ఇండోనేసియాలోని సురబయ సిటీలో షాపింగ్ మాల్ లిఫ్ట్‌లో ఒకరికొకరు తగలకుండా నిర్దేశిత బాక్స్‌ల్లో నిల్చొన్న సందర్శకులు
పారిస్/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. బుధవారం ఉదయానికి దాదాపు 2,00,680 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. 8,092 వేల మంది మరణించారు. మరణాల సంఖ్యలో ఆసియాను యూరోప్ దాటింది. కోవిడ్‌తో ఇప్పటివరకు ఆసియాలో 3,384 మంది చనిపోగా, యూరప్‌లో 3,422 మంది మరణించారు. చైనా, ద.కొరియాల్లో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య భారీగా తగ్గింది. చైనాలో బుధవారం కూడా కొత్తగా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి)
అమెరికాలో..
అమెరికాలో కరోనా (కోవిడ్-19) తో చనిపోయినవారి సంఖ్య బుధవారానికి 105కి చేరింది. మొత్తం 50 రాష్ట్రాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 6500కి పెరిగింది. దేశవ్యాప్తంగా మెడికేర్ టెలీహెల్త్ సేవలను వినియోగించుకోవాలని ప్రజలను అధ్యక్షుడు ట్రంప్ కోరారు. ఫోన్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య సేవలు పొందాలన్నారు. కనిపించని శత్రువుతో చేస్తున్న ఈ యుద్ధాన్ని గెలిచి తీరాలన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు న్యూయార్క్ వ్యాప్తంగా సామూహిక క్వారంటైన్‌ను ప్రకటించే అవకాశముందని మేయర్ బిల్ డి బ్లేసియో పేర్కొన్నారు. మొత్తం 86 లక్షల మంది పౌరులను ఇళ్లలోనే నిర్బంధించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. (కోవిడ్ ఎఫెక్ట్: 6 నెలల రేషన్ ఒకేసారి)
యూరోపియన్ యూనియన్
వైరస్ వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో సరిహద్దులను మూసేస్తూ యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల ప్రజలు 30 రోజుల పాటు ఈయూ దేశాల్లోకి రాకూడదని నిషేధం విధించింది. యూరోప్‌లో మొత్తం 3,422 మరణాలు చోటు చేసుకోగా.. వాటిలో ఇటలీలోనే 2,978 మంది చనిపోయారు. (కరోనా వైరస్ కృత్రిమంగా తయారు చేసింది కాదు!)
ఇరాన్‌లో..
మరోవైపు, ఇరాన్‌లో కరోనా మృత్యుఘంటికలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 147 మంది ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు. బుధవారం వరకు ఈ దేశంలో కోవిడ్‌తో మరణించినవారి సంఖ్య 1,135కి చేరింది. 1,192 కొత్త కేసులతో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 17,161కి పెరిగింది.
ఆఫ్రికాలో..
వైద్య సదుపాయాలు అతి తక్కువగా ఉండే ఆఫ్రికాలో ఇప్పటివరకు సుమారు 500 కేసులు నమోదయ్యాయి. బుర్కినాఫాసోలో తొలి మరణం చోటు చేసుకుంది. లాటిన్ అమెరికా లో 1100 కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో మంగళవారం తొలి మరణం నమోదైంది.
ఆస్ట్రేలియాలో..
ఆస్ట్రేలియాలో 454 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఐదుగురు మరణించారు. ప్రధాని మోరిసన్ దేశవ్యాప్తంగా ‘హ్యూమన్ బయో సెక్యూరిటీ ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. అనవసర విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ప్రజలను కోరారు. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.
నిరుద్యోగం పెరుగుతుంది
కరోనాతో విశ్వవ్యాప్తంగా నిరుద్యోగం భారీగా పెరిగే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 2.5 కోట్ల మంది ఉపాధి కోల్పోయే వీలుంది. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మూడున్నర లక్షల కోట్ల ఆదాయాన్ని కార్మికులు కోల్పోతారని తెలిపింది.
రాణి అపాయింట్‌మెంట్స్ రద్దు
► 94 ఏళ్ల బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2, రానున్న కొన్ని నెలల పాటు తన అన్ని అపాయింట్‌మెంట్స్‌ను రద్దు చేసుకున్నారు. గురువారం బకింగ్‌హామ్‌ప్యాలెస్ నుంచి విండ్సర్ క్యాజిల్‌కు తన విడిదిని మార్చుకోనున్నారు.
► కరోనాపై పోరుకు 500 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయాలంటూ వెనెజువెలా చేసిన అభ్యర్థనను ఐఎంఎఫ్ తోసిపుచ్చింది.
► వైరస్ విజృంభణ నేపథ్యంలో తమ దేశంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ అంగీకరించారు. సత్వరమే వైద్య సౌకర్యాలను ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మలేసియా– సింగపూర్‌లను కలిపే జొహోర్ బహ్రూ ఫ్లై ఓవర్ దారులు నిర్మానుష్యంగా మారిన దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment