కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆఫ్రికా దేశాల్లో దేశాల్లో ఎడారీకరణను ఎదుర్కొనేందుకు రైతులు వాన నీటి సంరక్షణకు అనేక పద్ధతులను అనుసరిస్తున్నారు. వాటిలో ‘అర్ధ చంద్రాకారపు గుంతలు’ తవ్వటం ఒక పద్ధతి. చెట్టు చేమ కరువైన ప్రదేశాల్లో అరుదుగా కురిసే కొద్దిపాటి వర్షపు నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేసి భూమిలోకి ఇంకింపజేయటంలో ఈ వినూత్న ఇంకుడు గుంతలు ఉపయోగపడుతున్నాయి. వెస్ట్ సహెల్‌లో రైతులు భూసారం కోల్పోయిన భూములను పునరుజ్జీవింపజేయటం కోసం, ఎడారీకరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ పద్ధతిలో లోతు తక్కువ గుంతలు తవ్వి సత్ఫలితాలు సాధించారు.
వాలుకు అడ్డంగా అర్థ చంద్రాకారంలో గుంతలు తవ్వి, తవ్విన మట్టిని లోతట్టు వైపు గట్టుగా వేస్తే.. వర్షపు నీరు ఆ గుంతలో చేరి భూమిలోకి ఎక్కువగా ఇంకుతోంది. నీరు ఇంకడంతో పాటు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల భూమి పైపొర మట్టి కోతకు గురికాకుండా కాపాడుకున్నట్లు కూడా అవుతోంది. ఎడారీకరణ బారిన పడిన రైతుల మొహాల్లో ఆనందాన్ని నింపుతుండటంతో వీటికి ‘జాయ్ పిట్స్’ అని కూడా పేరొచ్చింది! ఖర్చు, శ్రమ తక్కువ.. ఫలితం ఎక్కువ! అర్థ చంద్రాకార గుంతలు నిర్మించడం సులభం, ఖర్చు స్వల్పం.
వాలు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న భూముల్లో నేల కోతను నియంత్రించేందుకు, వాన నీటిని సమర్థవంతంగా సంరక్షించడానికి ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. ఎత్తులో వ్యత్యాసం దాదాపుగా బెత్తెడు ఎక్కువ ఉంటే వాలు 5% కంటే ఎక్కువగా ఉంటుంది. నిర్మించేదెలా? మొదట భూమిపై వాలు వైపు తిరిగి నిలబడి అర్ధ చంద్రుని ఆకారాన్ని రెండు మీటర్ల వెడల్పుతో గీయాలి. రెండు పిడికిళ్ల (10 సెంటీమీటర్ల) లోతు మట్టిని తవ్వి, ఆ మట్టిని దిగువ వైపున కట్టగా వేయండి.
కట్ట బలంగా ఉండాలంటే కట్ట కింది వైపు ఇరవై అంగుళాల వెడల్పు ఉండాలి. పైభాగం కనీసం సగం (10 అంగుళాల) వెడల్పు ఉండాలి. ఎత్తు అడుగు సరిపోతుంది. వర్షాకాలంలో చివరి నెలన్నరలో అర్ధ చంద్రాకార కందకాలను తవ్వాలి. అప్పుడు నేల తేమగా ఉంటుంది. తవ్వటం, గట్లు వేయటం సులభం అవుతుంది. ఎండా కాలంలో వానకు ముందు దీన్ని ఏర్పాటు చేయాలంటే కష్టం. అర్ధ చంద్రాకారపు గుంతలు తీయడానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. పార, పలుగు చాలు.
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
(చదవండి: సుప్రీంకోర్టు నిషేధించిన కొర్రమీను డూప్లికేట్.. తిన్నారా? అంతే సంగతి!)
Comments
Please login to add a commentAdd a comment