Christmas message
-
నేను ప్రేమించిన యేసు.. మహాత్మ గాంధీ సందేశం
క్రైస్తవం అనేది ‘మతం’ కాదు, ‘జీవన విధానం’ అని. ఏ వ్యక్తి అయితే అవధులు లేని ప్రేమని చూపిస్తూ ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటివి మరచిపోతాడో అతడే నిజమైన క్రైస్తవుడు. లండన్‌లో 1931 డిసెంబర్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ తన బృందంతో సముద్రమార్గంలో ఇండియాకి తిరిగి వస్తూ ‘క్రిస్మస్’ రోజున చేసిన ప్రసంగమిది. ప్రతిరోజూ ఆయన ఉదయం చేసే ప్రార్థనలో పాల్గొనే కొందరు ఆరోజు ఆయన్ని జీసస్ గురించి మాట్లాడమని కోరడంతో... గాంధీజీ మాట్లాడారు. అదే రోజు ఓడలో వున్న అసోసియేట్ ప్రెస్ ఆఫ్ అమెరికా ప్రతినిధి మిస్టర్ మిల్స్ ఆ ప్రసంగ పాఠం తనకు చెప్పమని అడిగి రాసుకున్నారు. అదే వారం అది వ్యాసంగా ‘యంగ్ ఇండియా’, ‘హరిజన్’ పత్రికల్లో వచ్చింది. ‘గాంధీస్ క్రిస్టమస్ సెర్మన్’ శీర్షికతో 1932, జనవరి7న ‘ది గార్డియన్’ పత్రికలో వచ్చింది. మొదటిసారి దీని తెలుగు అనువాదం ‘సాక్షి’ పాఠకుల కోసం.. ఒక హైందవ మతస్థుడనైన నేను యేసుక్రీస్తు జీవితం గురించి, ఆయన బోధల గురించి ఎలా తెలుసుకున్నానో మీరు కచ్చితంగా తెలుసుకోవాలి అని ఆశిస్తున్నాను. దాదాపుగా నలభై ఐదేళ్ళ కిందటే నాకు ‘పరిశుద్ధగ్రంథం’తో పరిచయం అయింది. హోటల్లో పరిచయమైన నా స్నేహితుడి ప్రోత్సాహం వల్లే ఇదంతా జరిగింది. పరిశుద్ధగ్రంథాన్ని మొదటిసారి చదివినప్పుడు నాకు పాత నిబంధన గ్రంథం మీద అంతగా ఆసక్తి కలగలేదు. కానీ, ఎప్పుడైతే నేను కొత్త నిబంధన చదవడం మొదలుపెట్టానో నాకు క్రీస్తు బోధల మీద ఒక అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా ‘కొండ మీద ప్రసంగం’ నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ ప్రసంగం చిన్నతనంలో నేను నేర్చుకున్న విలువలని గుర్తు చేసింది. అది నా జీవన విధానానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. వేరే మతస్థుడనైన నాకు ఆ ప్రసంగం అంత ప్రాముఖ్యమైనది కాకపోవచ్చును. కానీ ఇది చెడుశక్తులతో సహా ఎవరికీ హాని కలిగించనిది. దీన్ని చదివాక నేను తెలుసుకున్నదేమిటంటే, యేసుక్రీస్తు ఒక కొత్త ధర్మాన్ని బోధించడానికి వచ్చారని. నిజానికి ఆయన తాను కొత్త ధర్మాన్ని ఇవ్వడానికి రాలేదు అని చెప్పినప్పటికీ, పాతనిబంధనలోని మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరణ సాధ్యమైనరీతిలో సరళతరం చేయడానికి ఆయన వచ్చారు. కంటికి కన్ను, పంటికి పన్ను చట్టం కాకుండా, ఒక అంగీ అడిగితే రెండు అంగీలు ఇవ్వడం, ఒక మైలు తోడు రమ్మంటే, రెండు మైళ్ళు వెళ్ళమనే సహృదయతను ఆయన బోధించారు. ఈ మంచి లక్షణాలను ప్రతి ఒక్కరూ బాల్యంలోనే నేర్చుకోవడం చాలా అవసరమని నేను భావించాను. చిన్నతనంలో క్రైస్తవం అన్నా, క్రైస్తవులు అన్నా నాకొక దురభిప్రాయం ఉండేది. వారికి ఒక చేతిలో మద్యం, మరో చేతిలో మాంసం ఉంటాయని అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను ‘కొండ మీద ప్రసంగం’ చదివానో, వారిపట్ల నాకున్న ఈ చెడు అభిప్రాయం పటాపంచలయ్యింది. ఆ తరువాత, దేవునికి నిజంగా భయపడే నా క్రైస్తవ స్నేహితులు కొందరు క్రైస్తవంపై నాకున్న సదభిప్రాయాన్ని మరింత పెంచారు. క్రైస్తవ జీవితం చాలావరకు ‘కొండ మీద ప్రసంగం’లో ఇమిడి ఉంది. ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని కోరుకున్నట్లయితే అతను యేసుక్రీస్తు ‘కొండ మీద చేసిన ప్రసంగం’లోని అంశాలను నిజాయితీగా ఆచరిస్తే చాలు. నా జీవితంలో నేనెన్నడూ యేసుక్రీస్తు ఉనికిని గురించి సందేహించలేదు. ఒకవేళ ఎవరైనా ఆయన అసలు ఇక్కడ జన్మించలేదని నిరూపించినా, నేను ఆ విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వను. నాలుగు సువార్తలు రాసిన వ్యక్తులు, వారికి క్రీస్తుతో ఉన్న సాన్నిహిత్యం, వారు ఆయనను చూసిన విధానాన్ని బట్టి ఆయనని వారు వివరించారు. కానీ, నాకు మాత్రం ‘కొండ మీద ప్రసంగం’ మాత్రమే ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసింది. ఆ ప్రసంగాన్ని చదివి, అర్థం చేసుకున్నాక– నేను తెలుసుకున్నదేమిటంటే క్రైస్తవం అనేది ‘మతం’ కాదు, ‘జీవన విధానం’ అని. ఏ వ్యక్తి అయితే అవధులు లేని ప్రేమను చూపిస్తూ ప్రతీకారం, ఈర‡్ష్య, అసూయ, ద్వేషం లాంటివి మరచిపోతాడో అతడే నిజమైన క్రైస్తవుడు. అలాంటి వ్యక్తి జీవితంలో అన్ని ఆటంకాల్ని అధిగమిస్తాడు. ఇటువంటి జీవన విధానం అవలంబించడం ఒకింత కష్టంగానూ, ఎదుటివారికి అర్థం కానట్లుగానూ ఉంటుంది. దీన్ని కేవలం మనసుతో మాత్రమే చూడగలం. విషాదమేమిటంటే ఈ విధమైన క్రైస్తవం చాలామందికి అర్థం కాకుండా ఉంది. దేవుని దయ వలన పరిశుద్ధగ్రంథం కొందరు విధ్వంసకారుల నుంచి భద్రపరచబడింది. బ్రిటిష్ వారు, ఫారిన్ బైబిల్ సొసైటీ వారు పరిశుద్ధ గ్రంథాన్ని అనేక భాషల్లో తర్జుమా చేశారు. ఆ తర్జుమాలు సమయం వచ్చినప్పుడు, వాటి ఉద్దేశాన్ని నెరవేర్చాయి. యేసుక్రీస్తు బోధించిన ఈ అంశాలను మనం ఆచరించకపోతే, రెండువేల సంవత్సరాల పాటు ఉన్న ఈ సజీవ నమ్మకానికి అర్థం లేనట్లే. మనం పాడుకునే ‘పరలోకమందున్న దేవునికి సమస్త మహిమ, భూమి మీద ఆయన భక్తులకి సమాధానం కలుగును గాక...’ అనే పాటలో ఉన్నట్లుగా దేవునికి మహిమ, మనకి సమాధానం రెండూ కలగవు. మనలోని ఆత్మీయ తృష్ణ చల్లారేంత వరకూ, క్రీస్తు మన హృదయంలో జన్మించేంత వరకూ మనం ఆయన కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో జన్మించడం వలన నిజమైన శాంతి నెలకొంటుందో, అప్పుడు మనకిక వేరే సాక్ష్యాలు అవసరం లేదు. అది మన జీవితాల ద్వారా ప్రతిబింబిస్తుంది. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా ఈ మార్పు కనపడుతుంది. నా మటుకు ఈ పాటకు అసలైన అర్థం ఇదేనని తోస్తుంది. క్రీస్తు మనలో జన్మించడం అన్నది కేవలం ఒకరోజుకే పరిమితమయ్యేది కాదు. మన జీవితాల్లో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ లోకంలోని మతాల గురించి నేను ఆలోచించినప్పుడల్లా, ఈ భూమి మీదకి దిగివచ్చిన మహోన్నతమైన గురువుల గురించి ఆలోచిస్తాను. వారి పుట్టుకకి కారణం– నేను మొదట చెప్పినట్టుగా, వారు ఈ భూమి మీద ఒక సత్యాన్ని ప్రచురించడానికి అవతరించారు. దానికి ఏ గుర్తు, సాక్ష్యం అవసరం లేదు. ఆ సత్యాన్ని వాళ్ళు జీవించిన జీవన విధానం ద్వారా లోకానికి తెలియజేశారు. ఈ సత్యం ఎన్నటికీ ఆగిపోదు, నాశనం చెందదు. క్రీస్తు తమలో జన్మించనంత వరకూ ఎవరైనా ‘క్రిస్మస్ శుభాకాంక్షలు’ తెలియజేస్తే, అది అర్థం లేనిదే అవుతుంది. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నవారి శాంతిని తాను ఆకాంక్షించకుండా, తనకు శాంతి కలగాలని కోరుకోవడం దురాశ అవుతుంది. ‘యూక్లిడ్ సూత్రం’ ప్రకారం ఎవరైతే తన చుట్టూ ఉన్న వారి శాంతిని కోరుకుంటారో, వాళ్ళ జీవితాల్లో కూడా శాంతి నెలకొంటుంది. ఇందుకు భిన్నంగా ఉండేవారి జీవితాల్లో, చిన్నచిన్న కలహాలు కూడా పెద్ద సమస్యలుగా మారతాయి. కేవలం, యేసుక్రీస్తు ఈ చారిత్రాత్మక జన్మని మాత్రమే మనం స్మరించుకుంటూ, ఆయన సిలువ త్యాగాన్ని విస్మరిస్తే, ఈ పర్వదినానికి విలువ లేనట్లే! అప్పుడు మన విశ్వాసం మృతమైన విశ్వాసం అవుతుంది.. తెలుగు అనువాదం: సి. షఫేల ఫ్రాన్కిన్సన్ -
ఆఫ్రికాలో శాంతి నెలకొనాలి
వాటికన్ సిటీ: అంతర్యుద్ధంతో సతమతమైపోతున్న ఆఫ్రికా దేశాల్లో శాంతి స్థాపన జరగాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యం, వెనిజులా, లెబనాన్ ఇతర దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోప్ వాటికన్ నగరం నుంచి తన సందేశాన్నిచ్చారు. ఆఫ్రికాలో క్రైస్తవులపై తీవ్రవాద సంస్థలు జరుపుతున్న దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హింసతో రగిలిపోతున్న దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలతో సతమతమైపోతున్న దేశాల్లో, వ్యాధులు పడగవిప్పిన నిరుపేద దేశాల్లో ఈఏడాదైనా శాంతి, సుస్థిరతలు నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘మధ్యప్రాచ్యం సహా ఎన్నో దేశాల్లో యుద్ధ వాతావరణంలో చిన్నారులు భయంతో బతుకులీడుస్తున్నారు. వారందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను‘‘అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అంబరాన్నంటిన సంబరాలు క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటాయి. క్రిస్టియన్ నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ శాంతి సందేశాలను పంపించుకున్నారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తీవ్ర తుఫాన్‌తో అల్లాడిపోయిన ఫిలిప్పీన్స్‌లో వేలాది మంది వరద ముప్పులో చిక్కుకోవడంతో క్రిస్మస్ హడావుడి కనిపించలేదు. ఇక ఫ్రాన్స్‌లో పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా నాలుగు వారాలుగా జరుగుతున్న రవాణా సమ్మెతో రాకపోకలు నిలిచిపోయాయి. బంధువులు, స్నేహితులు తమవారిని చేరుకోకపోవడంతో క్రిస్మస్ సందడి కనిపించలేదు. -
మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపన జరగాలి
పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ సందేశం • ఉగ్రదాడి మృతులకు సంతాపం • ప్రపంచవ్యాపంగా ఘనంగా క్రిస్మస్ సంబరాలు వాటికన్ సిటీ/న్యూఢిల్లీ: జీహాదీల దాడులతో రక్తసిక్తమ వుతున్న మధ్య ప్రాచ్య దేశాల్లో శాంతి స్థాపన నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. ఉగ్రవాదుల కిరాతక దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆరేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టు డుకుతున్న సిరియాలో తుపాకులు నిశ్శబ్ధంగా మారాలని ఆదివారం ఇక్కడ ఇచ్చిన తన క్రిస్మస్ సందేశం లో పిలుపునిచ్చారు. నలభై వేల మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం లో పోప్ భావోద్వేగంతో ప్రసంగించారు. చరి త్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే దిశగా అడుగులు వేయాలని ఇజ్రాయిల్, పాలస్తీని యన్లకు సూచించారు. కాగా, బెర్లిన్ క్రిస్టమస్ మార్కె ట్‌పై ఐసిస్ ట్రక్ దాడిలో 12 మంది మర ణించిన నేపథ్యంలో యూరప్ అంతటా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మిలాన్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఈ దాడుల అను మానితుడు అనిస్ అమ్రి హతమయ్యాడు. ఫ్రాన్స్‌లో జీహాదీ ట్రక్కు దాడిలో 86 మంది బలైన దారుణం మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు వణుకుతు న్నారు. దీంతో ప్రభుత్వం 91 వేల మంది భద్రతా సిబ్బందిని జనసమ్మర్థ ప్రాంతాలు, మార్కెట్లు, చర్చిల వద్ద నియమించింది.క్రైస్తవ మత పెద్దలు తమ సందేశాల్లో... యుద్ధం, దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. బెత్లెహామ్‌లో ఘనంగా వేడుక క్రీస్తు జన్మస్థానం బెత్లెహామ్‌లోని చర్చ్ ఆఫ్ నేటివిటీ భక్తులతో కళకళలాడింది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. గత ఏడాది పాలస్తీనియన్లు ఇజ్రాయలీలపై కత్తులతో దాడులు చేసిన క్రమంలో... ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఆనందంగా సంబరాల్లో పాల్గొన్నారు. అమెరికా, బ్రిటన్‌తో పాటు ప్రపంచ దేశాల్లో క్రీస్తు జన్మదిన వేడుక ఆడంబరంగా సాగింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు వైట్‌హౌస్ నుంచి తమ చివరి క్రిస్మస్ సందేశాన్నిచ్చారు. భారత్‌లో అర్ధరాత్రి నుంచే వెలుగులు శనివారం అర్ధరాత్రి నుంచే భారత్‌లో క్రిస్మస్ వెలుగులు విరజిమ్మాయి. చర్చిలు విద్యుత్ కాంతులతో మిరిమిట్లు గొలిపాయి. క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, రాష్ట్రాల సీఎంలు పండగ సంబరాల్లో పాల్గొన్నారు. -
ఒబామా ఫైనల్ మెసేజ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా, ప్రథమ మహిళ మిచెల్లీ ఒమామా వైట్ హౌస్ నుంచి తమ చివరి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో భిన్న కోణాల్లో విడిపోయిన అమెరికా ప్రజలంతా సహోదర భావంతో మెలగాలని ఒబామా ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుకలను అమెరికా ప్రజలంతా ఉల్లాసంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా సైన్యం అందిస్తున్న సేవలకు గాను ఒబామా తన మెసేజ్‌లో ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. గత ఎనిమిదేళ్లుగా అమెరికా ప్రజలకు సేవ చేయడం అనేది.. మిచెల్లీ, తాను పొందిన గొప్ప గిఫ్ట్ అని ఒబామా పేర్కొన్నారు. ఈ కాలంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్యలను అంతా కలిసి ఎదుర్కొన్నామని ఓబామా వెల్లడించారు. -
అందరి కోసం వైఎస్ సంక్షేమ పథకాలు
* తెలుగు ప్రజలకు విజయమ్మ క్రిస్మస్ సందేశం * వైఎస్సార్ ఆశయాల సాధన కోసం జగన్ తపన * వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సాక్షి, హైదరాబాద్: సాటివారిని ప్రేమించాలనే ఉద్దేశంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున చేపట్టారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. సమాజంలో ఏ ఒక్కరూ పేదరికంతో ఇబ్బందులు పడకూడదని వైఎస్ భావించేవారని, ఆయన పదవిలో ఉన్నంత కాలం అలాగే పనిచేశారన్నారు. ప్రజలకు ఇంకా ఎంతో మేలు చేయాలన్న తపనతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ వైఎస్ ఆశయాలను జగన్ సాధించి తీరతాడని తనకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ఆశయ సాధనలో జగన్‌కు అందరి ఆశీస్సులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. విశ్వవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ విజయమ్మ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడున్నా అంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎలాంటి లోటు రాకూడదని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. అనంతరం విజయమ్మ క్రిస్మస్ కేక్‌ను కోసి అందరికీ పంచి పెట్టారు. ఫాదర్ జార్జి హెర్బర్ట్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలు ప్రార్థనలు, యువతీ యువకుల నృత్యాలు, దైవగీతాల ఆలాపనలతో సాగాయి. క్రిస్మస్ వేడుకల్లో విజయమ్మతో పాటు పార్టీ ముఖ్యనేతలు డీఏ సోమయాజులు, వాసిరెడ్డి పద్మ, విజయచందర్ వేదికపై ఉన్నారు. విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, గుడివాడ అమర్నాథ్, మేడపాటి వెంకట్, చల్లా మధుసూదన్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, షేక్ సలాంబాబు, సందీప్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇడుపులపాయకు జగన్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో పాటు ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో జరిగే క్రిస్మస్ ఉత్సవాల్లో వారు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.