మహిళా ప్రాతినిధ్యం కోసం పోరు
* మూడు దశల్లో పోరాటం చేస్తాం
* కేబినెట్‌లో మహిళలకు చోటిచ్చే దాకాఉద్యమం: మంద కృష్ణ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే వరకు మూడు దశల్లో పోరాటం సాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ మహిళల పట్ల వివక్ష చూపుతున్నారంటూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ‘మహిళాగర్జన’లో ఆయన మాట్లాడారు. ఈ నెల 20వ తేదీలోపు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ఆ తర్వాత నెక్లెస్‌రోడ్డు వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేపడతామని చెప్పారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు 17 మంది మంత్రుల నియోజకవర్గాల్లో దీక్షలు చేస్తామని తెలిపారు. మహిళలపట్ల సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్న నిరంకుశ వైఖరిపై ప్రతిపక్షాలు పోరాటం చేయకపోవడం బాధాకరమన్నారు.
ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన 17 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసినట్లే మహిళలను కూడా విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ తరఫున ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలున్నా ఒక్కరికి కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల జరిగిన మండలి ఎన్నికల్లోనూ మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం వివక్షేనన్నారు. రానున్న 20 ఏళ్లు తమదే అధికారమంటూ అహంకారం ప్రదర్శిస్తున్న కేసీఆర్ పతనం ప్రారంభం కాబోతుందన్నారు.
కత్తి ఇంట్లో దాచిన కాంగ్రెస్
అధికారపక్షం అరాచకాలు చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మిన్నకుండిపోవడం బాధాకరమని మంద కృష్ణ వ్యాఖ్యానించారు. ‘సీఎం కేసీఆర్ హామీల విషయంలో వైఫల్యం చెందుతున్నా, ప్రభుత్వాన్ని నిలడీయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. కత్తిపట్టి పోరాటం చేయాల్సిన నేతలు మిన్నకుండిపోయారు. స్వయంగా సీఎం కేసీఆర్ కత్తి ఇస్తున్నా తీసుకునే స్థితిలో లేరు. ఎందుకంటే వారి చేతిలో ఉన్న కత్తినే ఇంట్లో దాచిపెట్టుకున్నారు.’ అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నేరళ్ల శారద, బీజేపీ మహిళా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ఆకుల లలిత, వైఎస్సార్‌సీపీ తరఫున శ్యామల, ఐద్వా అధ్యక్షురాలు ఆశలత, ప్రగతి శీల మహిళా సంఘం అధ్యక్షురాలు ఝాన్సీ తదితరులు మాట్లాడారు.