Armed thugs
-
నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్
అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఉదయం దుండగులు చుట్టుముట్టారు. అప్పుడప్పుడే స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులను వారు బలవంతంగా తమ వెంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 287 మంది విద్యార్థులు కనిపించడం లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ ఘటనకు కారణమంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు చెప్పారు. సాయుధ ముఠాలు విద్యార్థులను కిడ్నాప్ చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం నైజీరియాలో 2014 తర్వాత పెరిగిపోయింది. 2014లో బోర్నో రాష్ట్రంలోని చిబోక్ గ్రామంలోని స్కూలు నుంచి 200 మందికి పైగా బాలికలను ఇస్లామిక్ తీవ్రవాదులు ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే. -
హైతీలో తీవ్ర అరాచకం
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీలో అరాచకం రాజ్యమేలుతోంది. రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్‌లోని జైలుపై సాయుధ దుండగులు ఆదివారం దాడులు చేశారు. అంతకుముందు పలు పోలీస్‌స్టేషన్లపైనా దాడులు చేశారు. జైలుపై దాడి ఘటనలో 12 మంది చనిపోగా, సుమారు 3,700 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, అధ్యక్షుడు మెయిజెను హత్య చేసిన కొలంబియా మాజీ సైనికులు సహా సుమారు 100 మంది ఖైదీలు జైలులోని తమ బ్యారక్‌లలోపలే ఉండిపోయారని సీఎన్ఎన్ తెలిపింది. బయటికొస్తే సాయుధ ముఠాలు చంపేస్తాయని వారంతా భయపడుతున్నట్లు పేర్కొంది. కాగా, రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్ నగరాన్ని గుప్పెట పెట్టుకున్న ప్రధాన సాయుధ ముఠా ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ గద్దె దిగాలంటూ డిమాండ్ చేసింది. 2021లో అధ్యక్షుడు జొవెనెల్ మొయిజెను ఆయన నివాసంలో హత్య చేయడం వెనుక ఈ ముఠాయే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదివారం 72 గంటల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 2023లో హైతీలో సాయుధ ముఠాల హింసాత్మక చర్యల కారణంగా 8,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా. -
కెన్యాలో 36మంది క్వారీ వర్కర్ల ఊచకోత
నైరోబీ: కెన్యాలో సాయుధ దుండగులు తాజాగా జరిపిన కాల్పుల్లో 36మంది క్వారీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆచూకీ దొరకని మరి కొందరు అపహరణకు గురైనట్టుగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కెన్యా ఈశాన్యంలో సోమాలియా సరిహద్దు సమీపంలో మందేరా పట్టణంవద్ద గుడారాల్లో నిద్రిస్తున్న క్వారీ కార్మికులపై మంగళవారం తెల్లవారుజామున సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 36మంది కార్మికులు మరణించారని పోలీసులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులు తెలిపారు.