ఓ మిత్రుడు ఫోన్ చేసి మరీ ఘోరంగా కరోనాలో కూడా మీరు వెనకబడిపోయారే... అని ఇగటమాడేడు. అది ఇగటమే...వెటకారం కాదు. ఆ మాటకు ముందు నవ్వొచ్చింది గానీ అది పెదవులు దాటి రాలేదు. నిజానికి ఊరందరిదీ ఒకదారి అయితే ఉత్తరాంధ్రాది వేరేదారి.. గతం నుండి వర్తమానందాకా! కానీ కరోనా పుణ్యాన విశాఖపట్నం ఊరందరి దారి పట్టింది, కరోనాని కావలించుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలిపి ఉత్తరాంధ్రాగా పిలుస్తుంటారా... ఇపుడు విశాఖపట్నం మిగిలిన రెండు జిల్లాలతో జట్టు వొదిలేసింది.
ఆశ్చిర్యమేటుందిరా బావూ విశాఖపట్నంల ఇపుడు ఉత్తరాంధ్రా వోళున్నారేటి? ఎప్పుడో తుంబాదుడ్డూ సర్దుకొని వలసలెళిపోనారు. అట్నించి గోదారి, కిష్ణా, నెల్లూరు గిల్లూరు నుంచి కమ్మాలు, రెడ్లు, రాజులు వొచ్చి విశాఖపట్నం నిండా చేరిపోనారు కాదేటి? ఎవుళో తప్పీతగిలీ ఉత్తరాంధ్రోళు విశాఖలో మిగిల్తే ... ఆళు మాత్రం యీళ తోటి విరోధం తెచ్చుకుంతారేటి? తెచ్చుకుంతే బతగ్గలరేటి? అక్కడ రోడ్లంట తిరగ్గలరా? అందిసేత విశాఖపట్నంల మిగిలిన్నోళు మన జట్టొదిలీసి పరాయోళ జట్టుల కలాల మరీ! కలిసినారు. అయితే మరి యీ రెండు జిల్లాల్లో జనాలు వలస పోకుండా అందరూ ఉండిపోయారా? లేదు.
ఇక్కడనుంచీ ఏటా కనీసం యాభయి వేలమంది గ్రామాలనొది లేసి వలసపోతున్నారని గణాంకాలే చెప్తున్నాయి. అటు 510 కిలోమీటర్ల అటవీప్రాంతంలో సుమారు 500 రకాల ఔషధమొక్కలు, వీటికి తోడు కొండల్లో బాక్సైట్, గ్రానైట్, రంగురాళ్లు, వజ్రాలు వంటి అనేకానేక ఖనిజాలున్న ఆదివాసీ నేలనుంచి ఆరుగాలం రెక్కలు ముక్కలు చేయగలిగే కష్టజీవులు ఆదివాసీలు కూడా అడవినీ, కొండనీ వొదిలేసి విజయవాడ, హైదరాబాదు మొదలుకొని చెన్నయ్, బెంగళూర్, ఢిల్లీ, కలకత్తా ఉపాధినిచ్చే మహానగరాలెక్కడెక్కడికో వలసపోయేరు. ఇక మత్స్యకారులు కూడా సముద్రజలాల్లోనో, పరప్రాంతంలోనో చిక్కుకొనే వుంటారు. నగర జనకెరటాల హోరులో వారి ఆర్తనాదాలెవరికీ విన్పించవు!
కొండలూ, అడవులూ, మారుమూల గూడేలూ, గ్రామాలున్నాయి. అక్కడకు ఏలినవారెప్పటికీ చేరలేరు గానీ యే రోగమయినా తొందరగా చేరుతుంది. ఏటా మలేరియా జ్వరాలకే రాలిపోయే అడవిబిడ్డలెందరో! విశాఖపట్నం నుండి ఇచ్చాపురం దాకా జాతీయరహదారి వెంట వీచే గాలికి రంగూ, రుచీ, వాసనా సృష్టించే కర్మాగారాలుం టాయి. అక్కడి కార్మికులుకి అంటని రోగముం డదు. తాగే నీటికోసం చెరువులూ, గెడ్డలూ ఆధారమైన పల్లెల్లో పలకరించే డయేరియా బంధువులెందరో పల్లెల్లో! కరోనా పుణ్యాన యివేవీ ఎవరికీ కన్పించటంలేదు. కరోనా ఫ్రీ జిల్లాలుగా ఈ రెండు జిల్లాలూ దేశం నోట్లో నానుతున్నాయి. రెండు జిల్లాల కలెక్టర్లనీ, రాజకీయనేతల్నీ పొగడ్తల్తో ముంచెత్తుతున్నారు. నిజమే.. యీ జిల్లాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో వీరు శ్రధ్ద చూపేరు.
మాస్కుల పంపిణీ, మార్కెట్లలో క్యూలు, భౌతికదూరాన్ని పాటించడం, గ్రామవాలంటీర్లను వినియోగించడం, వైద్యసిబ్బందిని నియోగించడం వంటి అనేక చర్యలు అందరికంటే బాగా చేసివుంటారు. ఇవన్నీ యీ రెండుజిల్లాల్లో వలసబోకుండా వుంటోన్న జనాభాకు అందించిన సేవలు! కానీ వలసబోయిన వారి సంగతో..? కొంతమంది లాక్‌డౌన్ ప్రకటించగానే బయల్దేరి మధ్యదోవలో చిక్కుకున్నారు. వాళ్లను మధ్యలో పోలీసులు ఆపేసి... క్వారంటైన్లలో పెట్టేరు. ఎక్కడెక్కడో దోవల్లో చిక్కుకున్న యీ రెండుజిల్లాల పేద గుండెలెన్నెన్నో...!
ఒకపక్క కరోనా ఫ్రీ అంటూ అధికార్లూ, ప్రసారసాధనాలూ ప్రచారం చేస్తుంటే యింకోపక్క కరోనా ఫ్రీకి కారణాలను కొన్ని యూనివర్సిటీలు పరిశోధించినాయనీ... ఈ రెండు జిల్లాలు తినే పిండొడియం, అంబలీ, గంజీ కారణాలంటూ వ్యంగ్యాస్త్రాల ప్రసారాలు! ఇక్కడ ఈ రెండుజిల్లాల్లో వున్నవారితో మాత్రమే గణించి వలసపోయిన అశేషజనాన్ని గణించకపోవడం సమంజ సంగా వుంటుందా? అపార్ట్‌మెంట్లూ, భవంతులూ, కోలనీలూ చప్పట్లు కొట్టేయి, దీపాలు ఆర్పేయి. కానీ అనేక గృహాల్లో కరోనా కంటే భయంకరమైన ఇనుపగజ్జెల తల్లి తిరుగాడుతోంది. ఈ తల్లిని తరి మేదెలా..? వలసపోయిన బిడ్డల్ని కాపాడేదెలా అని రెండుజిల్లాల గూళ్లల్లో గుండెలు కొట్లాడుతున్నాయి మిత్రమా!
అట్టాడ అప్పల్నాయుడు
వ్యాసకర్త ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షులు ‘ 94400 31961
Comments
Please login to add a commentAdd a comment