ఉద్యోగం నిమిత్తం భార్య సుమితో కలిసి ఆఫ్రికాలోని మలావి దేశానికి వెళ్లాడు కేరళలోని మలప్పురంకు చెందిన అరుణ్ అశోకన్.అక్కడ ఒక గ్రామంలో శిథిలావస్థలో ఉన్న స్కూల్‌ను చూసి చలించిపోయాడు.ఆ తరువాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కూల్ పునర్నిర్మాణానికి నడుం కట్టారు.తమ కలను సాకారం చేసుకున్నారు...
మలావిలో ఒకరోజు...
తాను పనిచేస్తున్న ప్రదేశానికి చిసాలియా అనే గ్రామం మీదుగా కారులో వెళుతున్నాడు అరుణ్ అశోకన్. వర్షం మొదలైంది. తల మీద పుస్తకాలు, బ్యాగులు పెట్టుకొని స్కూల్ పిల్లలు గుంపులు, గుంపులుగా పరుగెడుతున్నారు.‘వర్షం పడుతున్నప్పుడు స్కూల్లో కూర్చోక ఇలా పరుగెడుతున్నారేమిటి!’ అని డ్రైవర్‌ను అడిగాడు అరుణ్. ‘అది పేరుకే స్కూలు. గదులు పాడైపోయాయి. పిల్లలందరూ ఆరుబయటే కూర్చుంటారు. వర్షం వచ్చినప్పుడల్లా ఇలా ఇంటికి పరుగులు తీయాల్సిందే’ అని చెప్పాడు డ్రైవర్.
అరుణ్‌కు మనసులో చాలా బాధగా అనిపించింది. ఇంటికి వెళ్లిన తరువాత తన బాధను భార్య సుమితో కలిసి పంచుకున్నాడు.‘బాధపడడం ఎందుకు? మనమే స్కూల్ కట్టిద్దాం’ అన్నది సుమి.నిజానికి ఈ యువదంపతులు సంపన్నులు కారు. అయితే వారు ఆ నిర్ణయం తీసుకునే ముందు ‘మనం స్కూల్ కట్టించగలమా?’ ‘అంత డబ్బు మన దగ్గర ఉందా?’ అని ఆలోచించలేదు. ‘మనం స్కూల్ కట్టించాలి. అంతే!’ అని గట్టిగా అనుకు న్నారు. తమ సేవింగ్స్‌ను బయటికి తీశారు. స్కూల్ పునర్నిర్మాణంలో శ్రమదానం చేయడానికి ఊరివాళ్లను ఒప్పించారు.
తమ దగ్గర ఉన్న పొదుపు మొత్తాలతోనే పని కాదనే విషయం ఈ దంపతులకు అర్ధమైంది. ఈ పరిస్థితులలో ‘మలావి డైరీ’ పేరుతో యూట్యూబ్ చానల్‌కు శ్రీకారం చుట్టింది సుమి. ఈ చానల్ ద్వారా వచ్చిన డబ్బు, తమ సేవింగ్స్‌తో లోకాస్ట్ కన్‌స్ట్రక్షన్ టెక్నిక్‌తో స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్కూలో ఆవరణలో తోట పెంచారు. లైబ్రరీ ఏర్పాటు చేశారు. ప్లేగ్రౌండ్ తయారుచేశారు.
స్కూల్ ప్రారంభోత్సావాన్ని ఒక పండగలా ఘనంగా జరుపుకున్నారు. సుమీ, అరుణ్‌లు ఇప్పుడు చిసాలియా ఊరి వాళ్లకు ఆత్మబంధువులయ్యారు. ‘స్కూల్‌ను పునర్నిర్మించాలనుకున్నాం. నిర్మించాం. ఇక సెలవ్’ అనడం లేదు సుమి, అరుణ్ దంపతులు. పిల్లల చదువుల గురించి కూడా పట్టించుకుంటున్నారు.
తమకు సమయం ఉన్నప్పుడల్లా క్లాస్‌రూమ్‌లో పిల్లలతో కలిసి సమావేశం అవుతున్నారు. నాలుగు మంచి విషయాలు చెబుతున్నారు. ‘బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగాలు చేయాలి’ ‘పెద్ద చదువులు చదవడానికి పేదరికం ఎప్పుడూ అడ్డు కాదు’... మొదలైన మాటలను గట్టిగానే చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment