Seven summits
-
కమి రిటా షెర్పా రికార్డు
కఠ్మాండు: నేపాలీ పర్వతారోహకుడు కమి రిటా షెర్పా(53) సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఎనిమిది వేల మీటర్లు పైబడి ఎత్తయిన పర్వత శిఖరాలను 42సార్లు అధిరోహించిన ఘనతను ఆయన సాధించారు. 8 వేల మీటర్లకంటే మించి ఎత్తయిన శిఖరాలను 41 పర్యాయాలు అధిరోహించిన మరో ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిమ్స్ పుర్జా పేరిట ఉన్న రికార్డును తాజాగా కమి రిటా బద్దలు కొట్టారు. ప్రపంచంలోని ఎనిమిదో ఎత్తయిన మౌంట్ మనస్లును మంగళవారం ఉదయం కమి రిటా షెర్పా అధిరోహించారని సెవెన్ సమిట్ ట్రెక్స్ అనే పర్వతారోహక సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని కమి రిటా 1994లో మొదటిసారి అధిరోహించారు. అది మొదలు ఇప్పటిదాకా 28 సార్లు ఎక్కారు. -
ఒక్కసారి కాదు.. ఏకంగా 26 సార్లు ఎవరెస్టు ఎక్కేశాడు
కఠ్మాండూ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైన అధిరోహించాలన్నది ఎందరో పర్వతారోహకుల కల. అలాంటిది, నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా ఎవరెస్టును ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 26 సార్లు అధిరోహించాడు! ఆ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 52 ఏళ్ల కామి 10 మందితో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ శనివారం 26వ సారి ఎవరెస్టును ఎక్కినట్టు సెవన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్ దావా షెర్పా వెల్లడించారు. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే తొలిసారి వెళ్లిన ఏ మార్గంలోనే కామి బృందం కూడా శిఖరానికి చేరింది. రీతా తొలిసారి 1994లో ఎవరెస్టును అధిరోహించాడు. ప్రపంచంలో రెండో ఎత్తైన మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ (కే2)తో పాటు హోత్సే, మనాస్లూ, చో ఓయూ శిఖరాలను కూడా ఆయన ఎక్కాడు. 8 వేల మీటర్ల కంటే ఎత్తైన ఎక్కువ శిఖరాలను అధిరోహించిన రికార్డు కూడా రీతాదే! 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టును ఎక్కడానికి నేపాల్ పర్యాటక శాఖ ఈ ఏడాది 316 మందికి అనుమతినిచ్చింది. -
పులకించిన కిలిమంజారో
కిలిమంజారో పర్వతం. ఓ దశాబ్దంగా వార్తల్లో తరచూ కనిపిస్తున్న ఈ పర్వతం మీదనున్న ఉహురు శిఖరం ఎత్తు 5895 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎల్తైన పర్వతం ఇది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎల్తైన ఏడు పర్వతశిఖరాల్లో నాలుగవది. ఈ శిఖరం మీద అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంటనియర్ పదమూడేళ్ల పులకిత హస్వి మన తెలుగమ్మాయి. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో అధిరోహించాలనే కోరిక ఇంత చిన్న వయసులో ఎందుకు కలిగి ఉంటుంది... అనే సందేహం రావడం సహజమే. ఇది హస్వికి కోవిడ్ కాలంలో రేకెత్తిన ఆలోచన. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు లేవు. పులకిత హస్వి ఇష్టంగా నేర్చుకుంటున్న బ్యాడ్మింటన్‌ను కూడా విరామం తప్పలేదు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలు చూడడమే పనిగా ఉన్న సమయం అది. ఆ చూడడంలో ఎవరెస్ట్ అనే ఇంగ్లిష్ సినిమాను చూడడం కాకతాళీయమే. కానీ ఆ చూడడం ఈ అమ్మాయి అభిరుచిని, గమనాన్ని మార్చేసింది. ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిపించింది. ఆ తర్వాత కిలిమంజారో శిఖరానికి చేర్చింది. ఇదంతా ఈ ఏడాదిలో జరిగిన పురోగతి మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా చూసింది, ఎవరెస్ట్ అధిరోహిస్తానని అమ్మానాన్నలను అడిగింది. ఏప్రిల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రోజు రాత్రి అమ్మానాన్నలతో ‘సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేస్తాన’ని తన తర్వాతి లక్ష్యాన్ని బయటపెట్టింది పులకిత హస్వి. అలాగే కిలిమంజారో పర్వతారోహణ పూర్వాపరాలను సాక్షితో పంచుకుంది. తొలి ఘట్టం ఎవరెస్ట్ బేస్ క్యాంపు ‘‘మా నాన్నది మంచిర్యాల, అమ్మ వాళ్ల ఊరు కర్నూలు జిల్లా నంద్యాల. ఇద్దరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నా చిన్నప్పుడు వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉండేవాళ్లం. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి అవకాశం బాగా ఉండేది. అన్నయ్య, నేను ఇద్దరం ఎప్పుడూ ఏదో ఒక కోచింగ్ లో ఉండేవాళ్లం. కీబోర్డ్, గిటార్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆర్కిస్టిక్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసి నేషనల్స్‌కు వెళ్లాను. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సీరియెస్‌గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. కానీ కోవిడ్‌తో ప్రాక్టీస్ ఆగిపోయింది. మౌంటనియరింగ్ వైపు దృష్టి మళ్లింది. ఎవరెస్ట్ అధిరోహించడానికి ముందు బేస్‌క్యాంప్ ట్రెక్ పూర్తి చేసి ఉండాలి. అందుకే తొలి ప్రయత్నంగా బేస్ క్యాంపు ట్రెక్ పూర్తి చేశాను. 2024–2025 కి సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేయాలనేది నా టార్గెట్. ఆ తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ వైపు వెళ్లాలనేది ఇప్పటి నా ఆలోచన. సెవెన్ సమ్మిట్స్ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను’’ అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వింది పులకిత హస్వి. గడ్డకట్టిన నీళ్లు ‘కిలిమంజారో సమ్మిట్ పూర్తి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడితో సంతృప్తి చెందితే మిగిలిన సమ్మిట్స్ పూర్తి చేయలేనని కూడా ఆ క్షణంలోనే గుర్తు వచ్చింది’ అంటూ కిలిమంజారో అధిరోహణ అనుభవాలను చెప్పింది పులకిత హస్వి. ‘‘సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఎనిమిది వరకు సాగిన ట్రిప్‌లో యాక్చువల్ పర్వతారోహణ మొత్తం ఐదు రోజులే. నాలుగో రోజు శిఖరాన్ని చేరతాం. ఐదవ రోజు కిందకు దిగుతాం. శిఖరాన్ని చేరే లోపు నాలుగు రోజుల్లో ఏడెనిమిది రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచు దట్టంగా పొగలా కమ్మేసి ఉంటుంది. ముందు ఏముందనేది స్పష్టంగా కనిపించదు. నాలుగో రోజు ఆహారం కూడా ఉండదు. రెండు చాక్లెట్లు, ప్రొటీన్ బార్ మాత్రమే ఆహారం. అంతకు మించి ఏమీ తినాలనిపించదు కూడా. మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మాతో తీసుకువెళ్లిన బాటిల్లోని నార్మల్ వాటర్ గడ్డకట్టిపోయాయి. ఫ్లాస్క్‌లో తీసుకువెళ్లిన వేడినీటిని కలుపుకుని తాగాను. స్నోఫాల్ని దగ్గరగా చూడగలిగాను. కిలిమంజారో పర్వతం మీద మంచు కురుస్తుంటే పక్కనే మరో పర్వతం మీద సూర్యుడి కిరణాలు కాంతులీనుతున్నాయి. ప్రకృతి చేసే ఇలాంటి అద్భుతమైన విన్యాసాలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పర్వతారోహణ వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. స్పాట్ డెసిషన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్‌గా తెలిసి వచ్చింది. ఐదవరోజు పర్వతాన్ని దిగేటప్పుడు చాలాసార్లు పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాను. ‘అయ్యో పడిపోయావా’ అంటూ లేవదీయడానికి ఎవరూ ఉండరు. మనకు మనమే సంభాళించుకుని లేచి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఒకటి– రెండు సార్లు పడిన తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత పడకుండా సాగిన ప్రయాణమే పెద్ద విజయంగా అనిపిస్తుంది. కిలిమంజారో ఎక్స్‌పెడిషన్‌కు వెళ్లడానికి ముందు మూడు నెలలపాటు ఫిట్నెస్ ప్రాక్టీస్ చేశాను. ఫిట్నెస్ క్లాసులు కూడా డిజిటల్ మీడియా ద్వారానే. మా కోచ్ వాట్సాప్‌లో ఏరోజుకారోజు టాస్క్ ఇస్తారు. హైట్స్‌కి వెళ్లకుండా ప్రాక్టీస్ మొత్తం నేల మీదనే కావడంతో శిఖరం మీదకు వెళ్లినప్పుడు వామిటింగ్ ఫీలింగ్ కలిగింది. అంతకు మించి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మా టీమ్‌లో మొత్తం ఏడుగురున్నారు. నేనే చిన్నదాన్ని. అరవై ఏళ్ల మౌంటనియర్ కూడా ఉన్నారు. మాలో శిఖరాన్ని చేరింది నలుగురే. కిలిమంజారో పర్వతారోహణ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందనేది నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఏడు సమ్మిట్స్‌ని పూర్తి చేసి తీరుతాను’’ అన్నది హస్వి. సెవెన్ సమ్మిట్స్ ఎవరెస్ట్ (8,849 మీటర్లు)– ఆసియా, అకాంగువా (6,961 మీటర్లు) – సౌత్ అమెరికా, దేనాలి (6,194 మీటర్లు)– నార్త్ అమెరకా, కిలిమంజారో (5,895 మీటర్లు)– ఆఫ్రికా, ఎల్బ్రస్ (5,642 మీటర్లు)– యూరప్, విన్సాన్ మాసిఫ్ (4,892 మీటర్లు)– అంటార్కిటికా, కోస్కియుజ్కో (2,228 మీటర్లు) – ఆస్ట్రేలియా. పులకిత సాధించిన పతకాలు; కిలిమంజారో నేషనల్ పార్క్ వద్ద పులకిత -
అసాధారణ రికార్డులు
చరిత్రలో ఎంతోమంది కొత్త రికార్డులు నెలకొల్పుతుంటారు. వాటిలో కొన్ని అసాధారణమైనవి, వ్యక్తిగతమైనవి ఉంటాయి. అంటే ఇతరులెవరికీ సాధ్యం కానివాటిని, ఒక వ్యక్తి మాత్రమే సొంతం చేసుకోవడం. అలా కొందరు వ్యక్తిగతంగా నెలకొల్పిన కొన్ని రికార్డుల గురించి తెలుసుకుందాం.. ఐ.క్యూ.లో టాప్.. తెలివితేటల్ని ఐ.క్యూ. (ఇంటలిజెంట్ కోషంట్)లో కొలుస్తారు. వివిధ ప్రమాణాల ఆధారంగా ఒక మనిషి ఐ.క్యూ.ని పరీక్షిస్తారు. ఇందులో సాధించే స్కోరును పరిగణనలోకి తీసుకుని వారి తెలివితేటల్ని లెక్కిస్తారు. ఇందులో వయసుని కూడా పరిగణనలోకి తీసుని, సైకాలజిస్టులు ఈ టెస్టును నిర్వహిస్తారు. ఐ.క్యూ.లో వంద స్కోరు సాధిస్తేనే తెలివైన వారని అర్థం. 130 స్కోర్ సాధిస్తే సూపర్ ఇంటలిజెంట్ అని అర్థం. అలాంటిది 160 స్కోరు సాధించడమంటే అరుదైన విషయం. కానీ బ్రిటన్‌కు చెందిన కాష్మీ వాహి అనే పదకొండేళ్ల బాలిక గతేడాది ఐ.క్యూ. టెస్టులో 162 పాయింట్లు సాధించి, ఆశ్చర్యపరిచింది. అత్యంత ఐ.క్యూ.స్కోరు సాధించిన బాలికగా నిలిచింది. 59 భాషల్లో ప్రావీణ్యం.. కనీసం ఆరు భాషలు మాట్లాడగలిగే వాళ్లను బహుభాషా ప్రావీణుడు అంటారు. మనలో చాలా మంది బహుభాషా కోవిదులు ఉండే ఉంటారు. కానీ 59 భాషలు మాట్లాడడం గురించి తెలుసా..? ఒక్క మనిషి అన్ని భాషలు మాట్లాడడం అసాధ్యమంటారేమో కానీ, ఓ వ్యక్తి మాత్రం నిజంగానే 59 భాషలు మాట్లాడగలడు. లెబనాన్‌కు చెందిన జియాద్ యూసుఫ్ ఫజా అనే వ్యక్తి ఈ అసాధారణ ప్రతిభ కలిగి ఉన్నాడు. ప్రస్తుతం బ్రెజిల్లో నివసిస్తున్న జియాద్ పలు టెలివిజన్ షోలలో వివిధ భాషలు మాట్లాడాడు. జియాద్కంటే ముందు ఎమిల్ క్రెబ్స్ అనే ఓ జర్మన్ ఏకంగా 65 భాషలు మాట్లాడగలిగే ప్రతిభ ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఒంటరిగా సముద్రయానం.. చాలా మందికి సముద్రంపై ఒంటరిగా ప్రయాణం చేయడమంటే ఇష్టం. ఇలా కొందరు ఒంటరిగా, పడవలపై అనేక దేశాలు తిరిగొస్తుంటారు. అయితే ఒంటరిగా అన్ని దేశాలు చుట్టిరావడమంటే అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ అమెరికాకు చెందిన జోష్వా స్లోకామ్ అనే నావికుడు మాత్రం ఒంటరిగా, పడవపై తిరుగుతూ మొత్తం సముద్రయానాన్ని పూర్తి చేశాడు. 1895 ఏప్రిల్ 24న ప్రారంభమైన జోష్వా నౌకాయనం 1898 జూన్ 27న ముగిసింది. మొత్తం చిన్న పడవపైనే సముద్రంలో దాదాపు 75 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. 51 ఏళ్ల వయసులో జోష్వా ఒంటరిగా తన యాత్ర పూర్తి చేసుకున్నాడు. ఏడు ఖండాల్లో పర్వతారోహణ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టతరమైన పని. పర్వతారోహకుల్లో కొద్దిమంది మాత్రమే ఈ ఘనత సాధిస్తుంటారు. అలాంటిది సెవెన్ సమ్మిట్స్‌ని అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. మొత్తం ఏడు ఖండాల్లోంచి, ప్రతి ఖండంలోని అత్యంత ఎత్తైన పర్వతం చొప్పున ఏడు పర్వతాలను కలిపి సెవెన్ సమ్మిట్స్ అంటారు. అవి.1. మౌంట్ ఎవరెస్టు 2. అకోంక్వాగ్వా 3. డెనాలి 4. కిలిమంజారో 5. ఎల్బ్రస్ 6. విన్సన్ 7. కార్స్టెన్జ్. ఈ సెవెన్ సమ్మిట్స్‌ని అధిరోహించాడో బాలుడు. అమెరికాకు చెందిన జోర్డాన్ రోమెరో అనే బాలుడు ఏడు ఖండాల్లోని పర్వతాలను అధిరోహించి, అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన బాలుడుగా గుర్తింపు పొందాడు. పదిహేనేళ్ల వయసులోనే, 2011లో ఈ ఘనత సాధించాడు. పదమూడేళ్ల వయసులోనే ఎవరెస్టును అధిరోహించి గిన్నిస్ రికార్డు కూడా జోర్డాన్ సొంతం చేసుకున్నాడు. అన్ని దేశాలు సందర్శించిన ఏకైక మహిళ.. అపర కుబేరులు సైతం సాధించలేకపోయిన అరుదైన రికార్డు ఇది. అదే ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడం. విదేశాలు చుట్టొచ్చే అలవాటు చాలా మందికి ఉన్నా, ప్రతి దేశాన్నీ సందర్శించడం అందరికీ సాధ్యం కాదు. అయితే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ యువతి. అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన 27 ఏళ్ల క్యాసీ డె పెకోల్ అనే యువతి ఏకంగా ప్రపంచంలోని 196 దేశాలను సందర్శించి, అరుదైన రికార్డు నెలకొల్పింది. అన్ని దేశాలను సందర్శించడమే కాకుండా, అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన మహిళగా కూడా గుర్తింపు పొందింది. 2015 జూలైలో ప్రారంభమైన ఆమె ప్రపంచ యాత్ర, ఈ ఏడాది ఫిబ్రవరి 2న ముగిసింది. మొత్తం 18 నెలల 26 రోజుల్లోనే ఈ యాత్ర పూర్తి చేసుకోవడం విశేషం. చివరగా క్యాసీ యెమెన్‌ను సందర్శించింది. ఈమె పర్యటనకు పలు సంస్థలు ఆర్థిక సాయం అందించాయి. ఈ పర్యటనలో ఆమె 255 విమానాల్లో ప్రయాణించింది. దాదాపు 50 దేశాల్లో మొక్కలు నాటింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్