అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను అష్టకష్టాలతో ఎలాగోలా బయటకు తీసుకొచ్చిన ఉదంతం ఉంది. ఈ ఘటన వల్ల ప్రపంచ వాణిజ్యంపై చాలా ప్రభావం పడింది. వేల టన్నుల్లోని సరకు రవాణా నిలిచిపోయింది. దాంతో ప్రపంచ వాణిజ్యానికి వేలకోట్లల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా.
తాజాగా ఎర్ర సముద్రంలో నెలకొన్న సంక్షోభంతో షిప్పింగ్ ధరలు 60 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం మరో 20 శాతం పెరగొచ్చని జీటీఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. ఎర్ర సముద్రం, మెడిటేరియన్ సముద్రం, హిందూ మహాసముద్రానికి కలిపే కీలక జలసంధి బాబ్ ఎల్ మండెబ్ వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి. యెమెన్ హౌతీ మిలిటెంట్లు దూకుడు పెంచడంతో ఈ రూట్‌లో రవాణా కష్టంగా మారినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది.
దాంతో నౌకా సంస్థలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేలా ప్రయాణం మొదలుపెట్టాయి. ఫలితంగా భారత్‌కు సరుకు రవాణా కావాలంటే అదనంగా 20 రోజుల వరకు సమయం పడుతుందని జీటీఆర్‌ఐ తెలిపింది. హౌతీ దాడులతో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్‌తో ఇండియాకు జరుగుతున్న వ్యాపారంపై ప్రభావం పడుతోందని పేర్కొంది. క్రూడాయిల్, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల కోసం ఇండియా ఎక్కువగా బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై ఆధారపడుతోంది.
ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరుకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సూయెజ్ కాలువ ద్వారా జరిగే రవాణాలో చమురు ఐదో వంతు ఉంటుంది. రెండు వైపులా రోజుకు దాదాపు 9 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యూరప్, ఉత్తర అమెరికాతో భారత్‌కు జరుగుతున్న సరుకు రవాణాలో ఏటా 50 శాతానికి పైగా దిగుమతులు, 60 శాతం ఎగుమతులు ఉన్నాయి. దాంతో మొత్తం 113 బిలియన్ డాలర్(దాదాపు రూ.9 లక్షల కోట్లు)ల వ్యాపారానికి ఈ రూట్ చాలా కీలకమని జీటీఆర్‌ఐ వెల్లడించింది. ఫలితంగా భారత్ ఇతర మార్గాల వైపు చూడాల్సి వస్తోందని తెలిపింది. ఎర్ర సముద్రంలోని షిప్‌ల కోసం ఇండియా సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీటి రవాణాను ముఖ్యంగా గ్లోబల్ షిప్పింగ్ కంపెనీలు చేపడుతున్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
ఇదీ చదవండి: డే ట్రేడింగ్ చేయకూడదు.. సెబీ కీలక నిర్ణయం!
హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో జైదీ షియాలు హౌతీ గ్రూపును ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంటుంది. పశ్చిమ యెమెన్‌ను కేంద్రంగా చేసుకుని ఈ గ్రూప్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఇరాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్-మండెబ్‌పై హౌతీ రెబల్స్‌కు ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్-మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment