అబూజా : ఆఫ్రికా కుబేరుడు అలికో డాంగోట్ (61) చేసిన ఓ పని చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 10.3 బిలియన్ డాలర్లతో ఆఫ్రికా రిచెస్ట్ పర్సన్‌గా కొనసాగుతున్న నైజీరియాకు చెందిన డాంగోట్‌కు.. ‘ఇంతకూ నేను కోటీశ్వరుడినేనా’ అనే సందేహం కలిగింది. తన సంపాదనంతా ఎప్పుడూ కాగితాల్లోనే చూసుకుని మురవాలా అని మదనపడ్డాడు. తన కష్టార్జితాన్ని ఓసారి కళ్లారా చూద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బ్యాంక్‌కు వెళ్లి ఓ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.69 కోట్లు)ను విత్‌డ్రా చేశాడు. డాంగోట్ అంత భారీ మొత్తం విత్‌డ్రా చేస్తుండటంతో బ్యాంకు అధికారులు విస్తుబోయారు.
చివరకు అతని కోరిక తెలిసి.. ఇదేం కోరికా అంటూ లోలోన నవ్వుకున్నారు. ఇక డ్రా చేసిన 10 మిలియన్ డాలర్లను ఓ సారి తడిమి చూసుకున్న డాంగోట్.. వాటిని ఓ రోజంతా తన దగ్గర ఉంచుకుని మరుసటి రోజు బ్యాంక్‌లో వేశాడు. ‘యుక్త వయసులో ఉన్నప్పుడు మనం సంపాదించే మొదటి 10 మిలియన్ డాలర్లే అత్యంత ప్రధానం. తర్వాతా ఆ మొత్తం పెరుగుతూ వెళ్తుంది. నువ్వప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవు. కానీ, నాకెందుకో నా డబ్బును కళ్లారా చూద్దామనుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. సిమెంట్, షుగర్, ఫ్లోర్ తదితర తయారీ రంగాల్లో డాంగోట్ బడా పారిశ్రామిక వేత్తగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment