ప్రత్యూష కథ: ఎడారిలో వసంతం లాగా | Narsan Special Article On CM KCR Adopted Daughter Prathyusha | Sakshi
Sakshi News home page

నిత్య గాయాల నుంచి శుభాక్షితల దాకా...

Published Fri, Jan 1 2021 1:15 AM | Last Updated on Fri, Jan 1 2021 12:10 PM

Narsan Special Article On CM KCR Adopted Daughter Prathyusha - Sakshi

ప్రత్యూష పెళ్లికూతురు అయింది. 28 డిసెంబర్‌ 2020 నాడు చరణ్‌ రెడ్డితో పెళ్లి కావడంతో 24 ఏళ్ళ ఆ యువతి ఓ ఇంటావిడ అయింది.  ఎడారిలో వసంతంలాగా నేడు సుఖాంతమైన ప్రత్యూష జీవితం అనూహ్య మలుపులకు కేంద్ర బిందువు. 17 ఆగస్టు 2015 తెల్లవారు 6 గంటల సమయం. సమాచారం అందిన వెంటనే బాలల హక్కుల సంఘం అచ్యుతరావు ఎల్బీనగర్‌ స్టేషన్‌ లేడీ కానిస్టేబుల్‌ తోడుగా ఓ టీవీ చానల్‌ను వెంట తీసుకోని నాగోలు బండ్లగూడలోని ఆ ఇంటి తలుపు తట్టారు. ఇల్లంతా వెతుకగా గిన్నెలు తోముతూ వారికి ప్రత్యూష కనిపించింది.

ఆ శరీరంలో నిలబడి నాలుగడుగులు వేసే శక్తి లేదు. ఎండిన ప్రేవులతో తడారిన గొంతుతో మాట పెగలడం లేదు. నల్లగా కమిలిపోయి పొంగిన బుగ్గ లతో ఎండు కట్టెలా నిలబడ్డ ప్రత్యూష ముఖం నిండా గాట్లు, చేతులపై వాతలు. పత్రికల్లో ఈ వార్త చదివిన వారికీ గుండెలు ద్రవించే పరిస్థితి. టీవీల్లో ప్రత్యూషని చూసినవారు చలించిపోయారు. తక్షణ వైద్య సహాయం కోసం ఆమెను దగ్గర్లోని గ్లోబల్‌ హాస్పిటల్లో చేర్పించారు. రెండ్రోజుల్లో కాస్త కోలుకొని, హాస్పిటల్‌ బెడ్‌ పైనుంచే టీవీ, పత్రికలవాళ్ళ ప్రశ్నలకు సమా ధానమిచ్చింది.     

2015లో అచ్యుతరావు ప్రత్యూషను కాపాడినప్పటి చిత్రం

ప్రత్యూష తల్లి సరళ ‘మిస్‌ ఆంధ్ర’ కిరీటం గెలుచు కున్న బ్యూటీషియన్‌. ఇంటికి దగ్గర్లో బ్యూటీ పార్లర్‌ నడిపేది. తండ్రి రమేశ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి.  1996లో ప్రత్యూష పుట్టింది. హాయిగా సాగుతున్న సంసారంలోకి రమేశ్‌ సహోద్యోగి శ్యామల ప్రవేశించింది. తన బ్యూటీ పార్లర్‌లో వీరిరువురి శారీరక సంబంధాన్ని స్వయంగా చూసిన సరళ నిలదీయడం పర్యవసానంగా 2003లో వారి వైవాహిక బంధం తెగి పోయింది. కూతురు ప్రత్యూషతో సరళ విడిగా బతక నారంభించింది. కుటుంబ జీవితంలో వచ్చిన ఒడి దుడుకులను తట్టుకోలేక సరళ 2010 డిసెంబర్‌లో ఆత్మహత్య చేసుకుంది. తల్లి తోబుట్టువుల నిరాదరణ వల్ల ప్రత్యూష జీవితం అనాథాశ్రయానికి చేరింది. కొంత కాలానికి తండ్రి వచ్చి ఇంటికి తీసికెళ్ళాడు.

ఒక సంవత్సరం బాగానే గడిచింది. ప్రత్యూష చదువు కొనసాగించింది. క్రమంగా సవతి తల్లి శ్యామలలో ప్రత్యూష పట్ల క్రూరత్వం మొదలైంది. చదువు మాన్పించింది. జుట్టు కత్తిరించింది. కత్తితో గాట్లు, వాతలు, ఇనుప రాడ్లతో, సుత్తితో బాదడం నిత్య కృత్యమైంది. రోజుల తరబడి ఆకలితో మాడ్చింది. తండ్రి ఆ అకృత్యాలను చూస్తూ నవ్వుతూ పేపర్‌ చదువుకొనేవాడు. సుమారు రెండేళ్ల పాటు ఈ దుర్భర జీవితాన్ని అనుభవించిన ప్రత్యూష బాలల హక్కుల సంఘం చొరవతో బయటపడింది. ఐదు రోజులపాటు హాస్పిటల్లో ప్రత్యూష వెంట ఉన్న అచ్యుతరావు డిశ్చార్జి అయ్యాక కూడా ఆమె బాగోగుల బాధ్యత తానే తీసుకుంటానని మీడియాతో అన్నారు. అయితే ఆయనకు ఆ అవసరం పడలేదు. ప్రత్యూష జీవన పరిస్థితి తెలుసుకొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు స్వయంగా హాస్పిటల్‌కు వచ్చి ఆమెను పరామర్శించారు. ఆ క్షణమే తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రత్యూష తండ్రిని, సవతి తల్లిని పోలీ సులు అరెస్టుచేసి హత్యానేరాన్ని నమోదు చేశారు. 

ప్రత్యూష మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టల్లో చేరింది. నర్సింగ్‌ కోర్సులో డిగ్రీ పూర్తి చేసింది. ఏడాదిగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఉద్యోగం చేస్తోంది. త్వరలో నిమ్స్‌లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరనుంది. తన సహోద్యోగి ద్వారా పరిచయమైన కుటుంబంలోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చరణ్‌తో జరిగిన పెళ్లి ప్రత్యూష నిండు జీవితానికి శ్రీకారమైంది. తమ దత్త పుత్రిక పెళ్లి లాంఛనాలను కేసీఆర్‌ కుటుంబం నిర్వర్తించింది. తాను రక్షించిన అమ్మాయి జీవితంలో విరబూసిన ఆనందాలు చూసేందుకు, అచ్యుతరావు మన మధ్య లేరు. కరోనా బారిన పడి ఆయన 2020 జూలై 21న మరణించారు. ప్రత్యూష జీవితం బాగుపడినందుకు ఎంతో ఆనందంగా ఉందనీ, ఆ స్ఫూర్తితో బాలల సంఘం తన కార్యకలాపాలపై మరింత అంకితమవు తుందనీ అచ్యుతరావు కుటుంబం చెబుతోంది.

బి. నర్సన్‌
వ్యాసకర్త రచయిత, సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 94401 28169

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement