ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఆచారాల్లోని ఎన్నో వింతలు, విచిత్రాల గురించి విన్నాం, చూశాం. అయితే, ‘హైతియన్ వూడూ’ అనే ప్రాచీనమతానికి చెందిన ఆఫ్రికన్ భక్తులు నిర్వహించే ‘వూడూ ఫెస్టివల్’ ప్రపంచానికే మిస్టరీ. సాధారణంగా సంప్రదాయ వేడుకల్లో.. మనిషిని దేవుడు ఆవహించడం, మనుషులు పూనకాలొచ్చి ఊగడం లాంటివి చూస్తుంటాం. అలాంటి జాతరల్లో.. కొందరు భక్తులు బృందాలుగా విడిపోయి రకరకాల వేషధారణలతో.. డప్పు దరువుల మధ్య గజ్జె కట్టి తాండవమాడటం తెలిసిందే. అయితే ఈ వూడూ వేడుకకు దయ్యాలొస్తాయి. స్వయంగా నాట్యమాడతాయి. ఎంతటివారినైనా నిర్ఘాంతపరుస్తాయి. ‘ఈ బొమ్మ లోపల ఉన్నది మా పూర్వీకుల ఆత్మే’ అని చెబుతుంటారు వూడూ మతస్థులు. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఈ పండుగకు వెళ్లిన వాళ్లంతా.. అక్కడ నోరెళ్లబెట్టి రావాల్సిందే. ఏమిటా కథ?
పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్, టోగో, ఘనా వంటి దేశాల్లో కొన్ని నగరాలు.. జనవరి నెలొస్తే ప్రపంచ పర్యాటకులతో కిటకిటలాడు తుంటాయి. జనవరి 7 నుంచి సుమారు 14 రోజుల పాటు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రకరకాల వేషధారణలతో భక్తులు.. నిప్పుల గుండాల చుట్టూ తిరుగుతూ.. నృత్యాలు చేస్తూ ఆకట్టుకుంటారు. ఈ మొత్తం వేడుకలో గుర్రం పందాలతో పాటు.. ‘వూడూ ఘోస్ట్ డాన్స్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పండుగ ప్రతి ఇంట్లో తమ పూర్వీకుల ఆత్మలకు గౌరవార్థంగా ప్రార్థన చేయడంతో మొదలవుతుంది. తర్వాత చిన్నచిన్న మనిషి ప్రతిమలను పెట్టి.. అందులోకి చనిపోయినవారి ఆత్మలను ఆహ్వానిస్తారట.
అనంతరం పూజ చేసి.. మేకను బలిచ్చి, మద్యంతో పాటే.. నైవేద్యంగా పెట్టి.. ఆత్మలకు శాంతి కలిగిస్తారట. గడ్డి, ఎండిన ఆకులు, నల్ల కుండలు, పుర్రెలు, కర్రల సాయంతో ఎత్తైన పెద్ద బొమ్మలను తయారు చేసి.. వాటిని రాత్రి అయ్యేసరికి ప్రదర్శన కోసం తీసుకొస్తుంటారు చాలామంది. అయితే అలా తీసుకెళ్లే ముందు.. ఆ బొమ్మలకు పూర్వీకుల ఆత్మశక్తిని ఆపాదిస్తారట. ప్రత్యేకమైన పూజలు చేసి.. ఆ వూడూ బొమ్మల్లో కనిపించని అదృశ్యశక్తిని నింపుతారట. వాటిని జాతరకు తీసుకుని వెళ్లి ప్రదర్శన ఇస్తున్నప్పుడు.. అవి చూపరులను హడలగొట్టేలా నృత్యాలు చేస్తాయి.
అయితే అవేం హాని కలిగించవు. అలా అని వాటిని తాకడానికి ప్రయత్నించకూడదని స్థానికులు హెచ్చరిస్తుంటారు. కొన్ని వూడూ బొమ్మల్లో మనుషులుండి దాన్ని నడిపిస్తారు. అందులోంచే నృత్యం చేస్తుంటారు. కానీ ఇంకొన్ని వూడూ బొమ్మలు మాత్రం.. మనిషి సాయం లేకుండానే ఏదో కనిపించని శక్తి నడిపిస్తున్నట్లుగా కదులుతాయి. ‘ఈ బొమ్మలో మనిషి లేడు.. కేవలం ఇదంతా ఆత్మ కోలాహలమే’ అనే విషయాన్ని తెలియపరచడానికి.. ఆ బొమ్మను మధ్యమధ్యలో ఎత్తి.. చూపిస్తుంటారు ఆ వంశస్థులు. ‘వూడూ మతస్తులు ఆత్మలతో మాట్లాడతారు. చేతబడులు చేస్తారు’ అనే ప్రచారం.. అక్కడ నివసించే ఇతర స్థానికులకు ఓ సూచన. విదేశీయులను అదుపులో ఉంచే ఒక హెచ్చరిక.
ఏదిఏమైనా ఈ వూడూ ఫెస్టివల్‌లో.. ప్రాణంలేని కొన్ని బొమ్మలు మనిషి సాయం లేకుండా ఎలా కదులుతున్నాయి? ఎలా నాట్యం చేస్తున్నాయి? అనేది నేటికీ మిస్టరీనే! ప్రతి ఏటా బెనిన్‌లోని కోటోనౌ, ఔయిడా, అబోమీ, గాన్వీ, నాటిటింగౌ, పోర్టో నోవో, అల్లదా నగరాల్లో.. టోగోలోని లోమ్, టోగోవిల్ నగరాల్లో.. ఘనాలోని అక్రా, కేప్ కోస్ట్, కుమాసి నగరాల్లో ఈ సంబరాలు జరుగుతుంటాయి. సుమారు ఐదువందల ఏళ్ల క్రితం నుంచే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు వూడూ మతస్థులు. ఈ మతం 1996లో అధికారికంగా గుర్తింపు పొందింది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని 13 మిలియన్ల జనాభాలో 12% మంది వూడూను అభ్యసిస్తున్నారట. ఈ ఆధ్యాత్మిక మూలాలతో ఆచారాలతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ జాతరను, పండగను ఆయా దేశాలు ప్రెస్టీజియస్‌గా నిర్వహిస్తుంటాయి.
---సంహిత నిమ్మన
(చదవండి: తవ్వకాల్లో రెండువేల ఏళ్ల నాటి చెయ్యి..దానిపై మిస్టీరియస్..!)
Comments
Please login to add a commentAdd a comment