సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న ఇమ్యూనిటీ బూస్టర్ల ప్రచారం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతూ వారిలో భయాందోళనలకు, పలు అపశ్రుతులకు కారణం అవుతోంది. అయినా వైరస్ దూకుడు గురించి భయపడవలసిన అవసరం లేదు. మన దేశంలో క్రమంగా పరిస్థితులు మెరుగయ్యాయి. కరోనా ప్రాణనష్ట నివారణకు చెప్పే ప్రాథమిక సూత్రాలతో పాటుగా ఇప్పుడు ప్రాణ రక్షణకు చేసే ప్రత్యామ్నాయాలపై వైద్యులు, అధికార యంత్రాం గం దృష్టి సారించారు. రోగ నిరోధక శక్తితో వైరస్ నుంచి రక్షణ పొందవచ్చా? అన్న ప్రశ్నకు జవాబుగా సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా ప్రచారమౌతున్న వ్యాపార ప్రకటనలు, ప్రజలను మరింత అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే మ్యాజిక్ మాత్ర నిజంగానే ఏదైనా ఉందా? అయితే, పోషకాహారం–రోగనిరోధక శక్తి రెండూ పరస్పరం ముడిపడి ఉన్నాయని చాలాకాలంగా మనవద్ద ప్రచారంలో ఉంది.
మరిప్పుడు ఈ కోవిడ్–19 దాడి సమయంలో పోషకాహారంతో రక్షణ పొందవచ్చా? వయోవృద్ధులు, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోలేరనే అనుమానం ఉంది. ఆర్థిక స్తోమత ఉన్నవారిలో 75 శాతం మంది పెద్దలు ముందస్తు జాగ్రత్త కోసం రోజూ తీసుకునే మల్టీ విటమిన్ మాత్రలు గుండె జబ్బులు, క్యాన్సర్‌కి కారణమౌతూ, జ్ఞాపకశక్తిని తగ్గిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధి నివారణకు మల్టీ విటమిన్ వాడడం వలన పెద్దగా ఉపయోగం లేదు. నిజానికి సమతుల ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన బరువు, ఉప్పు, చక్కర వాడకం తగ్గించడం, ఆరోగ్యకరమైన కొవ్వు ఉపయోగించడం, వ్యాయామం ఇందుకు సరైన ఫార్ములా. శరీరంలోకి ప్రవేశించే ఏ క్రిమి ఐనా.. బ్యాక్టీరియా, పరాన్నజీవులే.. వీటిని ఎదుర్కొనే పోలీస్ వ్యవస్థగా తెల్లరక్త కణాల్లో ఉండే న్యూట్రోఫిల్సు, లింఫోసైట్లు పని చేస్తాయి. ప్రజలలో 70 నుంచి 90 శాతం మంది వ్యాధి బారిన పడినపుడు, హాని కలగడానికి ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో ఉండే రక్షణను ‘మంద నిరోధక శక్తి’ (హెర్డ్ ఇమ్యూనిటీ) అంటారు. ప్లీహం, ఎముక మజ్జ (బోన్ మారో) వల్ల ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ పెరుగుతుంది.
శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఎలా అనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. తమ ఆహార ఉత్పత్తులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, అనేక కంపెనీలు వ్యాపార ప్రకటనలు ఇస్తున్నాయి. ‘న్యూట్రాస్యూటికల్’ లేదా ఆహార అనుబంధ పదార్ధాలు లేదా ‘డైటరీ సప్లిమెంట్లు’ రోగ నిరోధకశక్తిని పెంచవని, అవి అశాస్త్రీయమైనవని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇమ్యూనిటీ నిపుణులు డా. రామ్ విశ్వకర్మ అంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే అసలైన మార్గాలు– సమతుల ఆహారం, వ్యాయామం, యోగాభ్యాసం, కనీసం 7 గంటల నిద్ర, విటమిన్ సి, విటమిన్ బి 12, విటమిన్ డి, జింక్ వంటివి అవసరం. కరోనాపై వైద్యులు ఎక్కువగా దృష్టి సారించినవి– విటమిన్ డి3, విట మిన్ సి, విటమిన్ బి 12, జింక్. ‘అసలు ఇమ్యూనిటీని పెంచడం అనేది ఆహ్వానించదగినది కాదని, వైరస్ నివారణకు, ఇమ్యూనిటీ పెంచడానికి ఎటువంటి సంబంధం లేదని, ఆయుర్వేద ఔషధాలు ఇమ్యూనిటీ పెంచుతాయని చెప్పడానికి ఎటువంటి అధ్యయనాలు లేవని’ సీఎంసీ రాయవెల్లూరు ఇమ్యునాలజీ అధిపతి ప్రొఫెసర్ దేబాశిష్ దండా అంటున్నారు.
నిజమే, వాటిని అల్లోపతి మందుల మాదిరి ముందుగా జంతువులలో, ఆ తరువాత మనుషులలో మూడు దశలలో ప్రయోగించి వాటి పని తీరును నిర్ధారించే అవకాశాలు లేవు. కొన్ని ఆయుర్వేద మందుల్లో లోహాలు, స్టెరాయిడ్ పెద్ద పరిమాణంలో కల్తీ చేయడం వలన మెదడు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయని నిరూపితమైంది. ఇమ్యూనిటీ బూస్టర్లు ప్రయోజనం నిజమని నమ్మిన కేసుల్లో రోగనిరోధక వ్యవస్థ విఫలమై ‘సైటోకైన్ స్టారం’తో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి ఆహార అలవాట్లలో జింక్, విటమిన్ సి లోపం అరుదైనది. కంపెనీల ప్రచారం కాకుండా నిపుణుల సూచనలు పాటిస్తే మంచిది. కరోనా కొద్ది శాతం మంది లోనే ప్రమాదకరం, 95 శాతం మందికి ఆసుపత్రుల అవసరం లేదు. మార్కెట్లో రూ. 2,000 దొరికే ‘పల్స్ ఆక్సీమీటర్’తో మనం ఇంటిలోనే వ్యాధి తీవ్రత ‘చెక్’ చేసుకోవచ్చు. ఆక్సిజన్ 93 శాతం లోపల ఉంటేనే ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం కలుగుతుంది.
డా. వల్లూరి రామారావు
వ్యాసకర్త చీఫ్ మెడికల్ ఆఫీసర్ (రిటైర్డ్)
సెంట్రల్ హెల్త్ సర్వీస్ ‘ 94908 77471
Comments
Please login to add a commentAdd a comment