార్చాయి. అఫ్గాన్‌పై నాటి సోవియెట్ రష్యా దురాక్రమణ అనేక ఉగ్రవాద సంస్థలకు బీజాలు వేసింది. అవే అమెరికా దాడి, నిష్క్రమణ కాలాలకి శాఖోపశాఖలుగా విస్తరించాయి.
అఫ్గాన్ వర్తమాన సంక్షోభం వీటికి పరాకాష్ట. ఒక సమస్యగా ఇది ఆసియా స్థాయిని దాటిపోయిందని ప్రపంచ దేశాలు భయపడుతుంటే, పాకిస్తాన్ అక్కడి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల ఏకీకరణను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంది. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్, ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఉబ్జెకిస్తాన్, ఈస్ట్రన్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ వంటి సంస్థలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. ఈ అవాంఛనీయ ఏకీకరణతో అయినా కశ్మీర్ సాధించుకోవాలని పాక్ తలపెటిన పథకం వెల్లడైంది. తాలిబన్ ముట్టడి తరువాత ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ నాయకురాలు నీలమ్ ఇర్షాద్ షేక్ ఒక టీవీ చానల్‌లో ‘పాకిస్తాన్ సైన్యానికీ, తాలిబన్‌కీ మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్‌ను సాధించడంలో తాలిబన్లు మాకు తోడ్పడతారు.’ అని చెప్పారు. తాలిబన్ నేత బరాదర్ కాందహార్ వచ్చిన తరువాత ఐఎస్‌ఐ ప్రస్తుత అధిపతి ఫైజ్ హమీద్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ రహస్యంగా వెళ్లి అతడికి అభినందనలు తెలిపి వచ్చిన సంగతి కూడా బయటపడింది.
అమెరికా మీద విజయం సాధించాం కాబట్టి జిహాద్‌ను విస్తరించి, ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్, లిబియా, మొరాకో, అల్జీరియా, మారిటానియా, ట్యునీసియా, సోమాలియా, యెమెన్‌ల ‘విముక్తి’కి తరువాత ప్రాధాన్యం ఇవ్వాలంటూ పిలుపునిచ్చిన అల్‌కాయిదాకు, దాని అనుచర తాలిబన్‌కు పాకిస్తాన్ బహిరంగంగా ఇస్తున్న మద్దతు ఇది. జిహాద్‌తో ‘విముక్తం’ చేయవలసిన ప్రాంతాలలో కశ్మీర్ కూడా ఉంది. తాలిబన్ ఆధిపత్యంలోకి వచ్చిన అఫ్గాన్‌లో హక్కాని నెట్‌వర్క్ కమాండర్లు కీలక బాధ్యతలు చేపట్టారు. హక్కాని నాయకుడు ఖలీల్ ఉల్ రెహమాన్ హక్కాని కాబూల్ కొత్త సెక్యూరిటీ చీఫ్ అయ్యాడు. హక్కాని నెట్‌వర్క్ వ్యవస్థాపకుని కొడుకు జలాలుద్దీన్ హక్కానికి తాలిబన్ దళాలకు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసే బాధ్యత ఇచ్చారు. దీనితో తాను నిర్ణాయక శక్తిగా అవతరించవచ్చునని పాకిస్తాన్ నమ్ముతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఎలాంటి మాటలు చెప్పినా, అల్‌కాయిదా సహా, ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్న ఏ ఒక్క సంస్థనీ, ప్రస్తుత పరిస్థితిలో తాలిబన్లు దూరం చేసుకునే స్థితిలో లేరు. పాక్‌లో తర్ఫీదు పొందిన ఉగ్రవాదులను తాలిబన్‌తో కలసి పనిచేయడానికి ఈ తాజా సంక్షోభంలోనూ ఐఎస్‌ఐ పంపించింది. అందుకే పదిరోజులలోనే 70,000 నుంచి 1,10,000కు అక్కడి ఉగ్రవాదులు పెరిగినట్టు అంచనా. హక్కాని, తాలిబన్లు 1980 నుంచి పాకిస్తాన్‌తో, ఐఎస్‌ఐతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు. తాలిబన్‌ను అదుపులో ఉంచుకోవడానికి పాకిస్తాన్‌కు హక్కాని అవసరం ఉంది. పైగా ఇది భారత వ్యతిరేక సంస్థ. కొన్ని అంతర్జాతీయ నిఘా సంస్థల అంచనా ప్రకారం 1,500 నుంచి 2,000 వరకు లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులు, దాదాపు 2,500 మంది జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు తాలి బన్లతో కలసి ఇంతకాలం జిహాద్‌లో శ్రమించారు. నేడు వారే ఆక్రమిత కశ్మీర్‌లోని వాళ్ల శిక్షణ సంస్థలకి చేరుకుంటున్నారు. ఇది కశ్మీర్‌కు సరికొత్త బెడద. ఇప్పుడు ఐసిస్ (ఖొరాసన్) పేరు తెర మీదకు రావడం కూడా కొత్త ప్రశ్నలకు తావిచ్చేదే. దాదాపు 170 మందిని బలి తీసుకున్న కాబూల్ విమానాశ్రయం బాంబుదాడి (ఆగస్ట్ 26) వీళ్ల పనే. 2015 జనవరిలో అఫ్గాన్‌లో ఐఎస్ స్థాపించుకున్న అనుబంధ సంస్థ ఇస్లామిక్‌స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్. ఇదే ఐఎస్‌ఐఎస్ కె. ఇందులో ఎక్కువ మంది ఒకనాటి తెహ్రీక్ ఇ తాలిబన్ సంస్థ సభ్యులే. ఇస్లామిక్ సిద్ధాంతాల అమలు పట్ల నేతలు ఏమాత్రం మెతక వైఖరి చూపినా చాలామంది తాలిబన్ ఐసిస్‌కెలోకి ఫిరాయిస్తారని వినికిడి.
అఫ్గాన్‌లో తాలిబన్ పైచేయి కావడంతోనే అసలు పని మొదలైం దని పాక్ భావిస్తున్నది. ఆ వార్త తెలియగానే ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అజహర్ అనే పాక్ ఉగ్రవాద నేత వెళ్లి తాలిబన్ ప్రముఖులు ముల్లా బరాదర్, ముల్లా యాకూబ్‌లను కాందహార్‌లో కలుసుకున్నాడు. మేం చేసిన సాయానికి మీరు కూడా ప్రత్యుపకారం చేసే సమయం వచ్చేసిందని గుర్తు చేయడానికే రవూఫ్ అజహర్ వెళ్లాడని విశ్లేషకుల అంచనా. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ ఆగస్ట్ 16న ‘మంజిల్ కి తరఫ్’ అని పోస్ట్ పెట్టాడట. దానర్థం ‘గమ్యం వైపు’. అంటే అఫ్గాన్‌తో వారి లక్ష్యం పూర్తి కాలేదా? మరి లక్ష్యం ఏమిటి? అల్‌కాయిదా జిహాద్‌తో విముక్తం కావలసిన దేశాల జాబితాలోనే దీనికి జవాబు ఉంది. కాబట్టి అఫ్గాన్ మతోన్మాదశక్తుల ఏకీకరణ నుంచి పాక్ కోరుకునే లబ్ధి అంతా కశ్మీర్ సాధనకేనని అనుకోవచ్చు.
డాక్టర్ గోపరాజు నారాయణరావు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ‘ మొబైల్ : 98493 25634
Comments
Please login to add a commentAdd a comment