Public Health Services
-
అన్ని జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హెల్త్ ప్రొఫైల్ సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రెండు నెలల్లో అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ఈ నెల ఐదో తేదీన హెల్త్ సర్వే ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఇక అన్ని జిల్లాల్లోనూ వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని (హెల్త్ ప్రొఫైల్) సేకరిస్తారు. వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబర్ కేటాయిస్తారు. తద్వారా ఆన్లైన్లో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశముంటుంది. హెల్త్ ప్రొఫైల్ సేకరణ అనంతరం అందరికీ డిజిటల్ హెల్త్ కార్డు అందజేస్తారు. ప్రాథమిక స్థాయి పరీక్షలన్నీ.. వైద్య సిబ్బంది ప్రజల రక్తపోటు, మధుమేహం సంబంధిత పరీక్షలు, బ్లడ్ గ్రూప్, రక్తానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ (సీబీపీ), పూర్తిస్థాయి మూ త్ర పరీక్ష (సీయూఈ), ఊపిరితిత్తులు, కాలేయం పనితీరు, 3 నెలల షుగర్ టెస్ట్, రక్తంలో యూరియా శాతం, సీరమ్ క్రియాటినైన్, ఆల్కలైన్ ఫాస్పటేజ్ , టోటల్ కొలెస్ట్రాల్ టెస్టులతో పాటు గుండె పనితీరును ప్రాథమికంగా కనుగొనే ఈసీజీ చేస్తారు. ఇళ్లకు వెళ్లి కొన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరికొన్ని పరీక్షలు చేస్తారు. ఆయా వివరాలు, పరీక్షా ఫలితాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. తెలియని జబ్బులు బయటపడే అవకాశం 18 ఏళ్లు పైబడిన వారిలో కొందరికి సహజంగానే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రోడ్డు ప్రమాదం జరగొచ్చు. అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యం తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో అప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్య వివరాలు తెలుసుకునే సమయం ఉండదు. ఈ దృష్ట్యా ఆరోగ్య సమాచారం తక్షణమే అందుబాటులో ఉండేందుకు ఇలా హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తున్నారు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఏకీకృత నంబర్ ఆధారంగా సంబంధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని అప్పటికప్పుడు అంచనా వేసేందుకు సదరు వైద్యుడికి వీలుంటుంది. తద్వారా తక్షణమే వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఇలాంటి చెకప్‌ల వల్ల అప్పటివరకు తెలియకుండా ఉన్న చిన్నచిన్న అనారోగ్య సమస్యలు బయటపడే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు తొలిదశలోనే సంబంధిత జబ్బుకు వైద్యం చేయించుకునేందుకు వీలవుతుంది. అవసరమైన ఏర్పాట్లలో అధికారులు హెల్త్ ప్రొఫైల్ తయారీకి అవసరమైన నిర్ధారణ పరీక్షల పరికరాలను, ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రస్తుతం జరుగుతున్న పైలెట్ ప్రాజెక్టు కోసం పరికరాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ సర్వే కొనసాగించేందుకు వీలుగా వైద్య సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది చివరిలోగా అన్ని జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ సర్వేను పూర్తి చేసేలా ప్రణాళిక రచించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
ప్రజారోగ్యానికి అడుగడుగునా అడ్డంకులు
ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన 35 లక్షల మంది పడగా, సుమారు రెండున్నర లక్షల మంది చనిపోయారు. అయినా ప్రపంచ దేశాలు మౌలిక అవసరాలైన విద్య, వైద్యాన్ని పక్కకు నెట్టి మిలిటరీ ఖర్చును విపరీతంగా పెంచుతున్నాయి. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) ప్రతి ఏటా మిలిటరీ కోసం ఆయా దేశాలు వెచ్చిస్తున్న ఖర్చులను వెల్లడిస్తుంటుంది. 2019లో ప్రపంచ దేశా లన్నీ లక్షా 90 వేల కోట్ల డాలర్లు వ్యయం చేశాయని నివేదించింది. కరోనాను ఎదుర్కోవటంలో విఫల మవటానికి ప్రధాన కారణం ప్రజారోగ్య వ్యవస్థను చిన్నచూపు చూస్తూ, ఆయుధాలకు పెద్దపీట వేయడ మేనని సిప్రీ నివేదిక ద్వారా అర్థమవుతోంది. 73,200 కోట్ల డాలర్లతో ప్రపంచ మిలిటరీ ఖర్చులో అమెరికా వాటా 38 శాతం. రెండవ స్థానంలో ఉన్న చైనా (26,100 కోట్లు) కంటే రెండున్నర రెట్లు, నాలుగో స్థానంలో ఉన్న రష్యా(6,140 కోట్లు) కంటే పది రెట్ల ఖర్చుతో అమెరికా జెట్ స్పీడులో ఉంది. 2018లో ఐదవ స్థానంలో ఉన్న మన దేశం 2019 నాటికి ఆయుధ పోటీలో మూడవ స్థానానికి చేరు కుంది. ప్రతియేటా వేల కోట్ల డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. దాయాది పాకిస్తాన్ 1,030 కోట్ల డాలర్లు ఖర్చు చేసి 24వ స్థానంలో ఉంది. రష్యా ఐదు నుండి నాలుగో స్థానానికి రాగా, సౌదీ అరేబియా మూడు నుండి ఐదో స్థానానికి జారుకుంది. ముడిచమురు సంక్షోభంతో సౌదీ ఖర్చు తగ్గింది. కానీ తాను చేస్తున్న మిలిటరీ వ్యయంతో యెమెన్‌పై యుద్ద్ధం చేస్తూ అక్కడి ఆకలి చావులకు కారణమవుతున్నది. ఫ్రాన్స్ తరువాత ఏడవ స్థానంలో ఉన్న జర్మనీ 4,930 కోట్ల డాలర్లు సైన్యానికి ఖర్చు చేస్తూ, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, అఫ్గానిస్తాన్‌కు తన సేనలను పంపిస్తు న్నది. 2020 మే 9 నాటికి ఫాసిస్టు హిట్లర్ జర్మనీ ఎర్ర సేనల చేతిలో ఓడిపోయి 75 ఏళ్లు. అయినా జర్మనీ చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోలేదు. 29 దేశాల రష్యా, చైనా వ్యతిరేక నాటో కూటమి ప్రపంచ మిలిటరీలో 54.5 శాతం ఖర్చు చేస్తోంది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యు.కె. వంటివి ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమిలోనే ఎక్కువ కరోనా మరణాలుండటం పరిశీలించాల్సిన అంశం. యుద్ధాలు, అంతర్యుద్ధాలతో వెనుకబాటుతనం, ఆకలి విలయతాండవం చేస్తున్నా ఆయుధ ఖర్చులు మాత్రం ఆపకుండా పెంచుకొంటున్నాయి ఆఫ్రికా దేశాలు. అవి 4,120 కోట్ల డాలర్లు వెచ్చించాయి. ప్రపంచ మిలిటరీ ఖర్చులో 13 శాతం వెచ్చిస్తే ప్రపంచంలో అలుముకొన్న దారిద్య్రం, ఆకలి కను మరుగు అవుతాయనీ, 4 శాతం ఖర్చుతో ఆహార భద్రత, 5 శాతంతో ఆరోగ్య అవసరాలు, 12 శాతంతో అందరికీ విద్య, 3 శాతం ఖర్చుతో శుభ్ర మైన నీరు, పరిశుభ్రత సాధ్యపడతాయనీ 2018లో ‘సిప్రీ’ తెలిపింది. కరోనా ఉద్దీపన చర్యల్లో భాగంగా అమెరికా 2,20,000 కోట్ల డాలర్లు ప్రకటిం చింది. దీనిలో సింహభాగం బోయింగ్ వంటి కార్పొ రేట్ కంపెనీలకే కేటాయించారు. నిరుద్యోగ భృతికీ, వైద్య బీమాకూ జమచేసింది బహుతక్కువ. అమెరికా మిలి టరీ వ్యయాల్ని అధ్యయనం చేసిన గ్లోబల్ కేంపైన్ ఎన్జీవో ఆసక్తికర విషయాల్ని తెలిపింది. 8 కోట్ల 90 లక్షల డాలర్లు ఖరీదు చేసే ఎఫ్ 35 యుద్ధ విమా నాల్లాంటివి మూడు వేలు కొంటుంది పెంటగాన్. ఒక్క విమానపు ఖర్చుతో ఒక సంవత్సరం పాటు 3,244 ఐసీయూ బెడ్స్‌కు అయ్యే ఖర్చును భరించవచ్చు. అదే జెట్ యుద్ధవిమానం ఒక గంట పాటు గాల్లో ఎగిరితే 44,000 డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ ధనంతో ఏడాది పాటు ఒక స్టాప్ నర్సుకు జీతం ఇవ్వవచ్చు. ఒక ‘ట్రైడెంట్ 2’ క్షిపణి ధర 3 కోట్ల 10 లక్షల డాలర్లు. ఈ మొత్తంతో కోటీ డెబ్బై లక్షల ఎన్ 95 మాస్కులు కొనవచ్చు. అమెరికా లాగా దేశాలకు దేశాలను దురాక్రమించడం లేదా ఇరుగుపొరుగు దేశాల్లో అలజడులను సృష్టించడం ధూర్త వైఖరి. ఇలాంటి జాఢ్యాలను దేశాలు తొలగించుకుంటే ఇంత తప్ప, ఈ సైనిక వ్యయానికి అడ్డుకట్ట ఉండదు. ప్రపంచ శాంతికై ఉద్యమించి, ఈ ఖర్చులను ప్రజా రోగ్యం వైపు మళ్లిస్తే కరోనా వంటి మహమ్మారులను సులభంగా ఎదుర్కోవచ్చు. బుడ్డిగ జమీందార్ వ్యాసకర్త ఆలిండియా ప్రోగ్రెసివ్ ఫోరమ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ‘ 98494 91969 -
సంక్షోభంలో ప్రజారోగ్యం: పొంగులేటి
న్యూఢిల్లీ: దేశంలో ప్రజారోగ్య సేవలు సంక్షోభంలో కూరుకుపోయాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోక్‌సభలో ఆందోళన వ్యక్తంచేశారు. వైద్యారోగ్య శాఖ పద్దులపై బుధవారం ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రజారోగ్య సేవలు తగినంత లేవని, ఉన్నా నాణ్యత లోపించిందని ఆవేదన వ్య క్తం చేశారు. ప్రైవేటు రంగాన్ని నమ్ముకోవడంతో సామాన్యు డి జేబులకు చిల్లుపడుతోందని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, హృద్రోగ వ్యాధుల నివారణకు ఓ ఆరోగ్యవిధానం ప్రవేశపెట్టాలన్నారు. యూజీసీ చట్టం ప్రకారమే డీమ్డ్ యూనివర్సిటీలు యూజీసీ చట్టం 1356 కింద డీమ్డ్ యూనివర్సిటీలకు గుర్తింపు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. డీమ్డ్ వర్సిటీల ఏర్పాటు, నిధుల విధివిధానాలపై పొంగులేటి బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు స్మృతి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ ఆ వర్సిటీలకు వెళ్లి తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది తదితరాలపై కమిషన్‌కు నివేదిక అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ నివేదికను మంత్రిత్వ శాఖ సిఫార్సుకు కమిషన్ పంపిస్తుందని, యూజీసీ సలహా మేరకే డీమ్డ్ వర్సిటీలకు మంత్రిత్వ శాఖ గుర్తింపునిస్తుందని ఆమె వివరించారు. ఇదిలా ఉండగా డీడీఏ ఫ్లాట్లలోని టెర్రాస్‌లో అక్రమ నిర్మాణాలపై గడిచిన మూడేళ్ల నుంచి తీసుకున్న చర్యలు, నమోదైన కేసులపై పొంగులేటి అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. డీడీఏ హౌజింగ్ పథకంలో అక్రమ నిర్మాణాలపై ఈ ఏడాదితో కలిపి గడిచిన మూడేళ్లలో 78 కేసులు నమోదైనట్టు బాబుల్ తెలిపారు. 95% అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ నగర పాలకసంస్థ చర్యలు తీసుకుందన్నారు.