ఆకాశంలో, పోరులో సగం... అధికారంలో?!
(సందర్భం)
తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కొత్త రాష్ట్రంలో ఏడాది పాలన కూడా గడిచింది. ఏడాది దొర ల పాలన గడిచిందనటం సబ బేమో. ఎందుకంటే అరవై ఏళ్ల తెలంగాణ పోరాటం సామా జిక న్యాయం కోసం జరిగింది. 2009 నుంచి 2014 వరకు సామాజిక, ప్రజాస్వామిక నినాదాల మీద జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా మలిదశ (1996) తెలంగాణ ఉద్య మం నడిచింది. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజ లకు అధికారంలో వాటా కోసమనే సామాజిక న్యాయం డిమాండ్ కూడా ఈ పోరాటంలో ఉంది. అన్ని వర్గాల ప్రజలు పోరాటంలో భాగం కావటం వలన రాబోయే తెలంగాణలో వారి వాటా ఉండాలని భావించారు.
కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోరాడిన శక్తులకు అన్యాయం జరిగింది.ఆ కాలంలో ఉదాసీనంగా లేదా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు, శక్తులకు అధికారం లో వాటా దక్కింది. ఉద్యమంలో విద్యార్థులు, యువత, రైతులు, కూలీలు, ఉద్యోగులు, ఇతర వృత్తుల ప్రజలు పోరాడారు. ఇక్కడ ప్రస్తావించిన అన్ని రంగాల వారితో కలసి స్త్రీలు కూడా సగభాగమై పాల్గొన్నారు. కానీ ఈ పితృస్వామ్య సమాజంలో స్త్రీలు అన్నిటా అన్యాయానికి గురైనట్లే తెలంగాణలో కూడా గురయ్యారు.
నాలుగు కోట్ల తెలంగాణ జనాభాలో రెండు కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. ఆకాశంలో సగంగా ఉన్న వీళ్లు పోరాటంలో కూడా సగమైనారు. తెలంగాణలో స్త్రీల చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడిని ఎదిరించి యుద్ధం చేస్తూ అమరులైన సమ్మక్క-సారక్కల వారసత్వాన్ని వారు అందిపుచ్చుకు న్నారు. నైజాం పరిపాలనలో విసునూర్ రామచంద్రారెడ్డి గూండాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి నాళ్లలో కూడా స్త్రీలు ముందంజలో ఉన్నారు. ఆరుట్ల కమ లాదేవి మరొక అద్భుత ఉదాహరణ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటై దూసుకొచ్చిన తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. తన పాతిక సంవత్సరాల జీవితాన్ని తెలం గాణ రాష్ట్రం కోసం అర్పించింది. ఆమెతో పాటు ఎంతో మంది దళిత, బీసీ, ఆదివాసీ, స్త్రీ కళాకారులు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నిలబెట్టారు. ఆ ఉద్యమాల పునా దుల మీదనే 2001లో టీఆర్‌ఎస్ పుట్టింది.
2009 నుంచి 2013 వరకు జరిగిన పోరాటంలో కూడా మంజుల (వరంగల్), రాధ (కరీంనగర్), కావలి సువర్ణ (పాలమూరు), కురువ సరిత (రంగారెడ్డి), చామంతి శ్రుతి (నిజామాబాద్) వంటి ఎందరో విద్యార్థి నులు ఆత్మబలిదానంతో ఉద్యమ దీపాన్ని వెలిగించారు.
ప్రత్యేక తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పా టుకు కావాల్సిన మెజారిటీతో గెలిచింది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ అతడే గద్దెనెక్కి కూర్చున్నాడు. పైగా 66 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో మహిళలకు మంత్రిపదవి దక్కని మంత్రివర్గం ఒక్క కేసీఆర్‌దే. ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా, లోక్‌సభ స్పీకర్‌గా కూడా ఇప్పుడు మహిళలు అవకాశం పొందారు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు మన దేశంలో కూడా ఎంతో కొంత మహిళలకు అధికారంలో భాగస్వామ్యం దక్కింది. కాని పోరాట చైతన్యం ఉన్న తెలంగాణలో పోరాడిన మహిళలకే అధికారంలో వాటా దక్కక పోవటం చూస్తే మగ పెత్తనం ‘దొరల’ రాజ్యం నడుస్తున్నదని అర్థమవుతుంది.
టీఆర్‌ఎస్‌లో బొడిగె శోభ, కోవా లక్ష్మి, రేఖానాయక్, పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత, కొండా సురేఖ లాంటి ఆరుగురు మహి ళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్క లేదు. పైగా కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవని తుమ్మ ల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహ రిలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. టీడీపీ నుంచి వలస వచ్చిన శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి కట్టబె ట్టారు. మహిళలకు మంత్రి పదవి వస్తే ఈ రాష్ట్రంలో మహిళలందరి జీవితాలూ మొత్తం మారిపోతాయని కాదు కాని, ఇది తెలంగాణలోని రెండు కోట్ల మహిళల ఆత్మగౌరవం సమస్య.
మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబే డ్కర్ వంటి సామాజిక విప్లవకారుల స్ఫూర్తితో సమ్మక్క -సారక్క, చాకలి ఐలమ్మ, బెల్లి లలిత పోరాట స్ఫూర్తితో మంత్రివర్గంలో చోటుతో పాటు అన్ని రంగాలలో స్త్రీలకు 50 శాతం వాటా దక్కటం కోసం పోరాటం చేయటం తప్ప మరో మార్గంలేదు. తల్లులు, అక్కలు, చెల్లెళ్లు, ప్రజాస్వామికవాదులు, మహిళా ఉద్యమ నాయకులు, విప్లవకారులు ఈ న్యాయమైన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి.
(నేడు హైదరాబాద్‌లో జరిగే మహిళా గర్జన సందర్భంగా...)
(వ్యాసకర్త మందకృష్ణ మాదిగ, ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ వ్యవస్థాపక అధ్యక్షులు) మొబైల్: 94407 23808