mahilagarjana
-
మహిళా ప్రాతినిధ్యం కోసం పోరు
* మూడు దశల్లో పోరాటం చేస్తాం * కేబినెట్లో మహిళలకు చోటిచ్చే దాకాఉద్యమం: మంద కృష్ణ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే వరకు మూడు దశల్లో పోరాటం సాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మహిళల పట్ల వివక్ష చూపుతున్నారంటూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ‘మహిళాగర్జన’లో ఆయన మాట్లాడారు. ఈ నెల 20వ తేదీలోపు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ఆ తర్వాత నెక్లెస్‌రోడ్డు వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేపడతామని చెప్పారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు 17 మంది మంత్రుల నియోజకవర్గాల్లో దీక్షలు చేస్తామని తెలిపారు. మహిళలపట్ల సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్న నిరంకుశ వైఖరిపై ప్రతిపక్షాలు పోరాటం చేయకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన 17 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసినట్లే మహిళలను కూడా విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తరఫున ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలున్నా ఒక్కరికి కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల జరిగిన మండలి ఎన్నికల్లోనూ మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం వివక్షేనన్నారు. రానున్న 20 ఏళ్లు తమదే అధికారమంటూ అహంకారం ప్రదర్శిస్తున్న కేసీఆర్ పతనం ప్రారంభం కాబోతుందన్నారు. కత్తి ఇంట్లో దాచిన కాంగ్రెస్ అధికారపక్షం అరాచకాలు చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మిన్నకుండిపోవడం బాధాకరమని మంద కృష్ణ వ్యాఖ్యానించారు. ‘సీఎం కేసీఆర్ హామీల విషయంలో వైఫల్యం చెందుతున్నా, ప్రభుత్వాన్ని నిలడీయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. కత్తిపట్టి పోరాటం చేయాల్సిన నేతలు మిన్నకుండిపోయారు. స్వయంగా సీఎం కేసీఆర్ కత్తి ఇస్తున్నా తీసుకునే స్థితిలో లేరు. ఎందుకంటే వారి చేతిలో ఉన్న కత్తినే ఇంట్లో దాచిపెట్టుకున్నారు.’ అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నేరళ్ల శారద, బీజేపీ మహిళా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ఆకుల లలిత, వైఎస్సార్సీపీ తరఫున శ్యామల, ఐద్వా అధ్యక్షురాలు ఆశలత, ప్రగతి శీల మహిళా సంఘం అధ్యక్షురాలు ఝాన్సీ తదితరులు మాట్లాడారు. -
మహిళా గర్జన వైఫల్యంపై అంతర్మథనం
టీడీపీ నేతలపై బాబు గరంగరం అందరిచూపు నియోజకవర్గ ఇన్చార్జులపైనే ఖర్చుకు వెనుకాడిన నేతలు కార్పొరే షన్ టికెట్ల ఎఫెక్ట్ సాక్షి, విజయవాడ : మహిళాగర్జన వైఫల్యంపై తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. పది గర్జనలు విజయవంతమై నగరంలో జరిగిన మహిళాగర్జనకు తగినంతమంది కార్యకర్తలను తరలించడంలో విఫలం కావడంతో అధినేత చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసేందుకు కూడా ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ నేతలంతా ఏకతాటిపై నడవకపోవడం వల్లనే మహిళాగర్జన విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లా ఎన్నికల పరిశీలకుడు సుజనాచౌదరి ఒంటెత్తు పోకడలు పోతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో ఆయన స్థానంలో ఇమ్మణి రాజేశ్వరి, కంభంపాటి రామ్మోహన్‌రావులను నియమించారని తెలుస్తోంది. పార్టీలో కలిసి పనిచేయని నేతలపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఇన్చార్జులే బాధ్యులా.. నియోజకవర్గ ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నవారే ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతారంటూ ఇప్పటికే పార్టీలో ప్రచారం జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని), నగరంలోని మూడు నియోజకవర్గాల ఇన్చార్జులే మహిళాగర్జనకు కార్యకర్తల్ని తరలించారంటున్నారు. టికెట్లు రానప్పుడు తమ చేతిచమరు వదిలించుకోవడం దేనికని భావించిన మిగిలిన నేతలు పట్టించుకోలేదని చెబుతున్నారు. కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికలో కూడా తమ అభిప్రాయాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ముగ్గురు ఇన్చార్జులు సూచించినవారికే సీట్లు కేటాయించడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు వచ్చినప్పుడు పెట్టే ఖర్చుకు తమను సంప్రదించడం, మిగిలిన సమయంలో తమకు విలువ ఇవ్వకపోవడం వల్లనే మహిళాగర్జనకు వీరంతా దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడే లక్షలు కుమ్మరిస్తే ఎన్నికల నాటికి ఖర్చు తడిసి మోపెడవుతుందన్న భయంతో నియోజకవర్గ ఇన్చార్జులు కూడా డబ్బులు బయటకు తీయలేదని తెలుస్తోంది. దీనికితోడు చంద్రబాబు పార్టీలో కొత్తవారిని చేర్చుకోవడం, దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి కూడా సీటుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఇప్పుడే డబ్బు ఖర్చు చేయడం అనవసరమనే భావనతో వారు పట్టించుకోలేదంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు లేకుంటే.. కార్పొరేషన్ ఎన్నికలు లేకపోతే ఆమాత్రం జనాలు కూడా వచ్చేవారు కాదని, నియోజకవర్గ ఇన్చార్జులు ఒత్తిడి చేయడంతో కార్పొరేటర్ అభ్యర్థులు తమతోపాటు తిరిగే కిరాయి కార్యకర్తల్ని తరలించారని చెబుతున్నారు. సరైన ఏర్పాట్లు లేనందువల్లే మహిళలు పెద్దగా రాలేదని చెబుతున్నారు. సాకులు వెతుకుతున్న నేతలు.. మహిళాగర్జన వైఫల్యంపై నేతలు సాకులు వెతుకుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నగర శివారులో సభ పెట్టినందువల్లే ప్రజలు పెద్దఎత్తున రాలేకపోయారంటున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో జిల్లాల నుంచి కార్యకర్తలు రాలేదని ప్రచారం చేస్తున్నారు. సభ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో కిరాయికి వచ్చిన కార్యకర్తలు కూడా చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యే వరకు కూర్చోకుండా వెళ్లిపోయారని చెబుతున్నారు. నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అవి చంద్రబాబు వరకు వెళ్లకుండా జాగ్రత్తపడుతూ మహిళాగర్జన వైఫల్యానికి కొత్తకొత్త కారణాలు అన్వేషించాలనే ఆలోచనలో నేతలున్నట్లు సమాచారం. -
టీడీపీలో మహిళలకు చోటేది!?
పేరుకే మహిళాగర్జన ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు దూరం స్థానిక ఎన్నికల్లోనూ ఆదరణ తక్కువే పెదవి విరుస్తున్న తెలుగింటి ఆడపడుచులు సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం నగరంలో మహిళాగర్జన నిర్వహించనున్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఊదరగొట్టే బాబు... దాన్ని ఆచరణలో చూపడం లేదంటూ పలువురు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో తెలుగు ఆడపడుచులకు తగిన గుర్తింపు లేదని సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎంపీ సీటు ఒక్కటీ లేదా.. జిల్లాలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటునైనా మహిళలకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు వివిధ నియోజకవర్గాల నుంచి పోటీపడుతున్న అభ్యర్థులను పరిశీలిస్తే మహిళల పేర్లు ఎక్కడా వినపడడం లేదు. విజయవాడ, బందరు, ఏలూరు (కొంతభాగం) పార్లమెంట్ నియోజకవర్గాలు కృష్ణాజిల్లా పరిధిలోకి వస్తాయి. ఈ మూడు నియోజకవర్గాల సీట్ల కోసం పురుషులే పోటీ పడుతున్నారు. పోత్తు పెట్టుకుంటే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి లేదా అక్కినేని అమల పోటీకి దిగవచ్చని చెబుతున్నారు. అంతేతప్ప టీడీపీలో ఎంపీ టికెట్ కోసం ఆశావహులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యేకూ అదే పరిస్థితి.. జిల్లా పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్క సీటు కూడా మహిళలకు కేటాయించే అవకాశం కనపడడం లేదు. ఇప్పటివరకు రేస్‌లో ఉన్న అభ్యర్థుల్ని పరిశీలిస్తే టీడీపీ తరఫున బరిలోకి దిగే మహిళలే లేరు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు పేర్లు పరిశీలిస్తున్నప్పటికీ వారిలో వనితల పేర్లు లేకపోవడం గమనార్హం. మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ పెనమలూరు ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కాంగ్రెస్ తిరువూరు ఎమ్మెల్యే పద్మజ్యోతిని టీడీపీలోకి ఆహ్వానించి ఆమెకు నందిగామ లేదా మరేదైనా సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది ఎంతమేరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి. స్థానిక సంస్థల్లోనూ అదే తీరు.. స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ లెక్కన నగరపాలకసంస్థల్లో 29 డివిజన్లు మహిళలకు కేటాయించారు. అయితే అంతకంటే ఎక్కువ మంది మహిళలు సీట్లకోసం పోటీ పడ్డారు. అయితే నిబంధనల మేరకు మహిళలకు కేటాయించిన డివిజన్లే మహిళా అభ్యర్థులకు ఇచ్చారు తప్ప అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు కొద్దిగా పెద్ద మనస్సు చేసుకుని మరో నాలుగైదు జనరల్ డివిజన్లు మహిళలకు ఇచ్చి ఉంటే బాగుండేదన్న భావన మహిళా అభ్యర్థుల్లో వ్యక్తమైంది. కాగా అర్బన్ మహిళా అధ్యక్షురాలు ఉషారాణికే సీటు ఇవ్వకపోవడంతో పార్టీలో మహిళలకు ఎంత మేరకు గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మహిళలకు అదనంగా కేటాయించిన సీట్లు లేవని మహిళలే చెబుతున్నారు. మహిళాగర్జనకు ఏర్పాట్లు పూర్తి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సింగ్‌నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జరగబోయే మహిళా గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గర్జనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొని మహిళా డిక్లరేషన్ చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డీవీ మనార్ హోటల్ నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా బయలుదేరి సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య సేడియానికి చేరుకుంటారని తెలిపారు. సాయంత్రం ఐదుగంటలకు బహిరంగ సభ జరుగుతుందన్నారు. మహిళాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా గర్జన సభలు తిరుపతి, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాలో విజయవంతంగా జరిగాయని, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత, అర్బన్ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, జల్లా మహిళా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి వనజ తదితరులు పాల్గొన్నారు.