పులకించిన కిలిమంజారో | 13 Year Old Hyderabad Girl Pulakita Hasvi Scales Mount Kilimanjaro | Sakshi
Sakshi News home page

పులకించిన కిలిమంజారో

Published Sun, Nov 21 2021 12:16 AM | Last Updated on Sun, Nov 21 2021 12:16 AM

13 Year Old Hyderabad Girl Pulakita Hasvi Scales Mount Kilimanjaro - Sakshi

పులకిత హస్వి; కిలిమంజారో పర్వతంపై భారత జాతీయ పతాకంతో పులకిత

కిలిమంజారో పర్వతం. ఓ దశాబ్దంగా వార్తల్లో తరచూ కనిపిస్తున్న ఈ పర్వతం మీదనున్న ఉహురు శిఖరం ఎత్తు 5895 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎల్తైన పర్వతం ఇది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎల్తైన ఏడు పర్వతశిఖరాల్లో నాలుగవది. ఈ శిఖరం మీద అక్టోబర్‌ మూడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంటనియర్‌ పదమూడేళ్ల పులకిత హస్వి మన తెలుగమ్మాయి.

ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో అధిరోహించాలనే కోరిక ఇంత చిన్న వయసులో ఎందుకు కలిగి ఉంటుంది... అనే సందేహం రావడం సహజమే. ఇది హస్వికి కోవిడ్‌ కాలంలో రేకెత్తిన ఆలోచన. లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు లేవు. పులకిత హస్వి ఇష్టంగా నేర్చుకుంటున్న బ్యాడ్‌మింటన్‌ను కూడా విరామం తప్పలేదు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలు చూడడమే పనిగా ఉన్న సమయం అది. ఆ చూడడంలో ఎవరెస్ట్‌ అనే ఇంగ్లిష్‌ సినిమాను చూడడం కాకతాళీయమే. కానీ ఆ చూడడం ఈ అమ్మాయి అభిరుచిని, గమనాన్ని మార్చేసింది.

ఏకంగా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ వరకు నడిపించింది. ఆ తర్వాత కిలిమంజారో శిఖరానికి చేర్చింది. ఇదంతా ఈ ఏడాదిలో జరిగిన పురోగతి మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా చూసింది, ఎవరెస్ట్‌ అధిరోహిస్తానని అమ్మానాన్నలను అడిగింది. ఏప్రిల్‌లో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు ట్రెక్‌ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రోజు రాత్రి అమ్మానాన్నలతో ‘సెవెన్‌ సమ్మిట్స్‌ పూర్తి చేస్తాన’ని తన తర్వాతి లక్ష్యాన్ని బయటపెట్టింది పులకిత హస్వి. అలాగే కిలిమంజారో పర్వతారోహణ పూర్వాపరాలను సాక్షితో పంచుకుంది.

 తొలి ఘట్టం ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు
‘‘మా నాన్నది మంచిర్యాల, అమ్మ వాళ్ల ఊరు కర్నూలు జిల్లా నంద్యాల. ఇద్దరూ ఎడ్యుకేషన్‌ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నా చిన్నప్పుడు వెస్ట్‌ మారేడ్‌పల్లిలో ఉండేవాళ్లం. అక్కడ ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కి అవకాశం బాగా ఉండేది. అన్నయ్య, నేను ఇద్దరం ఎప్పుడూ ఏదో ఒక కోచింగ్‌ లో ఉండేవాళ్లం. కీబోర్డ్, గిటార్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఆర్కిస్టిక్‌ స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేసి నేషనల్స్‌కు వెళ్లాను. నాకు బ్యాడ్‌మింటన్‌ అంటే ఇష్టం.

సీరియెస్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ వచ్చాను. కానీ కోవిడ్‌తో ప్రాక్టీస్‌ ఆగిపోయింది. మౌంటనియరింగ్‌ వైపు దృష్టి మళ్లింది. ఎవరెస్ట్‌ అధిరోహించడానికి ముందు బేస్‌క్యాంప్‌ ట్రెక్‌ పూర్తి చేసి ఉండాలి. అందుకే తొలి ప్రయత్నంగా బేస్‌ క్యాంపు ట్రెక్‌ పూర్తి చేశాను. 2024–2025 కి సెవెన్‌ సమ్మిట్స్‌ పూర్తి చేయాలనేది నా టార్గెట్‌. ఆ తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్‌ వైపు వెళ్లాలనేది ఇప్పటి నా ఆలోచన. సెవెన్‌ సమ్మిట్స్‌ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను’’ అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వింది పులకిత హస్వి.

గడ్డకట్టిన నీళ్లు
‘కిలిమంజారో సమ్మిట్‌ పూర్తి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడితో సంతృప్తి చెందితే మిగిలిన సమ్మిట్స్‌ పూర్తి చేయలేనని కూడా ఆ క్షణంలోనే గుర్తు వచ్చింది’ అంటూ కిలిమంజారో అధిరోహణ అనుభవాలను చెప్పింది పులకిత హస్వి. ‘‘సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ ఎనిమిది వరకు సాగిన ట్రిప్‌లో యాక్చువల్‌ పర్వతారోహణ మొత్తం ఐదు రోజులే. నాలుగో రోజు శిఖరాన్ని చేరతాం. ఐదవ రోజు కిందకు దిగుతాం. శిఖరాన్ని చేరే లోపు నాలుగు రోజుల్లో ఏడెనిమిది రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచు దట్టంగా పొగలా కమ్మేసి ఉంటుంది.

ముందు ఏముందనేది స్పష్టంగా కనిపించదు. నాలుగో రోజు ఆహారం కూడా ఉండదు. రెండు చాక్లెట్‌లు, ప్రొటీన్‌ బార్‌ మాత్రమే ఆహారం. అంతకు మించి ఏమీ తినాలనిపించదు కూడా. మైనస్‌ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మాతో తీసుకువెళ్లిన బాటిల్‌లోని నార్మల్‌ వాటర్‌ గడ్డకట్టిపోయాయి. ఫ్లాస్క్‌లో తీసుకువెళ్లిన వేడినీటిని కలుపుకుని తాగాను. స్నోఫాల్‌ని దగ్గరగా చూడగలిగాను. కిలిమంజారో పర్వతం మీద మంచు కురుస్తుంటే పక్కనే మరో పర్వతం మీద సూర్యుడి కిరణాలు కాంతులీనుతున్నాయి. ప్రకృతి చేసే ఇలాంటి అద్భుతమైన విన్యాసాలను బాగా ఎంజాయ్‌ చేశాను.

ఈ పర్వతారోహణ వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. స్పాట్‌ డెసిషన్‌ తీసుకోవడం అనేది ప్రాక్టికల్‌గా తెలిసి వచ్చింది. ఐదవరోజు పర్వతాన్ని దిగేటప్పుడు చాలాసార్లు పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాను. ‘అయ్యో పడిపోయావా’ అంటూ లేవదీయడానికి ఎవరూ ఉండరు. మనకు మనమే సంభాళించుకుని లేచి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఒకటి– రెండు సార్లు పడిన తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత పడకుండా సాగిన ప్రయాణమే పెద్ద విజయంగా అనిపిస్తుంది. కిలిమంజారో ఎక్స్‌పెడిషన్‌కు వెళ్లడానికి ముందు మూడు నెలలపాటు ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్‌ చేశాను.

ఫిట్‌నెస్‌ క్లాసులు కూడా డిజిటల్‌ మీడియా ద్వారానే. మా కోచ్‌ వాట్సాప్‌లో ఏరోజుకారోజు టాస్క్‌ ఇస్తారు. హైట్స్‌కి వెళ్లకుండా ప్రాక్టీస్‌ మొత్తం నేల మీదనే కావడంతో శిఖరం మీదకు వెళ్లినప్పుడు వామిటింగ్‌ ఫీలింగ్‌ కలిగింది. అంతకు మించి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మా టీమ్‌లో మొత్తం ఏడుగురున్నారు. నేనే చిన్నదాన్ని. అరవై ఏళ్ల మౌంటనియర్‌ కూడా ఉన్నారు. మాలో శిఖరాన్ని చేరింది నలుగురే. కిలిమంజారో పర్వతారోహణ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందనేది నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఏడు సమ్మిట్స్‌ని పూర్తి చేసి తీరుతాను’’ అన్నది హస్వి.

సెవెన్‌ సమ్మిట్స్‌
ఎవరెస్ట్‌ (8,849 మీటర్లు)– ఆసియా, అకాంగువా (6,961 మీటర్లు) – సౌత్‌ అమెరికా, దేనాలి (6,194 మీటర్లు)– నార్త్‌ అమెరకా, కిలిమంజారో (5,895 మీటర్లు)– ఆఫ్రికా, ఎల్‌బ్రస్‌ (5,642 మీటర్లు)– యూరప్, విన్‌సాన్‌ మాసిఫ్‌ (4,892 మీటర్లు)– అంటార్కిటికా, కోస్కియుజ్‌కో (2,228 మీటర్లు) – ఆస్ట్రేలియా.

పులకిత సాధించిన పతకాలు; కిలిమంజారో నేషనల్‌ పార్క్‌ వద్ద పులకిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement