ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ వ్యవసాయాదాయం పెంచుకునే ఇతర రంగాలను అభివృద్ధి చేసుకున్నాయి. భారతదేశ ప్రాచీన, మధ్యయుగ కాలాల్లోని రాజ్యాల ప్రధాన వనరు అయిన భూమిశిస్తును వసూలు చేసింది సాంప్రదాయ రెవెన్యూ ఉద్యోగులే. అంటే దేశంలో అతి పురాతన శాఖ రెవెన్యూ శాఖే. అయితే ఆధునిక రెవెన్యూ శాఖ సృష్టి, రూపురేఖలన్నీ బ్రిటిష్ రాజ్ కాలంలోనే సంతరించుకున్నాయి.
బ్రిటిష్ వలస పాలనలో స్థాపితమైన అనేక వ్యవస్థలూ, చట్టాలూ కొన్ని యథాతథం గానూ, కొన్ని మార్పు చేర్పుల తోనూ ఇప్పటికీ కొనసాగు తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఆ కాలంలో పురుడుపోసుకున్నదే. ప్లాసీ యుద్ధం (1757) భారత దేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు వీలుకల్పించింది. బక్సార్ యుద్ధం (1764) ఆంగ్లేయుల అధికారాన్ని పటిష్ఠపరచింది. ఆ యుద్ధం తరువాత జరిగిన అలహా బాద్ సంధి ద్వారా మొగల్ చక్రవర్తి షా ఆలం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బెంగాల్, బిహార్, ఒరిస్సా, సుబాలలో దివానీ (శిస్తు వసూలు చేసుకునే) అధికారం పొందారు. ఉత్తర భారతంలో 1765 నుండి 1772 వరకు, అలాగే కర్ణాటక యుద్ధాలు విజయాల తరువాత దక్షిణాదిన కూడా బ్రిటిష్‌వాళ్లు శిస్తు వసూలుకు వివిధ పద్ధతులను పాటించారు.
బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 1772 మే 14న భూమిశిస్తు వసూలుకు ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్‌ను నియమించారు. అంటే కలెక్ట్టర్ ఉద్యోగ సృష్టి జరిగి మే 14 నాటికి 250 ఏళ్ళు పూర్తవుతుందన్న మాట! బెంగాల్ మొత్తంలో శిస్తు వసూలును పర్య వేక్షించడానికి ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ గవర్నర్ ఆధ్వ ర్యంలో ఏర్పాటయింది. తరువాత కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వచ్చిన కారన్ వాలీస్ ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ను సంస్కరించి, అన్ని బ్రిటిష్ ప్రావిన్స్‌ల లోనూ ఈ బోర్డులను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా మద్రాస్ ప్రావిన్స్‌లో ఏర్పడిన ఈ వ్యవస్థ 1977లో íసీఎల్‌ఆర్ శాఖ ఏర్పాటు వరకూ కొనసాగింది. ప్రస్తుతం దాని స్థానంలో సీసీఎల్‌ఏ 1999 నుంచి కొనసాగుతోంది.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో దేశంలో రెవెన్యూ సిబ్బంది నెరవేర్చిన బాధ్యతలు మరువ లేనివి. జమిందార్లకు శిస్తు వసూలు అధికారాలను రద్దు చేస్తూ, సాగుచేసే వాడికి భూమిపై హక్కులు కల్పిస్తూ చేసిన ‘ఎస్టేట్ రద్దు చట్టం–1948’ను అమలు చేయడం, ప్రతి పేదోడికి భూమిపై హక్కులను గుర్తించడానికి చేసిన ‘సర్వే అండ్ సెటిల్‌మెంట్’లో రెవెన్యూ శాఖవారి సేవ జీతంతో కొలవలేనిది. అలాగే ‘ల్యాండ్ సీలింగ్ యాక్ట్’ అమలు, ‘మిగులు భూమి’ని అర్హులుకు పంపిణీ చేయడం వంటివన్నీ రెవెన్యూ వారిని మరింత ప్రజల మనుషులను చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూ సంస్కరణ ఫలాలు పేదోడికి చేర్చిన ఘనత రెవెన్యూ శాఖదే!
స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచవర్ష ప్రణా ళికలో ఎన్నో లక్ష్యాల కొరకు ఎంతో భూసేకరణ చేయవలసి వచ్చింది. రెవెన్యూశాఖే ఆ బాధ్యతను తలకెత్తుకొంది. దేశాభివృద్ధి దృష్ట్యా కొత్త ప్రాజెక్టులు – ఇరిగేషన్, రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఉన్నత విద్యా సంస్థలు, భారీ పరిశ్రమలు వంటి ఎన్నో నిర్మాణాలకు భూసేకరణ అనే మహా యజ్ఞం రెవెన్యూ శాఖతోనే జరిగింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న శాశ్వత భూ హక్కు పథకం/ రీ సర్వే’ రెవెన్యూ శాఖ ద్వారానే జరుగుతోంది. పేదలందరికీ ఇళ్ళ పథకంలో 30 లక్షల పైగా ఇంటి పట్టాల పంపిణీకి భూసేకరణ అంతా రెవెన్యూ శాఖ చేతుల మీదుగానే జరిగింది. సంక్షేమ పథకాలలో అగ్రగామి అయిన నిత్యావసర వస్తువుల పంపిణీ రెవెన్యూ శాఖ భుజస్కంధాల పైనే నేటికీ నడుస్తోంది. తుపానులు, వరదలు అగ్ని ప్రమాదాల ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు రెవెన్యూ శాఖ పాత్రే ఎంతో కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటి సామా న్యుడి జననం నుండి మరణం వరకు కావలసిన ఎన్నో ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయడమే కాక సామాన్యుడి సేవలో నిరంతరం పనిచేసేది రెవెన్యూ శాఖే!
కోరాడ శ్రీనివాసరావు
వ్యాసకర్త తహశీల్దారు, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా ‘ 94410 08574
Comments
Please login to add a commentAdd a comment