‘ఎస్సీ వర్గీకరణ’పై అభ్యంతరమేంటి?
♦ కేంద్ర ప్రభుత్వానికి మంద కృష్ణ సూటిప్రశ్న
♦ అందరూ మద్దతిస్తున్నా బిల్లు పెట్టకపోవడం వంచించడమే
♦ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ రిలే దీక్ష ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ అనుకూలంగా ఉన్నా వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అభ్యంతరమేంటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆరు రోజుల రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చిన బీజేపీ ఇకనైనా మౌనం వీడాలన్నారు.
కేంద్రం బిల్లు ప్రవేశపెడితే నిమిషంలో ఆమోదం పొందుతుందన్నారు. అందరూ మద్దతిస్తున్నా బిల్లు పెట్టకపోవడం మాదిగ జాతిని వంచించడమేనన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పంజాబ్‌లో వర్గీకరణ జరిగిందని, యూపీ ఎన్నికల సందర్భంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని సోనియా, రాహుల్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. యూపీఏ హయాంలో ఉషా మెహ్రా కమిషన్ వేశారని, ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసిందని మంద కృష్ణ చెప్పారు.
అధికారం శాశ్వతం కాదు...
తెలంగాణ రాష్ట్ర సాధనలో మాదిగల పాత్ర, ఎమ్మార్పీఎస్ కృషిని మరచిపోతే సీఎం కేసీఆర్‌ను మించిన దగాకోరు ఉండరన్నారు. సాయాన్ని మరచి ప్రవర్తిస్తున్న కేసీఆర్‌కు అధికారం శాశ్వతం కాదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి రావడానికి సహకరించి త్యాగాలు చేస్తే వర్గీకరణ వ్యతిరేకుల కబంధ హస్తాల్లో చిక్కుకుని మాదిగలకు ద్రోహం చేస్తున్నారన్నారు. మాదిగలు లేకుండా చంద్రబాబుకు అధికారం రాలేదని గుర్తుంచుకోవాలన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
కుట్రలు మాని అఖిలపక్షాలతో ఢిల్లీకి రావాలని ముఖ్యమంత్రులను డిమాం డ్ చేశారు. దీక్షకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాజా ఫక్రుద్దీన్, మైనారిటీ సెల్ ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ సాజిద్ ఖాన్, అడ్వొకేట్ జేఏసీ చైర్మన్ ఫరూఖ్ ఖాద్రీ మద్దతు పలికారు. దీక్షలో ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగడి సత్యం, ఎమ్మెస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్ గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌కు మద్దతివ్వాలని, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని జేడీయూ నేత శరద్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలసి మంద కృష్ణ విజ్ఞప్తి చేశారు.