దళిత వ్యతిరేక విధానాలు మానుకోవాలి
కేసీఆర్‌కు మంద కృష్ణ హెచ్చరిక
హైదరాబాద్: సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేక విధా నాలను మానుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థా పక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. సోమవారం ఓయూలో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఒక్క నిందితుడినీ అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరో పించారు. దళితులను మోసగిస్తున్న కేసీఆర్ రిజర్వేషన్లలోనూ అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై కృష్ణ మాదిగ హర్షం వ్యక్తంచేశారు. ఇలాగే ఎస్సీలకు 18%, బీసీలకు 54% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా దామాషా ప్రకారం 93% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రిజర్వేషన్ల శాతం పెంచాలని ఈ వారంలో 24 గంటల దీక్షను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరా పార్కు వద్ద ధర్నాలు, సభలు, సమావేశాలు చేయనివ్వకపోతే ప్రగతి భవనం ఎదుట ఆందో ళనలు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న మోసాలను, అన్యాయాలను కొన్ని మీడియా సంస్థలు రాయడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగ స్వామిమాదిగ, కోఆర్డినేటర్ పురుషోత్తంమాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్, ఓయూ ఇన్‌చార్జి పల్లెర్ల సుధాకర్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.