ఎన్నికల తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లు
కేంద్ర మంత్రి వెంకయ్య హామీ ఇచ్చారు: మంద కృష్ణ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ జి.కిషన్‌రెడ్డితో కలసి వెంకయ్య నాయుడుతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరగా.. మంత్రి పైవిధంగా స్పందించినట్లు మంద కృష్ణ చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొంత బిజీగా ఉన్నామని, ఎన్నికలు పూర్తయిన వెంటనే వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈలోపు ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని, అఖిలపక్షంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ వెళ్లాలని వెంకయ్య సూచించినట్లు చెప్పారు.