
అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఉదయం దుండగులు చుట్టుముట్టారు. అప్పుడప్పుడే స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులను వారు బలవంతంగా తమ వెంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 287 మంది విద్యార్థులు కనిపించడం లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు.
ఈ ఘటనకు కారణమంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు చెప్పారు. సాయుధ ముఠాలు విద్యార్థులను కిడ్నాప్ చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం నైజీరియాలో 2014 తర్వాత పెరిగిపోయింది. 2014లో బోర్నో రాష్ట్రంలోని చిబోక్ గ్రామంలోని స్కూలు నుంచి 200 మందికి పైగా బాలికలను ఇస్లామిక్ తీవ్రవాదులు ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే.