వాషింగ్టన్/లండన్: యూరప్, అమెరికాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌ల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్టుగా నిర్ధారించాయి. కేవలం 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100 పైగా కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది.
భారత్ కూడా ఈ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. వైరస్ విస్తరిస్తున్న తీరుని పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికాలలో చాపకింద నీరులా విస్తరిస్తోంది.
ఏమిటీ మంకీపాక్స్?: స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది.
లక్షణాలివే..: జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది.
ఎలా వ్యాపిస్తుంది?:తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా సోకుతుంది.
చికిత్స ఎలా?:ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment