
సాక్షి, హైదరాబాద్: భారత్–ఆఫ్రికాల మధ్య పరస్పర సహకారం అవసరమని భారత శాస్త్ర, సాంకేతికశాఖ కార్యదర్శి అశుతోష్ శర్మ అన్నారు. ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్, ఫిక్కీ ఆధ్వర్యంలో 2 రోజులపాటు జరగనున్న గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సమ్మిట్–2019ను ఆయన గురు వారం ప్రారంభించారు. భారత్– ఆఫ్రికా దేశాలమధ్య విద్య, వైద్య రంగాల్లో పర స్పర సహకారం అవసరమని అశుతోష్ అన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రానున్న కాలంలో ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా ఉంటుందని తెలిపారు. యువత ఎక్కువగా సాంకేతిక స్టార్టప్స్‌ను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపి రెడ్డి, ఫిక్కీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ సంగీతారెడ్డి, జాంబియా, ఇథియోపియా, రువాండా మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.