మహిళా గర్జన వైఫల్యంపై అంతర్మథనం
- టీడీపీ నేతలపై బాబు గరంగరం
- అందరిచూపు నియోజకవర్గ ఇన్‌చార్జులపైనే
- ఖర్చుకు వెనుకాడిన నేతలు
- కార్పొరే షన్ టికెట్ల ఎఫెక్ట్
సాక్షి, విజయవాడ : మహిళాగర్జన వైఫల్యంపై తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. పది గర్జనలు విజయవంతమై నగరంలో జరిగిన మహిళాగర్జనకు తగినంతమంది కార్యకర్తలను తరలించడంలో విఫలం కావడంతో అధినేత చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసేందుకు కూడా ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ నేతలంతా ఏకతాటిపై నడవకపోవడం వల్లనే మహిళాగర్జన విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే జిల్లా ఎన్నికల పరిశీలకుడు సుజనాచౌదరి ఒంటెత్తు పోకడలు పోతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో ఆయన స్థానంలో ఇమ్మణి రాజేశ్వరి, కంభంపాటి రామ్మోహన్‌రావులను నియమించారని తెలుస్తోంది. పార్టీలో కలిసి పనిచేయని నేతలపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.
ఇన్‌చార్జులే బాధ్యులా..
నియోజకవర్గ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నవారే ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతారంటూ ఇప్పటికే పార్టీలో ప్రచారం జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని), నగరంలోని మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జులే మహిళాగర్జనకు కార్యకర్తల్ని తరలించారంటున్నారు. టికెట్లు రానప్పుడు తమ చేతిచమరు వదిలించుకోవడం దేనికని భావించిన మిగిలిన నేతలు పట్టించుకోలేదని చెబుతున్నారు.
కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికలో కూడా తమ అభిప్రాయాలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ముగ్గురు ఇన్‌చార్జులు సూచించినవారికే సీట్లు కేటాయించడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు వచ్చినప్పుడు పెట్టే ఖర్చుకు తమను సంప్రదించడం, మిగిలిన సమయంలో తమకు విలువ ఇవ్వకపోవడం వల్లనే మహిళాగర్జనకు వీరంతా దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడే లక్షలు కుమ్మరిస్తే ఎన్నికల నాటికి ఖర్చు తడిసి మోపెడవుతుందన్న భయంతో నియోజకవర్గ ఇన్‌చార్జులు కూడా డబ్బులు బయటకు తీయలేదని తెలుస్తోంది. దీనికితోడు చంద్రబాబు పార్టీలో కొత్తవారిని చేర్చుకోవడం, దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి కూడా సీటుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఇప్పుడే డబ్బు ఖర్చు చేయడం అనవసరమనే భావనతో వారు పట్టించుకోలేదంటున్నారు.
కార్పొరేషన్ ఎన్నికలు లేకుంటే..
కార్పొరేషన్ ఎన్నికలు లేకపోతే ఆమాత్రం జనాలు కూడా వచ్చేవారు కాదని, నియోజకవర్గ ఇన్‌చార్జులు ఒత్తిడి చేయడంతో కార్పొరేటర్ అభ్యర్థులు తమతోపాటు తిరిగే కిరాయి కార్యకర్తల్ని తరలించారని చెబుతున్నారు. సరైన ఏర్పాట్లు లేనందువల్లే మహిళలు పెద్దగా రాలేదని చెబుతున్నారు.
సాకులు వెతుకుతున్న నేతలు..
మహిళాగర్జన వైఫల్యంపై నేతలు సాకులు వెతుకుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నగర శివారులో సభ పెట్టినందువల్లే ప్రజలు పెద్దఎత్తున రాలేకపోయారంటున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో జిల్లాల నుంచి కార్యకర్తలు రాలేదని ప్రచారం చేస్తున్నారు. సభ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో కిరాయికి వచ్చిన కార్యకర్తలు కూడా చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యే వరకు కూర్చోకుండా వెళ్లిపోయారని చెబుతున్నారు. నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అవి చంద్రబాబు వరకు వెళ్లకుండా జాగ్రత్తపడుతూ మహిళాగర్జన వైఫల్యానికి కొత్తకొత్త కారణాలు అన్వేషించాలనే ఆలోచనలో నేతలున్నట్లు సమాచారం.