చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడెప్పుడో స్కైలాబ్ పడుతుందన్నప్పుడు చూశాం ప్రపంచమంతా భయం గుప్పిట్లోకెళ్ళడం. స్కైలాబ్ ఏ ప్రాంతంలో పడుతుందో తెలి యక ప్రపంచంలోని ప్రజ లంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతకడం, ఎలాగూ చనిపోక తప్పదని భావించి కొంతమంది తమ తమ తీరని కోరికలు, చివరి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఆ సందర్భంగా చాలా చోట్ల మనుషులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం లాంటి విపరీత ధోరణులు ఎన్నో గమనించాము. చివరకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించి ప్రాణనష్టం జరగకుండా స్కైలాబ్‌ను ఎక్కడో సముద్రంలో పడేలా చేయడంతో యావత్ ప్రపంచం ఊపిరిపీల్చుకుంది.
మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరొక్కసారి కరోనా రూపంలో ఒక మహా భయోత్పాతం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. మొదట్లో దీనిపట్ల ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం వహించినప్పటికీ ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఈ కనిపించని కణం మనిషి కళ్లలో భయాన్ని నింపింది. అంతేకాదు ప్రస్తుతం మానవాళి జీవిత గమనాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. పొద్దున లేచినప్పటినుండి మొదలు రాత్రి పడుకునే వరకు ఏది చూసినా, ఏది మాట్లాడినా, ఏమీ చేసినా కరోనా జపం తప్ప మరొక ధ్యాస లేని మరో ప్రపంచాన్ని సృష్టించింది. కరోనా సృష్టించిన ఈ కల్లోల లోకంలో పాత్రలు,పాత్రధారులు ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు మునుపెన్నడూ కానరాని ముఖ చిత్రాలను ఆవిష్కరిస్తున్నాయి. మిత్ర దేశాల శత్రుభావం, వైరి దేశాల మధ్య మిత్రభావం మొలకెత్తుతోంది. ఆర్థిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం కరోనా ఉదంతం ముగిసిన తర్వాత భవిష్యత్తు వర్ధమాన దేశాలదే అని తేలుస్తుంటే, అగ్ర దేశాల మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఒకరింటికి వెళ్లలేము, మనింటికి వచ్చే వారు లేరు, పుట్టిన రోజులు లేవు, బారసాలలు లేవు, పెళ్లిళ్లు లేవు, పేరంటాలు లేవు, చస్తే వెంట వచ్చే వాళ్లు కూడా లేరు. శంకుస్థాపనలు లేవు. ప్రారంభోత్సవాలు లేవు, రాజకీయ నాయకుల వెనుక, బడా నేతల వెనుక జై కొట్టడానికి జనాలు లేరు. అభివృద్ధి ఆగిపోయి వైరస్ వృద్ధిని ఆపడమే నేడు ప్రపంచ ప్రథమ కర్తవ్యమైనది. కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇప్పటివరకు చెప్పుకున్నదంతా నాణానికి ఒకవైపు.. మరి నాణానికి ఇంకోవైపు చూస్తే.. ఈ రోజుల్లో మనిషి కోరుకున్నవి, కావాలనుకున్నవి, దక్కనివి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. రోజూ కాలంతో పోటీ పడి పరుగెత్తే మనిషికి దినమంతా కుటుంబంతో కలిసి వుండే అవకాశం వచ్చింది. ప్రశాంతతకు అర్థమే మరిచిపోయిన నగరారణ్యంలో హిమాలయ పర్వతాల్లో కూడా దొరకనంత ప్రశాంతత రాజ్యమేలుతోంది. వాతావరణ కాలుష్యం తగ్గింది, శబ్ద కాలుష్యం తగ్గింది, నేరాలు తగ్గాయి.
ఇన్నాళ్లూ అందరూ మర్చిపోయి అటకెక్కి కూర్చున్న తీరిక ఒక్కసారి ఒళ్లు విదుల్చుకొని గడప గడపకి తిరుగుతోంది. తన ఆవశ్యకత ఏంటో తెలియ చెప్తోంది. తను లేక, తనను దూరం చేసుకున్న మానవాళి ఏమి కోల్పోతుందో అప్పుడప్పుడు తనను ఆశ్రయిస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, జీవితం ఎంత హాయిగా ఉంటుందో అనుభవించమని చెబు తోంది. ఒకవైపు విద్యార్థులు స్కూల్‌కి వెళ్లకుండానే పై క్లాస్‌కి ప్రమోట్ అవుతుంటే, ప్రభుత్వోద్యోగులు ఇంట్లో ఉండే జీతాలు తీసుకొంటుంటే.. మరోవైపు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తీసేసి భారం తగ్గించుకుంటుంటే.. ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని అయోమయ పరిస్థితి. ఇంకా ఎంతకాలం ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలో తెలియదు, తిరిగి యథావిధిగా మానవ జీవనం మనుగడ సాగిస్తుందా లేక ఇంతకు ముందెన్నడూ లేని కొత్త జీవన విధానం ఏర్పడుతుందా. ఏది ఏమైనా కరోనా మనిషిని కలలో కూడా ఊహించని ఒక కొత్త లోకానికి తీసుకెళ్లింది.
డాక్టర్ రవిశంకర్
వ్యాసకర్త, ఈఎన్‌టీ స్పెషలిస్టు,
ప్రభుత్వ ఈఎన్‌టీ హాస్పిటల్, కోఠి, హైదరాబాద్
మొబైల్ : 94407 68894
Comments
Please login to add a commentAdd a comment