అసాధారణ రికార్డులు | unbelievable records in world wide | Sakshi
Sakshi News home page

అసాధారణ రికార్డులు

Published Wed, Feb 22 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

అసాధారణ రికార్డులు

అసాధారణ రికార్డులు

చరిత్రలో ఎంతోమంది కొత్త రికార్డులు నెలకొల్పుతుంటారు. వాటిలో కొన్ని  అసాధారణమైనవి, వ్యక్తిగతమైనవి ఉంటాయి.
అంటే ఇతరులెవరికీ సాధ్యం కానివాటిని, ఒక వ్యక్తి మాత్రమే సొంతం చేసుకోవడం.
అలా కొందరు వ్యక్తిగతంగా నెలకొల్పిన కొన్ని రికార్డుల గురించి తెలుసుకుందాం..

ఐ.క్యూ.లో టాప్‌..
తెలివితేటల్ని ఐ.క్యూ. (ఇంటలిజెంట్‌ కోషంట్‌)లో కొలుస్తారు. వివిధ ప్రమాణాల ఆధారంగా ఒక మనిషి ఐ.క్యూ.ని పరీక్షిస్తారు. ఇందులో సాధించే స్కోరును పరిగణనలోకి తీసుకుని వారి తెలివితేటల్ని లెక్కిస్తారు. ఇందులో వయసుని కూడా పరిగణనలోకి తీసుని, సైకాలజిస్టులు ఈ టెస్టును నిర్వహిస్తారు. ఐ.క్యూ.లో వంద స్కోరు సాధిస్తేనే తెలివైన వారని అర్థం. 130 స్కోర్‌ సాధిస్తే సూపర్‌ ఇంటలిజెంట్‌ అని అర్థం. అలాంటిది 160 స్కోరు సాధించడమంటే అరుదైన విషయం. కానీ బ్రిటన్‌కు చెందిన కాష్మీ వాహి అనే పదకొండేళ్ల బాలిక గతేడాది ఐ.క్యూ. టెస్టులో 162 పాయింట్లు సాధించి, ఆశ్చర్యపరిచింది. అత్యంత ఐ.క్యూ.స్కోరు సాధించిన బాలికగా నిలిచింది.

59 భాషల్లో ప్రావీణ్యం..
కనీసం ఆరు భాషలు మాట్లాడగలిగే వాళ్లను బహుభాషా ప్రావీణుడు అంటారు. మనలో చాలా మంది బహుభాషా కోవిదులు ఉండే ఉంటారు. కానీ 59 భాషలు మాట్లాడడం గురించి తెలుసా..? ఒక్క మనిషి అన్ని భాషలు మాట్లాడడం అసాధ్యమంటారేమో కానీ, ఓ వ్యక్తి మాత్రం నిజంగానే 59 భాషలు మాట్లాడగలడు. లెబనాన్‌కు చెందిన జియాద్‌ యూసుఫ్‌ ఫజా అనే వ్యక్తి ఈ అసాధారణ ప్రతిభ కలిగి ఉన్నాడు. ప్రస్తుతం బ్రెజిల్‌లో నివసిస్తున్న జియాద్‌ పలు టెలివిజన్‌ షోలలో వివిధ భాషలు మాట్లాడాడు. జియాద్‌కంటే ముందు ఎమిల్‌ క్రెబ్స్‌ అనే ఓ జర్మన్‌ ఏకంగా 65 భాషలు మాట్లాడగలిగే ప్రతిభ ఉన్నట్లు ఆధారాలున్నాయి.

ఒంటరిగా సముద్రయానం..
చాలా మందికి సముద్రంపై ఒంటరిగా ప్రయాణం చేయడమంటే ఇష్టం. ఇలా కొందరు ఒంటరిగా, పడవలపై అనేక దేశాలు తిరిగొస్తుంటారు. అయితే ఒంటరిగా అన్ని దేశాలు చుట్టిరావడమంటే అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ అమెరికాకు చెందిన జోష్వా స్లోకామ్‌ అనే నావికుడు మాత్రం ఒంటరిగా, పడవపై తిరుగుతూ మొత్తం సముద్రయానాన్ని పూర్తి చేశాడు. 1895 ఏప్రిల్‌ 24న ప్రారంభమైన జోష్వా నౌకాయనం 1898 జూన్‌ 27న ముగిసింది. మొత్తం చిన్న పడవపైనే సముద్రంలో దాదాపు 75 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. 51 ఏళ్ల వయసులో జోష్వా ఒంటరిగా తన యాత్ర పూర్తి చేసుకున్నాడు.  

ఏడు ఖండాల్లో పర్వతారోహణ..
ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టతరమైన పని. పర్వతారోహకుల్లో కొద్దిమంది మాత్రమే ఈ ఘనత సాధిస్తుంటారు. అలాంటిది సెవెన్‌ సమ్మిట్స్‌ని అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. మొత్తం ఏడు ఖండాల్లోంచి, ప్రతి ఖండంలోని అత్యంత ఎత్తైన పర్వతం చొప్పున ఏడు పర్వతాలను కలిపి సెవెన్‌ సమ్మిట్స్‌ అంటారు. అవి.1. మౌంట్‌ ఎవరెస్టు 2. అకోంక్వాగ్వా 3. డెనాలి 4. కిలిమంజారో 5. ఎల్బ్రస్‌ 6. విన్సన్‌ 7. కార్‌స్టెన్జ్‌. ఈ సెవెన్‌ సమ్మిట్స్‌ని అధిరోహించాడో బాలుడు. అమెరికాకు చెందిన జోర్డాన్‌ రోమెరో అనే బాలుడు ఏడు ఖండాల్లోని పర్వతాలను అధిరోహించి, అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన బాలుడుగా గుర్తింపు పొందాడు. పదిహేనేళ్ల వయసులోనే, 2011లో ఈ ఘనత సాధించాడు. పదమూడేళ్ల వయసులోనే ఎవరెస్టును అధిరోహించి గిన్నిస్‌ రికార్డు కూడా జోర్డాన్‌ సొంతం చేసుకున్నాడు.

అన్ని దేశాలు సందర్శించిన ఏకైక మహిళ..
అపర కుబేరులు సైతం సాధించలేకపోయిన అరుదైన రికార్డు ఇది. అదే ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడం. విదేశాలు చుట్టొచ్చే అలవాటు చాలా మందికి ఉన్నా, ప్రతి దేశాన్నీ సందర్శించడం అందరికీ సాధ్యం కాదు. అయితే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ యువతి. అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన 27 ఏళ్ల క్యాసీ డె పెకోల్‌ అనే యువతి ఏకంగా ప్రపంచంలోని 196 దేశాలను సందర్శించి, అరుదైన రికార్డు నెలకొల్పింది. అన్ని దేశాలను సందర్శించడమే కాకుండా, అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన మహిళగా కూడా గుర్తింపు పొందింది.

2015 జూలైలో ప్రారంభమైన ఆమె ప్రపంచ యాత్ర, ఈ ఏడాది ఫిబ్రవరి 2న ముగిసింది. మొత్తం 18 నెలల 26 రోజుల్లోనే ఈ యాత్ర పూర్తి చేసుకోవడం విశేషం. చివరగా క్యాసీ యెమెన్‌ను సందర్శించింది. ఈమె పర్యటనకు పలు సంస్థలు ఆర్థిక సాయం అందించాయి. ఈ పర్యటనలో ఆమె 255 విమానాల్లో ప్రయాణించింది. దాదాపు 50 దేశాల్లో మొక్కలు నాటింది. – సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement