
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దళితుడేనంటూ వాగ్దానం చేసి మాట తప్పారని విమర్శించినందుకు తనపై కక్ష గట్టి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హత్య చేయించేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో లేఖను సమర్పించారు. గత ఏడాది జూలై 8వ తేదీన ఈ కుట్రపై తనకు అనుమానం కలిగిందని, సూర్యాపేట నుంచి వరంగల్‌కు ప్రయాణిస్తుండగా తనపై కొందరు దాడికి యత్నించారని లేఖలో ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణకు తాము చేస్తున్న పోరాటానికి స్పందిస్తూ పలుమార్లు అఖిలపక్ష నేతలను ప్రధాని వద్దకు తీసుకెళ్తానని ప్రకటించి కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే రెండు సార్లు అరెస్టు చేశారని తెలిపారు. చివరగా రెండోసారి జనవరి 2న అరెస్టు చేసినప్పుడు 23 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో ఉండగా తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, ఇది వెలుగులోకి రావడంతో అమలుచేసేందుకు వెనకడుగు వేశారని వివరించారు.
తనను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని, భవిష్యత్తులో కూడా అణచివేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ఈ నెల 14వ తేదీన శాసనసభలో ప్రకటన చేశారని వెల్లడించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తనపై జరిగిన హత్యాయత్నంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇవే అంశాలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డికి వివరించినట్టు మంద కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment