వాటికన్‌లో బాల ఏసు ప్రతిమను ముద్దాడుతున్న పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ సిటీ: అంతర్యుద్ధంతో సతమతమైపోతున్న ఆఫ్రికా దేశాల్లో శాంతి స్థాపన జరగాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యం, వెనిజులా, లెబనాన్ ఇతర దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోప్ వాటికన్ నగరం నుంచి తన సందేశాన్నిచ్చారు. ఆఫ్రికాలో క్రైస్తవులపై తీవ్రవాద సంస్థలు జరుపుతున్న దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హింసతో రగిలిపోతున్న దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలతో సతమతమైపోతున్న దేశాల్లో, వ్యాధులు పడగవిప్పిన నిరుపేద దేశాల్లో ఈఏడాదైనా శాంతి, సుస్థిరతలు నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘మధ్యప్రాచ్యం సహా ఎన్నో దేశాల్లో యుద్ధ వాతావరణంలో చిన్నారులు భయంతో బతుకులీడుస్తున్నారు. వారందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను‘‘అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.
అంబరాన్నంటిన సంబరాలు
క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటాయి. క్రిస్టియన్ నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ శాంతి సందేశాలను పంపించుకున్నారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తీవ్ర తుఫాన్‌తో అల్లాడిపోయిన ఫిలిప్పీన్స్‌లో వేలాది మంది వరద ముప్పులో చిక్కుకోవడంతో క్రిస్మస్ హడావుడి కనిపించలేదు. ఇక ఫ్రాన్స్‌లో పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా నాలుగు వారాలుగా జరుగుతున్న రవాణా సమ్మెతో రాకపోకలు నిలిచిపోయాయి. బంధువులు, స్నేహితులు తమవారిని చేరుకోకపోవడంతో క్రిస్మస్ సందడి కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment