ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన 35 లక్షల మంది పడగా, సుమారు రెండున్నర లక్షల మంది చనిపోయారు. అయినా ప్రపంచ దేశాలు మౌలిక అవసరాలైన విద్య, వైద్యాన్ని పక్కకు నెట్టి మిలిటరీ ఖర్చును విపరీతంగా పెంచుతున్నాయి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) ప్రతి ఏటా మిలిటరీ కోసం ఆయా దేశాలు వెచ్చిస్తున్న ఖర్చులను వెల్లడిస్తుంటుంది. 2019లో ప్రపంచ దేశా లన్నీ లక్షా 90 వేల కోట్ల డాలర్లు వ్యయం చేశాయని నివేదించింది. కరోనాను ఎదుర్కోవటంలో విఫల మవటానికి ప్రధాన కారణం ప్రజారోగ్య వ్యవస్థను చిన్నచూపు చూస్తూ, ఆయుధాలకు పెద్దపీట వేయడ మేనని సిప్రీ నివేదిక ద్వారా అర్థమవుతోంది.
73,200 కోట్ల డాలర్లతో ప్రపంచ మిలిటరీ ఖర్చులో అమెరికా వాటా 38 శాతం. రెండవ స్థానంలో ఉన్న చైనా (26,100 కోట్లు) కంటే రెండున్నర రెట్లు, నాలుగో స్థానంలో ఉన్న రష్యా(6,140 కోట్లు) కంటే పది రెట్ల ఖర్చుతో అమెరికా జెట్ స్పీడులో ఉంది. 2018లో ఐదవ స్థానంలో ఉన్న మన దేశం 2019 నాటికి ఆయుధ పోటీలో మూడవ స్థానానికి చేరు కుంది. ప్రతియేటా వేల కోట్ల డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. దాయాది పాకిస్తాన్ 1,030 కోట్ల డాలర్లు ఖర్చు చేసి 24వ స్థానంలో ఉంది. రష్యా ఐదు నుండి నాలుగో స్థానానికి రాగా, సౌదీ అరేబియా మూడు నుండి ఐదో స్థానానికి జారుకుంది. ముడిచమురు సంక్షోభంతో సౌదీ ఖర్చు తగ్గింది. కానీ తాను చేస్తున్న మిలిటరీ వ్యయంతో యెమెన్‌పై యుద్ద్ధం చేస్తూ అక్కడి ఆకలి చావులకు కారణమవుతున్నది.
ఫ్రాన్స్ తరువాత ఏడవ స్థానంలో ఉన్న జర్మనీ 4,930 కోట్ల డాలర్లు సైన్యానికి ఖర్చు చేస్తూ, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, అఫ్గానిస్తాన్‌కు తన సేనలను పంపిస్తు న్నది. 2020 మే 9 నాటికి ఫాసిస్టు హిట్లర్ జర్మనీ ఎర్ర సేనల చేతిలో ఓడిపోయి 75 ఏళ్లు. అయినా జర్మనీ చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోలేదు. 29 దేశాల రష్యా, చైనా వ్యతిరేక నాటో కూటమి ప్రపంచ మిలిటరీలో 54.5 శాతం ఖర్చు చేస్తోంది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యు.కె. వంటివి ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమిలోనే ఎక్కువ కరోనా మరణాలుండటం పరిశీలించాల్సిన అంశం. యుద్ధాలు, అంతర్యుద్ధాలతో వెనుకబాటుతనం, ఆకలి విలయతాండవం చేస్తున్నా ఆయుధ ఖర్చులు మాత్రం ఆపకుండా పెంచుకొంటున్నాయి ఆఫ్రికా దేశాలు. అవి 4,120 కోట్ల డాలర్లు వెచ్చించాయి.
ప్రపంచ మిలిటరీ ఖర్చులో 13 శాతం వెచ్చిస్తే ప్రపంచంలో అలుముకొన్న దారిద్య్రం, ఆకలి కను మరుగు అవుతాయనీ, 4 శాతం ఖర్చుతో ఆహార భద్రత, 5 శాతంతో ఆరోగ్య అవసరాలు, 12 శాతంతో అందరికీ విద్య, 3 శాతం ఖర్చుతో శుభ్ర మైన నీరు, పరిశుభ్రత సాధ్యపడతాయనీ 2018లో ‘సిప్రీ’ తెలిపింది. కరోనా ఉద్దీపన చర్యల్లో భాగంగా అమెరికా 2,20,000 కోట్ల డాలర్లు ప్రకటిం చింది. దీనిలో సింహభాగం బోయింగ్ వంటి కార్పొ రేట్ కంపెనీలకే కేటాయించారు. నిరుద్యోగ భృతికీ, వైద్య బీమాకూ జమచేసింది బహుతక్కువ. అమెరికా మిలి టరీ వ్యయాల్ని అధ్యయనం చేసిన గ్లోబల్ కేంపైన్ ఎన్జీవో ఆసక్తికర విషయాల్ని తెలిపింది. 8 కోట్ల 90 లక్షల డాలర్లు ఖరీదు చేసే ఎఫ్ 35 యుద్ధ విమా నాల్లాంటివి మూడు వేలు కొంటుంది పెంటగాన్.
ఒక్క విమానపు ఖర్చుతో ఒక సంవత్సరం పాటు 3,244 ఐసీయూ బెడ్స్‌కు అయ్యే ఖర్చును భరించవచ్చు. అదే జెట్ యుద్ధవిమానం ఒక గంట పాటు గాల్లో ఎగిరితే 44,000 డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ ధనంతో ఏడాది పాటు ఒక స్టాప్ నర్సుకు జీతం ఇవ్వవచ్చు. ఒక ‘ట్రైడెంట్ 2’ క్షిపణి ధర 3 కోట్ల 10 లక్షల డాలర్లు. ఈ మొత్తంతో కోటీ డెబ్బై లక్షల ఎన్ 95 మాస్కులు కొనవచ్చు. అమెరికా లాగా దేశాలకు దేశాలను దురాక్రమించడం లేదా ఇరుగుపొరుగు దేశాల్లో అలజడులను సృష్టించడం ధూర్త వైఖరి. ఇలాంటి జాఢ్యాలను దేశాలు తొలగించుకుంటే ఇంత తప్ప, ఈ సైనిక వ్యయానికి అడ్డుకట్ట ఉండదు. ప్రపంచ శాంతికై ఉద్యమించి, ఈ ఖర్చులను ప్రజా రోగ్యం వైపు మళ్లిస్తే కరోనా వంటి మహమ్మారులను సులభంగా ఎదుర్కోవచ్చు.
బుడ్డిగ జమీందార్
వ్యాసకర్త ఆలిండియా ప్రోగ్రెసివ్ ఫోరమ్
జాతీయ కార్యవర్గ సభ్యులు ‘ 98494 91969
Comments
Please login to add a commentAdd a comment