అమెరికాలో వరదొస్తే ఆఫ్రికాకు వరం! | If There Is A Flood In America, How Will The African Country Benefit | Sakshi
Sakshi News home page

అమెరికాలో వరదొస్తే ఆఫ్రికాకు వరం! ఎలా?

Published Tue, Oct 3 2023 11:11 AM | Last Updated on Tue, Oct 3 2023 11:47 AM

If There is a Flood in America How Will The African Country Benefit - Sakshi

గతంలో లిబియాలో సంభవించిన వరదలు, మొరాకోలో వచ్చిన భూకంపం చాలామంది ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారాంతం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వీధులన్నీ జలమయమైపోయాయి, ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, కొన్ని వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నాయి. 

వర్షాలు తగ్గిన తరువాత ఇలాంటి వాహనాలను (కార్లను) ఉపయోగిస్తారా? లేదా ఎక్కడికైనా ఎగుమతి చేస్తారా? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో వరదల్లో మునిగిన కార్లను కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తం ఖర్చు చేసి రిపేర్ చేసుకుని మళ్ళీ ఉపయోగిస్తారు. అది కూడా కారు ఖరీదుని బట్టి, రిపేరుకి అయ్యే ఖర్చుని బట్టి ఉంటుంది. అయితే అమెరికా దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఒకసారి వరద నీళ్లలో కారు ఇంజిన్‌ తడిస్తే.. దాన్ని అమెరికాలో ఎవరూ ముట్టుకోరు. సాధారణంగా లగ్జరీ కార్ల ధరలు లక్షన్నర డాలర్ల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఉంటాయి. ఇంత ఖరీదైన కార్లు ఒక్కసారి వరద నీళ్లలో తడిచినా.. దాని విలువ దారుణంగా పడిపోతుంది. బురద నీళ్లలో ఇంజిన్‌ తడిస్తే.. ఎంత గొప్ప కారయినా 5 వేల డాలర్లకు మించి విలువ రాదు. ఇలాంటి కార్లన్నింటిని ఓనర్లు ఇన్సూరెన్స్‌ వాళ్లకు అప్పగించి కొత్త కార్లు తీసుకుంటారు.

కార్లను వేలం ద్వారా విక్రయించడం
నిజానికి అమెరికా వరదల్లో మునిగిన కార్లను.. అది ఎంత ఖరీదైన కారైనా చాలా తక్కువ ధరకు జంక్‌యార్డ్‌లు లేదా వెహికల్ రీబిల్డర్‌లకు సాల్వేజ్ వేలంలో విక్రయిస్తారు. అయితే ఇలాంటి వాటిని కొనుగోలు చేసిన కంపెనీలు.. లేదా వ్యక్తులు కెన్యా, జింబాంబ్వే, నైజీరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు.

కారు వరదల్లో మునిగితే ఇంటీరియర్ & ఇంజిన్ వంటి వాటిలో మాత్రమే సమస్యలు తలెత్తుతాయి. కొంత మేర సీట్లు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను అక్కడి కంపెనీలు పరిష్కరించి, వాటి స్థానాల్లో చైనా వస్తువులను ఉపయోగించి, కొంత యధా స్థితికి తీసుకువస్తారు. ఇలా మళ్ళీ కొత్తగా తయారైన కార్లను సుమారు 40వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు విక్రయిస్తారని తెలుస్తోంది. అంటే 2లక్షల డాలర్ల విలువ చేసే కార్లు  కేవలం 40వేల డాలర్లకే విక్రయిస్తారన్న మాట. వరదల్లో మునిగిన కార్లకు పైపై మెరుగులు దిద్ది ఆఫ్రికా దేశాలు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నాయి. ఇక మధ్యలో బ్రోకర్లు ఒక్కో కారుకు కనీసం 25వేల డాలర్లు సంపాదిస్తారు.

ఆఫ్రికాలో లాభాల పంట
ఇలాంటి కార్లు ఎన్ని రోజులు పనిచేస్తాయని కచ్చితంగా చెప్పలేరు. తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. మొత్తం మీద దీన్ని బట్టి చూస్తే అమెరికాలో వరదలు వస్తే ఆఫ్రికాలో లాభాల పంట పండినట్లే. ముఖ్యంగా కెన్యా, నైగర్‌, జింబాబ్వే, నైజిరియా లాంటి దేశాలు పెద్ద ఎత్తున వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. కాసింత ఖర్చు పెట్టి కొత్తగా తీర్చిదిద్దుతున్నాయి.

సాధారణంగా వరదల్లో మునిగిన కారు ఇంజిన్ కొంత మేరకు దెబ్బతింటుంది, వాహనానికి గుండెలాంటి ఇంజిన్‌లో సమస్య తలెత్తితే దాన్ని మళ్ళీ బాగుచేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నపని, కావున అమెరికాలో ఇలాంటి కార్లను వెనుకాడకుండా విక్రయించేస్తారు.

ఇదీ చదవండి: వేగం పెంచిన ఇండియా.. డౌన్‌లోడ్ స్పీడ్ గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఇలా..

ఇంజిన్‌తో పాటు కార్పెట్‌లు, సీట్-మౌంటు స్క్రూలు, లైట్స్, ఎయిర్ ఫిల్టర్‌ వంటివన్నీ సమస్యకు గురవుతాయి. అంతే కాకుండా కొన్ని రోజులకు తుప్పు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను గుర్తించే వాటిని తక్కువ ధరలను విక్రయిస్తారు. ఇక సాఫ్ట్‌వేర్‌ విషయంలోనూ ఇప్పుడు చాలా పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఆడి, బెంజ్‌, BMW, లెక్సస్‌, ఫోర్డ్‌ ఫోక్స్‌ వాగన్.. బ్రాండ్‌ ఏదైనా అందులో ఉండే సాఫ్ట్‌వేర్‌ను చైనా కంపెనీలు క్రాకర్‌ వర్షన్లలో అమ్ముతున్నాయి. కాబట్టి ఈ వరద కార్లు అన్ని హంగులు సమకూర్చుకుని బురదను వదిలి మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. మరి ఈ కార్లు ఇండియాకు రావా.. అనుకుంటున్నారా? మన ప్రభుత్వం ఎందుకనో ఈ డీల్స్‌కు నో చెబుతోంది. కాబట్టి ఆ అదృష్టమేదో అఫ్రికన్లకే చేరని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement