విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుందాం | Ch Narasinga Rao Article ON Vizag Steel Plant | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుందాం

Published Sun, Feb 7 2021 12:06 AM | Last Updated on Sun, Feb 7 2021 2:26 AM

Ch Narasinga Rao Article ON Vizag Steel Plant - Sakshi

జనవరి 26న దేశరాజధానిలో జరిగిన ‘రైతు ర్యాలీ’పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుండగా కేంద్ర క్యాబినెట్‌ ఆంధ్రప్రదేశ్‌పై పిడుగుపాటు తీర్మానాన్ని ఆమోదిం చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వ్యూహాత్మక అమ్మకం పేరుతో నూరు శాతం అమ్మకానికి పెట్టింది. దేశంలోనే అత్యంత ప్రతి ష్టాత్మకంగా పనిచేస్తున్న విశాఖ స్టీల్‌ను విదేశీ, స్వదేశీ ప్రైవేట్‌ కంపెనీలకు అమ్మ డంవల్ల భారతదేశం స్వయం సమృద్ధి ఎలా సాధిస్తుందో భారత ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీజేపీకి వుంది.

కేంద్ర ప్రభుత్వ మాజీ క్యాబినెట్‌ మంత్రి, నేడు బీజేపీ ప్రతినిధిగా వున్న సుజనా చౌదరి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వ్యూహాత్మక అమ్మకం వల్ల యాజమాన్యం మాత్రమే మారుతుందని, సకాలంలో సిక్‌ కాకుండా కాపాడవచ్చని వాదిస్తున్నారు. వీరి వాదన నేతి బీరకాయలో నెయ్యి చందగా వుంది. 3 లక్షల కోట్ల విలువగల విశాఖ స్టీల్‌ ప్రజా సంపదను కార్పొరేట్లకు తరలించడాన్ని మసిపూసి మారేడుకాయ చేశారు. రెండు లక్షల కోట్ల విలువగల్గిన విశాఖ స్టీల్‌ భూములను కేవలం మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలకు తమ అనుయాయులకు కట్టబెట్టాలనే బీజేపీ కుట్రను దాస్తున్నారు.

గతంలో మందుల పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐడీపీఎల్‌ను మూసివేసి పోటీలేకుండా చేయడంతో నేడు ప్రైవేట్‌ మందుల కంపెనీలు అనేక రెట్లకు మందుల ధరలు పెంచి ప్రజల మూల్గులు పీల్చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మార్కెట్లో పోటీ పడకుండా చేయడమే నేడు బీజేపీ ప్రభుత్వ లక్ష్యం. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి. విశాఖ స్టీల్‌కు నష్టాలు వస్తున్నాయనీ, సమర్ధవంతంగా పనిచేయడం లేదనీ, అమ్మేయడానికి ఇదే మంచి సమయమని బీజేపీ నాయకులు చేసే ప్రచారం పచ్చి అబద్ధం. 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రారంభంలో 1.2 మిలి యన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తికిగాను రూ. 5వేల కోట్లలోపు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. కానీ దేశంలో ఇతర భిలాయ్, బొకారో లాంటి కర్మాగారాలన్నింటికీ  కేంద్రం పూర్తిగా పెట్టుబడులు సమకూర్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 3.2 మిలియన్‌ టన్నుల నుంచి 6.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తికి రూ. 12,500 కోట్ల రూపాయలు సొంత నిధులతో విస్తరణ చేసింది. దీనిలో రూ. 6 వేల కోట్లు ఆర్థిక సంస్థల నుంచి అప్పు చేయవలసి వచ్చింది. దాని వడ్డీల భారం నేడు ఎదుర్కొంటున్నది. దీనితో పాటు 6.3 మిలియన్‌ టన్నులనుంచి 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం పెంచడానికి మరో రూ. 9 వేల కోట్లు అదనంగా విస్తరణ నేడు సాగుతున్నది. ఈ విస్తరణలకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 

2004–05 ఒక సంవత్సరంలోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ. 2,008 కోట్లు లాభాలొచ్చాయి. 2018–19 సంవత్సరంలోనే రూ. 20,884 కోట్ల టర్నోవర్‌ సాధించింది. అంతర్జాతీయ ధరలనుబట్టి ఉక్కు అమ్మకాల్లో ఒడిదుడుకులుంటాయి. ఈ సంవత్సరం కరోనా కాలంలో నష్టాలు వస్తాయి కాబట్టి  ప్రైవేట్‌ చేస్తామనడం దుర్మార్గం. మరోవైపున విశాఖ స్టీల్‌ పన్నులు, డివిడెండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 40 వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించింది. దీనిని సమర్ధత కాదంటారా? 2008లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభంలో అనేక భారీ స్టీల్‌ప్లాంట్లు మూతబడ్డాయి. ఎస్సార్‌ స్టీల్స్‌ రూ. 50 వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగ్గొట్టి కంపెనీని మూసి వేసింది. సమర్థవంతంగా నడుస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అప్పగించాలని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ కుట్ర చేస్తున్నది.

‘‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’’ నినాదంతో 1966 నవంబర్‌ 1వ తేదీన విశాఖపట్నం పోస్టాఫీసు వద్ద 9 మంది పోలీసు కాల్పుల్లో మరణించినప్పటి నుంచి అదే నెలలో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు. 20 వేల మంది తమ భూములిచ్చారు. మన దేశంలోని సముద్రతీర ప్రాంతంలో వున్న ఏకైక ప్లాంట్‌. వందలాది మంది పర్మనెంట్, కాంట్రాక్టు, ఆఫీసర్లతో సహా ప్రాణాలు త్యాగం చేసిన ఫలితమే నేటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అభివృద్ధికి కీలకం.

1991 నుంచి కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలు అవలంబిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ వారు ఎవరు తీసుకున్నా లాభాలు బాగా గడించవచ్చు. దేశీ, విదేశీ ప్రైవేట్‌ కంపెనీల కళ్లు ఆనాటి నుంచి విశాఖ స్టీల్‌ మీద పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆర్థికంగా బలహీనపర్చాలని అనేక తప్పుడు పద్ధతులు అవలంబించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు సమకూర్చడానికి గత ఆరేళ్ల కాలంలో బీజేపీ ఏ విధంగానూ సహకరించలేదు. ఒడిశా నుంచి గనుల కోసం ఓఎండీసీకి రూ. 361 కోట్లమేరకు విశాఖ స్టీల్‌ నిధులు ఖర్చుచేశాం. గతంలోని యాజమాన్యం మైనింగ్‌ చట్టాన్ని అతిక్రమించినందుకు విశాఖ స్టీల్‌ రూ. 400 కోట్లు జరిమానా చెల్లించింది. ఓఎండీసీని కొని 10 సంవత్సరాలైనా ఒక్క టన్ను కూడా ఇనుప ఖనిజం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నేటికీ రాలేదు. 

సొంత గనులు లేనందువల్ల 2018–19 ఒక్క సంవత్సరంలోనే ఇతర స్టీల్‌ప్లాంట్‌ల కంటే రూ. 2,002 కోట్లు అదనంగా విశాఖ స్టీల్‌ చెల్లించింది. ఇతర స్టీల్‌ప్లాంట్లు తమ సొంత గనుల్లో తవ్వి తీసుకోవడానికి టన్నుకు రూ. 700 ఖర్చవుతుంది. కానీ విశాఖ స్టీల్‌ ముడి ఖనిజాన్ని టన్ను రూ. 7,500కు గత నెలలో చెల్లించింది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీని సంతృప్తిపరచడానికి యూపీలోని రాయబరేలీలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నిధులతో రైల్‌ ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌ను రూ. 1,683 కోట్లతో నిర్మించారు. కానీ నేటికీ ఎటువంటి ఉత్పత్తిలేదు. ఈ డబ్బులంతా గంగలో పోసినట్లే. గంగవరం పోర్టు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆధ్వర్యంలో నడిచివుంటే ప్రతి యేటా స్టీల్‌ప్లాంట్‌కు రూ. 500 కోట్లు ఆదాయం వచ్చేది. ప్రభుత్వ విధానాల వల్లనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రావాల్సిన వేలాది కోట్ల లాభాలు తగ్గిపోయాయి. విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించడానికి ఎన్ని తప్పుడు పద్ధతులు అవలంబించినా తట్టుకొని నేటికీ వేగంగా ముందుకు సాగుతున్నది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను గతంలో అనేకసార్లు ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేసి ప్రభుత్వాలు భంగపడ్డాయి. అదే పరిస్థితి నేడు బీజేపీకి దాపురిస్తుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి బీజేపీ చేసే ప్రయత్నాలను స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటారు. భారతీయ జనతా పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో నిలబెట్టుకోవాలి. పోరాడి సాధిం చుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అవసరం అయితే మరలా ప్రాణాలు అర్పించయినా కాపాడుకోవడం నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కర్తవ్యం. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వ్యూహా త్మక అమ్మకం చేయాలనే నిర్ణయాన్ని విరమించుకొనే వరకు పోరాటాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాలి. రాష్ట్రవ్యాప్త బంద్‌లు, నిరసనలు, ధర్నాలు నిరంతరం సాగాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తినివ్వాలి. విశాఖ స్టీల్‌ కార్మికులు, ప్రజలు సమైక్య ఉద్యమాలకు సిద్ధంకావాలని కోరుతున్నాం.

సీహెచ్‌. నరసింగరావు 
వ్యాసకర్త సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్‌ : 94900 98789

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement