కరోనా తగ్గుతుందా? పెరుగుతుందా?.. మళ్లీ ప్రబలుతుంది అంటున్నారు.. నిజ మేనా? ఈసారెలా ఉండబోతోంది? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఇంకెంతకాలం ఇలా.. ఈరోజు ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు, ఇవే సందేహాలు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, ఎప్పుడేమి జరుగుతుందో తెలియక, ఎవరుం టారో ఎవరుండరో అర్థంకాక, ఎవరైనా కోవి డ్‌తో చనిపోయారనే వార్త వినగానే భయంతో హడలిపోతూ, దినదినగండంగా బతుకుతున్న ప్రజానీకం నవంబర్, డిసెంబర్ నాటికి కరోనా ఎఫెక్ట్ తగ్గిపోతుందని, అప్పటిలోగా కరోనాకు వ్యాక్సిన్ కూడా రావొచ్చనే గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ రాబోతుందనే వార్త ఇన్ని రోజుల ప్రజల ఆశలను సమూలంగా తుంచివేస్తోంది. కరోనా విజృంభణ కాస్త తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచం నాలుగు మాసాల అనంతరం దశల వారీగా లాక్‌డౌన్ నుండి బయటకు వచ్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. విద్యార్థులు ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో క్లాసులు అటెండ్ అవుతున్నారు. చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. బస్సులు, రైళ్లు, మెట్రోలు నడుస్తున్నప్పటికీ జనాలు వాటిల్లో ఎక్కువగా ప్రయాణించట్లేదు. మాస్కులు ధరిస్తున్నారు, శానిటైజర్స్ వాడుతున్నారు. భౌతిక దూరం పాటించడాన్ని మాత్రం ప్రజలు పట్టించుకోవడం లేదు.
ఈ మధ్యలో వచ్చిన రంజాన్, దసరా లాంటి పండుగల సందర్భంగా ప్రజలు గుంపులుగా చేరడం వల్ల మళ్లీ రెండవ విడత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నదని అధికారులు చెప్తున్నారు. భౌతిక దూరం పాటించకపోవడమే ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని అంటున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్‌లాంటి దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించడం జరిగింది. మనదేశంలో కూడా కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం గుబులు రేకెత్తిస్తున్న అంశం. తెలంగాణలో కూడా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగినట్టుగా గణాం కాలు చెప్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం కూడా రావొచ్చేమో. మన దేశంలో పరిస్థితి మాత్రం కాస్త మెరుగ్గానే ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య నుండి 90%కు పైగా రికవరీ అయ్యారు. మిగతా వారు చికిత్స పొందుతూ ఉన్నారు. మరణాల సంఖ్య మాత్రం పరిమితంగానే ఉంది. అనధికారిక అంచనాల ప్రకారం ఇప్పటికే దేశంలో ఎన్నో కోట్ల మందికి కరోనా సోకి ఉండవచ్చని చెప్తున్నారు. వీరంతా కూడా ఎటువంటి రోగ లక్షణాలు లేకుండా ఉండి, ఇన్ఫెక్షన్ సోకినందున ఇమ్యూనిటీ పొందినవారై ఉంటారు.
ప్రపంచంలో ఇప్పటికే దాదాపు 100కు పైగా పరిశోధనా సంస్థలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. చాలా వరకు మూడవ దశ అనగా చివరి దశలో ఉన్నాయి. మన దేశంలో కూడా మూడు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి. కాబట్టి అతి త్వరలోనే ఈ కరోనాకు వ్యాక్సిన్ వస్తుం దని భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ జాబితాలు తయారు చేస్తున్నారు. అంటే ఎవరికైతే కోవిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో, వారికి అందరికన్నా ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడంకోసం ఈ జాబితాలు తయారు చేయాలని నిర్ణయించారు. వారి తరువాత మిగతా వారందరికీ కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. వ్యాక్సిన్ వచ్చి సమాజంలో పూర్తి స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీ వృద్ధిచెందే దాకా, ఎన్ని విడతలైనా ఈ కోవిడ్ ప్రబలే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ విధిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్స్ వాడాలి. షేక్ హ్యాండ్ అసలే వద్దు. భౌతికదూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఏవన్నా లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. వ్యాక్సిన్ వచ్చేలోగా మన రక్షణ బాధ్యత మనమే తీసుకుందాం.
-డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి,
వ్యాసకర్త ఈఎన్‌టీ స్పెషలిస్ట్,
ప్రభుత్వ చెవి ముక్కు గొంతు వైద్యశాల, కోఠి, హైదరాబాద్
మొబైల్ : 94407 68894
Comments
Please login to add a commentAdd a comment