సంక్షోభంలో ప్రజారోగ్యం: పొంగులేటి
న్యూఢిల్లీ: దేశంలో ప్రజారోగ్య సేవలు సంక్షోభంలో కూరుకుపోయాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోక్‌సభలో ఆందోళన వ్యక్తంచేశారు. వైద్యారోగ్య శాఖ పద్దులపై బుధవారం ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రజారోగ్య సేవలు తగినంత లేవని, ఉన్నా నాణ్యత లోపించిందని ఆవేదన వ్య క్తం చేశారు. ప్రైవేటు రంగాన్ని నమ్ముకోవడంతో సామాన్యు డి జేబులకు చిల్లుపడుతోందని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, హృద్రోగ వ్యాధుల నివారణకు ఓ ఆరోగ్యవిధానం ప్రవేశపెట్టాలన్నారు.
యూజీసీ చట్టం ప్రకారమే డీమ్డ్ యూనివర్సిటీలు
యూజీసీ చట్టం 1356 కింద డీమ్డ్ యూనివర్సిటీలకు గుర్తింపు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. డీమ్డ్ వర్సిటీల ఏర్పాటు, నిధుల విధివిధానాలపై పొంగులేటి బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు స్మృతి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ ఆ వర్సిటీలకు వెళ్లి తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది తదితరాలపై కమిషన్‌కు నివేదిక అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ నివేదికను మంత్రిత్వ శాఖ సిఫార్సుకు కమిషన్ పంపిస్తుందని, యూజీసీ సలహా మేరకే డీమ్డ్ వర్సిటీలకు మంత్రిత్వ శాఖ గుర్తింపునిస్తుందని ఆమె వివరించారు. ఇదిలా ఉండగా డీడీఏ ఫ్లాట్లలోని టెర్రాస్‌లో అక్రమ నిర్మాణాలపై గడిచిన మూడేళ్ల నుంచి తీసుకున్న చర్యలు, నమోదైన కేసులపై పొంగులేటి అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. డీడీఏ హౌజింగ్ పథకంలో అక్రమ నిర్మాణాలపై ఈ ఏడాదితో కలిపి గడిచిన మూడేళ్లలో 78 కేసులు నమోదైనట్టు బాబుల్ తెలిపారు. 95% అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ నగర పాలకసంస్థ చర్యలు తీసుకుందన్నారు.