ఆధునిక భోజరాజు మోదీ | Nanduri Veeraiah Article On Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆధునిక భోజరాజు మోదీ

Published Wed, May 15 2019 12:15 AM | Last Updated on Wed, May 15 2019 7:55 AM

Nanduri Veeraiah Article On Narendra Modi - Sakshi

ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు సుప్రీం కోర్టులో రఫేల్‌ తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనపై అఫిడవిట్‌లో ఏమి రాయాలా అని ప్రభుత్వ న్యాయాధికారులంతా తలలు పట్టుకుని కూర్చున్నారు. కానీ ఇవేవీ పట్టనట్టు మోదీ మాత్రం ఎన్నికల ప్రచార సభలు వాయిదా వేసుకుని మరీ గంటా పది నిమిషాలపాటు అక్షయ్‌కుమార్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే తాను రాజకీయేతర అంశాలపై చర్చ చేయటానికి సిద్ధంగా ఉన్నానని మోదీ చెప్పటం ద్వారా ఇంటర్వ్యూ పరిధి చెప్పకనే చెప్పారు. దేశంలో పేరు ప్రఖ్యాతులు గడించిన విలేకరులు మోదీ ఇంటర్వ్యూ కోసం అర్జీలు పెట్టుకుంటే సమయం లేదని దాటేసిన ప్రధాని కార్యాలయం అక్షయ్‌కుమార్‌ను వెతికి పట్టుకుని మరీ ఇంటర్వ్యూ ఇప్పించింది. మోదీ∙బ్రాండ్‌కు గిరాకీ పడిపోతోందని గుర్తించిన ఆయన మీడియా మేనేజ్‌మెంట్‌ టీం వ్యూహరచన పర్యవసానమే అక్షయ్‌కుమార్‌ ఇంటర్వ్యూ.  

అధికారంలో ఉన్న ఐదేళ్లు చాలలేదు ప్రధానికి తన గురించి తాను పరిచయం చేసుకోవటానికి. సరిగ్గా ఎన్నికల నడుమ మాత్రమే హఠాత్తుగా గుర్తొచ్చింది. తన బాల్య  జ్ఞాపకాలు దేశానికి చెప్పాలనిపించింది. గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్వంత బాల్యాన్ని పాఠ్యాంశంగా చేసిన మోదీ నోట ఇలాంటి మాటలు వింటుంటే ఏమనిపిస్తుందో ప్రేక్షకులే తేల్చుకోవాలి. బహుశా బతికుండగానే తన గురించి పాఠాలు రాయించుకుని భుజకీర్తులు తగిలించుకున్న ముఖ్యమంత్రి, బతి కుండగానే సినిమా తీయించుకున్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచిపోతారు. బాల్యంలో శ్రీకృష్ణుడు ఎన్ని అద్భుతాలు చేశాడో కథలుకథలుగా చిన్నప్పుడు బాలజ్యోతి, బాలమిత్ర, చందమామ కథల పుస్తకాల్లో చదువుకున్నాము. ఇదే మూసలో మోదీ బాల్యం గుజరాత్‌ విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. మచ్చుకు అందులో ఓ కథ. ఒక రోజు పిల్లలతో కలిసి మోదీ సబర్మతి నదీ తీరాన బంతాట ఆడుకుంటున్నారు. సహజంగానే బంతి నదిలో పడింది. అది కూడా మొసళ్లు తిరుగాడే చోటు. ఇంకేముంది పిల్లలంతా మోదీ వంక చూశారు. వాళ్ల కళ్లలో కాంతుల కొవ్వొత్తి వెలుగుతుండగా మోదీ నదిలో దూకి బంతిని, బంతితో పాటు మొసలి పిల్లను చంకనబెట్టుకుని ఒడ్డుకొచ్చారు. ఇలాంటి కథలతో తనలో ఉన్నాయనుకుంటున్న అద్వితీయ, అద్భుత శక్తులే పిల్లలకు పాఠాలు చెప్పించిన మోదీ తనకు కీర్తి, కాంక్ష లేదని చెప్పుకుంటే నమ్మాలా వద్దా అన్నది జనం తేల్చుకోవాల్సిందే.  

ఇంటర్వ్యూలో మోదీ ఎన్ని గంటలకు అన్నం తింటారు? ఎన్ని గంటలకు నీళ్లు తాగుతారు? ఆయన సౌందర్యం వెనక రహస్యం ఏమిటి? వంటి ప్రశ్నలన్నీ దేశం తెలుసుకోవాల్సిన ప్రశ్నలు. ప్రధాని అవుతారని ఊహించారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్తూ మోదీ రాహుల్‌ గాంధీ పేరు చెప్పకుండానే ఆయనకున్నంత కుటుంబ నేపథ్యం తనకు లేదని, అయినా నిలదొక్కుకున్నానని చెప్పు కోవటం వెనక ఉన్న భేషజం వీక్షకుల దృష్టిని దాటిపోలేదు. కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలు, కీర్తి కాంక్ష లేకపోవటం తన ప్రత్యేకతగా చెప్పుకున్నారు. మరి యోగా చేస్తూ వీడియో విడుదల చేయటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కీర్తి కాంక్ష కాకపోతే మరేమిటి? ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అయినా తాను సాదా సీదాగా వ్యవహరిస్తున్నానని కబుర్లు చెప్పటంలో ఆంతర్యమేమిటి? బహుశా తన ఇమేజి పెంచుకోవటానికి తల్లినిసైతం సైడు పాత్రధారిగా వాడుకున్న మోదీ వ్యక్తిత్వం నుండి భావితరాలు ఏమి నేర్చుకోవాలి? 

ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేశానన్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండానే అరవై దేశాలు చుట్టి వచ్చారు. మరి సెలవు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో? ఇక వర్క్‌ కల్చర్‌ గురించిన మోదీ సంభాషణ. 130 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ, దేశ విదేశాలు తిరుగుతూ దేశ ప్రతిష్టను నిలబెట్టడానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో వేరే చెప్పాలా? తన ట్విట్టర్‌ అక్కౌంట్‌లో నిమిష నిమిషానికి తాజాపర్చటం, తన గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారో అలర్ట్‌గా ఉండటం కూడా ప్రధానికి అంతే ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. బహుశా భోజరాజు పాలనలో ధర్మ గంట పాత్ర మోదీ పాలనలో ట్విట్టర్‌ పోషిస్తోందేమో. అదే నిజమైతే మరి నిఘా విభాగాలు రద్దు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కలిసి వస్తుంది. ఇంటర్వ్యూ అంతా విన్న తర్వాత మామిడి పండునైనా కాకపోతిని మోదీ జిహ్వను చేరగా అని పాడుకోవాలని పిస్తోంది... హతవిధీ.

కొండూరి వీరయ్య 
వ్యాసకర్త రాజకీయ వ్యాఖ్యాత
మొబైల్‌ : 98717 94037

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement