
సాక్షి, న్యూఢిల్లీ: దళిత గిరిజనులపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో సింహగర్జన చేయాలని అత్యాచార నిరోధక పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ చైర్మన్ మంద కృష్ణమాదిగ నేతృత్వంలో ఇక్కడి పార్లమెంట్ వీధిలో ఎస్సీ, ఎస్టీలు ఆందోళనలో పాల్గొననున్నట్టు కమిటీ తెలిపింది.
భారత సమాజంలో పాతుకుపోయిన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో చివరి మెట్లయిన దళితులు, గిరిజనులు అనాదిగా ఛీత్కారాలకు, వేధింపులకు, అవమానాలకు, అత్యాచారాలకు, అకారణ హత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యంచేసే ప్రయత్నం చేసిందని, బీజేపీ ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు మార్చి 20న దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల ఆందోళన ప్రారంభమైందని వివరించారు.