
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ అట్టడుగు వర్గాలను, నిరుపేదలను దారుణంగా దెబ్బతీసిందనడంలో సందేహమే లేదు. సమాజం ఏమాత్రం సిద్ధం కాకముందే ముందుజాగ్రత్త చర్యగా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా స్తంభింపచేశారు. జాతీయ విపత్తులు, ఆకస్మిక ఘటనలు ఎదురైన సమయంలో ఆర్థిక అంతరాయాలు కలిగినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పనిచేస్తూ వచ్చింది కానీ లాక్‌డౌన్ మనం కనీవినీ ఎరుగనంత స్థాయిలో వచ్చిపడింది.
పెద్ద నోట్ల రద్దు సృష్టించిన ప్రకంపనల సమయంలో కానీ, జీఎస్టీ విధింపుతో వచ్చిన అంతరాయాల సమయంలో కానీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోలేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యక్తిగత గృహరుణాలు అత్యంత అధిక స్థాయికి చేరుకున్నాయి. పొదుపులు కూడా దారుణంగా పడిపోయాయి. నాలుగు కారణాల వల్ల అట్టడుగు వర్గాలు లాక్‌డౌన్ నేపథ్యంలో దారుణంగా దెబ్బతిన్నాయి. 1. దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా పేదప్రజలు తమ స్వస్థలాలకు తరలి వెళ్లలేకపోయారు. 2. అన్ని రంగాలపై ఒకే సమయంలో లాక్‌డౌన్ ప్రకటిం చారు. 3. సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగడంతో దిగువ తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే రుణ పరపతి మార్గాలు మూసుకుపోయాయి. 4. నిత్యావసర వస్తువులు పేదవారికి అందుబాటులో లేకుండా పోయాయి. ధరలు పెరిగి పోయాయి.
దేశవ్యాప్తంగా, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాలపై ఒకే సమయంలో లాక్‌డౌన్ విధించడం వల్ల దేశందేశమే స్తంభించిపోయింది. దీంతో పనికోసం వెతుక్కుంటూ వలసపోయే అవకాశం ప్రజలకు ఏమాత్రం లేకుండా పోయింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లాగా కాకుండా, అసంఘటిత రంగానికి సంబంధించి వాస్తవ గణాంకాలు మనకు అందుబాటులో ఉండవు. తాజా నివేదిక ప్రకారం దేశంలో హోటల్, పర్యాటక సంబంధిత రంగాల్లో ఏడు కోట్లమంది కార్మికులు లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారని తెలుస్తోంది. 85 శాతం కార్మికులు సంఘటిత రంగానికి వెలుపలే ఉండటంతో వీరి వేతనాలు, కూలీలు చెల్లించకుండా నిలిపివేశారు.
మామూలు సందర్భాల్లో అయితే అట్టడుగువర్గాల ప్రజలు తమ పొరుగునే ఉన్న కిరాణా దుకాణాలు, ఇతర షాపుల్లో రుణం ప్రాతిపదికన లేదా నెల చివరలో చెల్లిస్తామనే ఒడంబడికతో నిత్యావసర వస్తువులు కొనుక్కునేవారు. అయితే నిత్యావసర సరుకుల రవాణా స్తంభించిపోవడంతో సరఫరాకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడినందున మొదట్లో కొద్ది రోజులు తప్ప చాలా ప్రాంతాల్లో అప్పుకు సరుకులు ఇచ్చే వెసులుబాటు లేకుండాపోయింది. ఇలా ఆదాయాలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో అట్టడుగు వర్గాల ప్రజలను లాక్‌డౌన్ తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపుగా సంఘటిత రంగంపై ఆధారపడటం, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో తప్పితే సామాజిక భద్రత లేకపోవడం వల్ల వీరికి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ కారణం వల్లే పేద వర్గాలపై లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. అందుకే ప్రతిరోజూ కిలోమీటర్ల దూరం నడిచిపోతున్న వలస కార్మికులకు సంబంధించిన దిగ్భ్రాంతి కరమైన దృశ్యాలను దేశం చూడాల్సి వస్తోంది.
దేశంలోని విభిన్న వర్గాల ప్రజలపై ఈ సంక్షోభం ప్రభావం పూర్తి భిన్నంగా ఉంటోంది. రబీ పంట కోతల సమయంలో వలస కూలీలు ప్రయాణించడానికే వీలు లేకపోవడంతో గ్రామీణ వ్యవసాయ వేతనాలు పెరిగాయి. కూలీలు దొరక్కపోవడంతో లేబర్ ఖర్చు బాగా పెరిగింది. ఈ సంక్షోభంలో చిన్న స్థాయి వ్యాపారులు, అత్యవసరం కాని సేవారంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా దెబ్బతినిపోయారు. అట్టడుగువర్గాల నుంచి వచ్చిన కార్మికుల్లో ఎక్కువమంది వ్యవసాయ కూలీలుగానూ లేక వ్యవసాయేతర పరిశ్రమల్లో కార్మికులుగానూ ఉంటున్నారు. వీరిపైనే చాలా వరకు సంక్షోభ ప్రభావం కనిపిస్తుంది.
లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతినిపోయిన వారి సహాయార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంఘటిత బ్యాంకింగ్ రంగం నుంచి రుణాలను కనీసం రీ షెడ్యూల్ చేస్తే అట్టడుగు వర్గాలవారిని కాస్తయినా ఆదుకోవచ్చు. ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు ఒకేసారి రూ.10,000 మొత్తం కానీ లేక వడ్డీ లేని రుణాలు కాని ఇస్తే పేదవర్గాలు కొంతమేరకైనా కోలుకుంటాయి. అలాగే కరోనా ప్రభావం గురించిన జాగరూకతను ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉంది. భౌతికదూరం, వ్యక్తిగత పారిశుధ్యం పాటించడం తప్పనిసరి.
డా.ఎస్. సుధాకర్‌బాబు
వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్
మానవ వనరుల అభివృద్ధి కేంద్రం
హైదరాబాద్ యూనివర్సిటీ
మొబైల్ : 94404 59464
Comments
Please login to add a commentAdd a comment