మాదిగలను మభ్యపెట్టేందుకే లేఖ
♦ కేసీఆర్, మంత్రి వర్గ సహచరులది కపట నాటకం
♦ చంద్రబాబు నమ్మకద్రోహి: మంద కృష్ణ మాదిగ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు ఎస్సీ వర్గీకరణపై కపట నాటకం ఆడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. జంతర్ మంతర్ వద్ద నాలుగో రోజు రిలే దీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ కేసీఆర్, కడియం శ్రీహరి.. ప్రధానిని కలవడం వారి కపట నాటకంలో భాగమని ఆరోపించారు. ‘కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహచరులు ఉత్తరం ఇచ్చి అత్తరు చల్లుకుంటున్నారు.
ఇది కేవలం కంటి తుడుపు చ ర్య మాత్రమే. వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్లేవారు’ అని వ్యాఖ్యానించారు. మాదిగలను మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆపి అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాస ఘాతకుడని, నమ్మక ద్రోహం చేయడంలో ఆయనను మించిన వారు మరొకరు లేరంటూ విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్, మాదిగలు జీవం పోశారన్నారు. 13లోగా ఎన్డీయే సర్కారు వర్గీకరణ బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీల సంఘీభావం
ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామినవుతానని మాజీ మంత్రి, ఎంపీ మునియప్ప పేర్కొన్నారు. దీక్షకు సంఘీభావంగా నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్యతో పాటు ఆయన హాజరయ్యారు. త్వరలోనే కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం.. కేంద్ర మంత్రులను, ప్రధానిని కలిసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. నాలుగో రోజు దీక్షలో రాయలసీమ ప్రతినిధులు పాల్గొన్నారు.