
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ కంపెనీకి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. బ్రిటన్‌లో తయారయ్యే కార్లను యూఎస్‌కు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
అమెరికా అధ్యక్షుడు విధించిన 25 శాతం దిగుమతి సుంకం ఖర్చును ఎలా తగ్గించాలో పరిశీలిస్తున్న సమయంలో.. బ్రిటన్‌లోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకరైన జేఎల్‌ఆర్ (JLR) సోమవారం నుంచి ఈ చర్య తీసుకుంటున్నారని ది టైమ్స్ తెలిపింది. బ్రిటన్‌లో ఈ కంపెనీ సుమారు 38000 మందికి ఉపాధి కల్పిస్తోంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్.. ట్రంప్ ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడంలో భాగంగానే తమ కార్ల ఎగుమతులను ఒక నెల రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే రెండు నెలలకు సరిపోయే కార్లను కంపెనీ ఇప్పటికే అమెరికాకు ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
మార్చి 2024 వరకు 12 నెలల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4,30,000 వాహనాలను విక్రయించిందని, వాటిలో దాదాపు నాల్గో వంతు ఉత్తర అమెరికాలో ఉన్నాయని కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. అయితే ట్రంప్ సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ షేర్లు గణనీయంగా పతనమయ్యాయి.