'వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు లబ్ధి'
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసేవరకూ జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు లబ్ధి చేకూరుతుందని మందకృష్ణ తెలిపారు. వర్గీకరణకు మాలలు అడ్డుపడొద్దని ఆయన కోరారు. కాగా ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ తల పెట్టిన ఆందోళన కార్యక్రమాలు ఎనిమిదో రోజు కూడా కొనసాగుతోంది.