బాబుకు గుణపాఠం తప్పదు
మంద కృష్ణ మాదిగ హెచ్చరిక
బౌద్దనగర్: మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టగతులు లేకుండా చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఆదివారం పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగలందరూ సహకరించడం వల్లే చంద్రబాబు తెలంగాణలో తిరుగగలిగాడని, ఆంధ్రాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారని అన్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వర్గీకరణపై మాటమారుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల విషయంలో పెద్ద మాదిగనవుతా, చెప్పులు కుట్టిన చేతులే చరిత్ర సృష్టిస్తాయని అన్న బాబు మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.తాము చంద్రబాబును నమ్మి నడిపించి సహకారం అందించగా, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అడ్డు చెప్పిన వారిని టీడీపీలో చేర్చుకుంటున్నారని మంద కృష్ణ విమర్శించారు.
చంద్రబాబు విశ్వాసఘాతుకానికి పాల్పడుతుండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిగ జాతిపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారని ఆరోపించారు. మాదిగలకు చిన్నచిన్న పదవులు ఇచ్చి వారిని తాబేదారులుగా మార్చుకున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం హోదాలో అసెంబ్లీలో ఎందుకు బిల్లు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తీర్మానం చేసి చేతులు దులుపుకోకుండా ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ఆయన సూచించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాల కులానికి చెందిన ఘంటా చక్రపాణి ఉంటే మాదిగ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మంద కృష్ణ ఆరోపించారు. ఆయనను తప్పించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని లేకుంటే ఎస్సీ వర్గీకరణ చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పడేసిన పనికిమాలిన పోస్టులకు ఆశపడి మాదిగ సోదరులే తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
లక్ష ఉద్యోగాలకు ఏ రిజర్వేషన్లు అమలు చేస్తారు?
తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుందని ఏ రిజర్వేషన్లు అమలు చేసి వీటిని భర్తీ చేస్తారో స్పష్టం చేయాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు 6, మైనార్టీలకు 4, మహిళలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని వాటినే ఇప్పుడూ అమలు చేయాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.
గిరిజనులకు 12, మైనార్టీలకు 12, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానపరిచిందని, దీనిపై మార్చి 7వ తేదీన లక్షలాది మంది మహిళలతో నగరంలో భారీ ప్రదర్శన చేపడతామన్నారు.