ఇండియాలో పుట్టి, ఆఫ్రికాలో పెరిగి, ఇంగ్లాండ్‌లో స్థిరపడింది. అయినా భారతీయ వంటకాలను అద్భుతంగా వండుతూ ఎంతోమంది కస్టమర్ల మనసులను దోచుకుంటోంది 85 ఏళ్ల బామ్మ. తొమ్మిది పదులకు చేరువలో ఉన్నప్పటికీ ఎంతో చలాకీగా దేశీయ వంటకాలను వండివార్చుతూ మంచి కుక్‌గా పేరు తెచ్చుకున్న ఈ పెద్దావిడే మంజు. రుచికరమైన ఈ వంటకాలను యూరోపియన్లు సైతం లొట్టలేసుకుని లాగించేస్తూ వావ్ అంటున్నారు.
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో 1936లో మంజు పుట్టింది. తండ్రి వృత్తిరీత్యా ఉగాండాలో స్థిరపడడంతో అమ్మతో కలిసి ఆ దేశం వెళ్లింది. మంజుకు పన్నెండేళ్ల వయసులో తండ్రి మరణించాడు. దీంతో కుటుంబం ఆర్థికంగా కుదేలైంది.
ఇంట్లో తనే పెద్ద కావడంతో..∙తోబుట్టు వుల భారం కూడా తనపై పడింది. దీంతో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ రోజూ వివిధ రకాల అల్పాహారాలు తయారు చేయడం నేర్చుకుని, పద్నాలుగేళ్ల వయసులో టిఫిన్లు తయారు చేసి విక్రయించేది.
అమ్మతో కలిసి పనిచేస్తోన్న సమయంలో చనా దాల్ మంజుకు బాగా నచ్చింది. దీంతో గుజరాతీ సంప్రదాయ వంటకాలన్నింటినీ తల్లి దగ్గర నేర్చుకుని రుచికరంగా తయారు చేసేది. ఒకపక్క టిఫిన్లు విక్రయిస్తూనే, ట్యూషన్లు కూడా చెప్పేది.
పెళ్లి తరువాత కూడా..
చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన మంజుకి పెళ్లి తరువాత కూడా ఒడిదొడుకులు తప్పలేదు. 1964లో గుజరాత్ మూలాలున్న ఆఫ్రికన్ వ్యాపారవేత్తతో మంజుకు పెళ్లయ్యింది. వెంటవెంటనే ఇద్దరు కొడుకులు నైమేష్, జైమిన్‌లు పుట్టారు.
వాళ్లకు ఆరేళ్లు ఉన్నప్పుడు ఉగాండలో రాజకీయ పరిస్థితులు మారి అక్కడ నిబంధనలు మారడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లింది. అక్కడ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారు.
ఉదయం స్విచ్‌బోర్డుల తయారీ ఫ్యాక్టరీలో మంజు ఉద్యోగానికి వెళ్తే భర్త పిల్లల్ని చూసుకునేవాడు. రాత్రి అతను ఉద్యోగం చేస్తే మంజు పిల్లలను చూసుకునేది. అలా ఇద్దరూ ఎంతో కష్టపడి పిల్లలిద్దరినీ పెంచారు. ఏళ్లపాటు ఫ్యాక్టరీలో పనిచేసిన మంజు 65 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యింది.
బాధ్యతలు తీరాయి కానీ...
కుటుంబ బాధ్యతల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. చిన్నప్పటి నుంచి వంటలు చేసే అలవాటు ఉండడం వల్ల చిన్న రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఉండేది మంజుకి. కానీ ఏళ్లు గడుస్తున్నప్పటికీ తన దగ్గర రెస్టారెంట్ నడపడానికి కావలసినన్ని డబ్బులు ఉండేవి కావు.
తన కల ఎప్పుడు నెరవేరుతుందా... అని ఎదురు చూస్తుండేది. అమ్మకోరికను ఎలాగైనా నెరవేర్చాలన్న సంకల్పంతో కొడుకులిద్దరూ తాము దాచుకున్న డబ్బులతో లండన్ నగరానికి దగ్గర్లో ఉన్న బ్రిటన్‌లో చిన్న రెస్టారెంట్‌ను ప్రాంభించారు. దీంతో మంజు ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న కల 80 ఏళ్ల వయసులో నిజమైనట్లనిపించింది.
పూర్తిగా గుజరాతీ శాకాహార భోజనం, నాణ్యమైన నూనె, ఇతర దినుసులతోనే వండడం, నాలుగు రకాల పదార్థాలతో షేరింగ్ థాలీని అందుబాటులో ఉంచడంతో రెస్టారెంట్ కొద్దికాలంలోనే యూరోపియన్లను అమితంగా ఆకర్షించింది. దీంతో చుట్టుపక్కల అనేక ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ మంజు రెస్టారెంట్‌కే కస్టమర్లు ఎగబడేవారు.
దీనికి తోడు ఉదయాన్నే ఐదున్నర గంటలకు నిద్ర లేచి రాత్రి పన్నెండు గంటల వరకు రెస్టారెంట్‌లో వంటకాలను తన స్వహస్తాలతో తయారు చేయడం బాగా కలిసి వచ్చింది. కొడుకులతో పాటు కోడళ్లు దీపాలీ, కిట్టీలు కిచెన్‌లో మంజుకి సాయం చేస్తుండడంతో తక్కువమంది సిబ్బందితో రెస్టారెంట్ చక్కగా నడిపిస్తున్నారు.
సంప్రదాయం ఉట్టిపడేలా..
మంజు ఇండియా వచ్చింది కేవలం మూడుసార్లే అయినప్పటికీ..తన తల్లిదగ్గర నేర్చుకున్న అనుభవంతో పానీపూరి, బేల్‌పూరి, పనీర్ మసాలా, కనడ పాలక్, కధీ, ఆలుకీ సబ్జి, దాల్ ధోక్లి, ఉందాయు, తెప్లా, ఖందవి వంటి రుచికరమైన వంటకాలను రెస్టారెంట్‌లో అందిస్తోంది.
దేశీయ రుచులతోపాటు... భారతీయ సంప్రదాయ పండగలను వేడుకగా నిర్వహించడం, పండుగకు తగ్గట్టుగా రెస్టారెంట్‌ను అలంకరించడం, ప్రత్యేకమైన మెనూ, సంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి అక్కడి వాళ్లను ఎంతగానో అకట్టుకుంటున్నాయి.
గుజరాత్ సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడేలా రెస్టారెంట్‌లో పాత్రలు, పోస్టర్లు, సిబ్బంది డ్రెíస్సింగ్ ఉంటుంది. మంజు కస్టమర్లలో ఇంగ్లిష్, ఇండియన్, విఐపీలు ఉన్నారు. ఆమె చేసిన నిమ్మకాయ పచ్చడికి గాను ‘గ్రేట్ టేస్ట్’ అవార్డును కూడా అందుకుంది. సంకల్పం గట్టిదైతే ఏళ్లుగడిచినా అనుకున్నది తప్పక నెరవేరుతుందనడానికి మంజు జీవితం ఉదాహరణగా నిలుస్తోంది.
చదవండి: అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ!
Comments
Please login to add a commentAdd a comment