సాక్షి, హైదరాబాద్: ‘కరోనా విషయంలో వచ్చే ఏప్రిల్ దాకా జాగ్రత్తలు తప్పనిసరి. వైరస్ ప్రవర్తన ఎలా ఉంటుంది. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్సా పద్ధతులు, వాటి ఫలితాలపై అప్పటికి పూర్తి స్పష్టత వస్తుంది. కరోనా వైరస్ ఎక్కువ మందికి సోకి విస్తృతంగా వ్యాప్తి చెందాక తాను బలహీనమై మనుగడే కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి తన సహజ గుణాన్ని, దిశను కూడా మార్చుకుంటుందా అన్నది వేచి చూడాలి. అయితే ఏప్రిల్‌లోగా వ్యాక్సిన్ వస్తే ఇంకా మంచిదే..’అని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు. వైరస్ వల్ల ఇన్‌ఫెక్షన్ల స్థాయి తగ్గి మరణాల సంఖ్య పెరిగిన క్రమంలో స్వతహాగా దాని మనుగడే ప్రమాదంలో పడుతుందని, అందువల్ల ఈ పరిణామ క్రమంలో వైరస్ తన నైజాన్ని కూడా మార్చుకునే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ నెలాఖరుకల్లా కోవిడ్‌పై పోరులో మన ప్రయత్నాలు, వాతావరణంలో వచ్చే మార్పులు, వైరస్ వ్యాప్తి, చికిత్సకు అది స్పందిస్తున్న తీరుపై మరింత స్పష్టత వచ్చి, దీనిపై అవగాహన పెరిగే అవకాశాలున్నాయని వివరించారు. వివిధ అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు..
నగరాల్లోనే అదుపు చేస్తే బాగుండేది..
ప్రస్తుతం వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నగరాలకు ఇది పరిమితమైనప్పుడే అదుపులోకి తెచ్చి ఉంటే బాగుండేది. లాక్‌డౌన్ ఎక్కువ కాలమే ఉన్నా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంచెలంచెలుగా ఆంక్షలు ఎత్తేయడంతో ప్రమాదం తగ్గిపోయిందనే భావన ప్రజల్లో ఏర్పడింది. అన్ని ప్రాంతాలకు రాకపోకలు పెరగటంతో దీని విస్తరణ మారుమూల ప్రాంతాలకు సైతం చేరుకుంది.
చికిత్స తీరుతెన్నులపై..
గతంతో పోల్చితే ఇప్పుడు మెరుగైన చికిత్సా పద్ధతులు, రకరకాల మందులు, ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ అందుబాటులోకి వచ్చాయి. వైరస్ సోకాక చాలా తక్కువ మంది మాత్రమే ప్రమాదకర దశకు వెళ్తున్నారు. ఎలాంటి లక్షణాలకు ఏ మందులు వాడాలి, మార్పులు చోటుచేసుకున్న వారిని ఎలా పరీక్షించాలి, తీవ్రత పెరిగిన వారిని ఎలా ట్రీట్ చేయాలన్న దానిపై గత రెండు నెలల్లో ఆప్షన్లు పెరిగాయి. తీవ్రమైన జబ్బు చేసినా చికిత్స చేసే సదుపాయాలు వచ్చాయి.
వెంటిలేటర్ల అవసరం అంతలేదు..
కోవిడ్ వ్యాప్తి తొలిదశలో వెంటిలేటర్ల ఆవశ్యకత అత్యధికంగా ఉంటుందని భావించాం. అయితే ఆ అవసరం లేకుండానే చికిత్స అందించగలుగుతున్నాం. ఆక్సిజన్ అందించడం, పొట్టమీద బోర్లా పడుకోబెట్టడం, వివిధ స్టెరాయిడ్స్, ఇతర మందుల వినియోగంతో జబ్బు తీవ్రం కాకుండా డాక్టర్లు నివారించగలుగుతున్నారు. వైరస్ సోకుతున్న వారు అధికసంఖ్యలోనే ఉంటున్నా కోలుకుంటున్న వారు కూడా పెద్దసంఖ్యలోనే ఉంటున్నారు. మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంటోంది.
మందులతో ప్రివెన్షన్ తక్కువే..
కోవిడ్ రాకుండా మందులతో నివారించడం తక్కువనే చెప్పాలి. కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇతర పోషక విలువలున్న ఆహారంతో రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. చాలావరకు ముందస్తు జాగ్రత్తల వల్ల వైరస్ సోకకుండా చూడొచ్చు. అయితే వ్యాక్సిన్ వస్తేనే కరోనాను పూర్తిగా నిరోధించడం సాధ్యం అవుతుంది.
రీఇన్‌ఫెక్షన్ల వల్ల ప్రమాదం తక్కువగానే..
రీఇన్‌ఫెక్షన్ల వల్ల ప్రమాదం తక్కువే. వైరస్ రీయాక్టివ్ కావడం వల్లనో, ఫాల్స్ పాజిటివ్ లేదా డెడ్ వైరస్ వల్లనో ఇది జరగొచ్చునని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ వేరే వ్యక్తి ద్వారా, వేరే రూపు దాల్చడం ద్వారా రీఇన్‌ఫెక్షన్ వచ్చిందని హాంకాంగ్‌లో తేల్చారు. ఇమ్యూనిటీ తగ్గి వైరస్ మళ్లీ దేహంలోకి ప్రవేశించేటప్పుడు ముక్కులోని మెమోరీ బీ, టీ సెల్స్ (ఐజీఏ యాంటీబాడీస్) గుర్తించి అక్కడే నియంత్రిస్తాయి. మొదటిసారి వైరస్ శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధకశక్తితో ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీస్ తయారవుతాయి.
వైరస్ ప్రపంచ పర్యటన చేస్తోంది..
ప్రస్తుతం కోవిడ్ వైరస్ ప్రపంచ పర్యటన చేస్తోంది. కొన్ని దేశాల్లో ప్రభావం తగ్గినా కొన్నిచోట్ల మరింత విజృంభిస్తోంది. ఇలా అది ప్రవర్తిస్తున్న తీరు ఇంకా కొన్ని ప్రదేశాలు తిరిగేలోగా మరింత మార్చుకుంటుందా? ఇప్పుడు ఐరోపాలో తగ్గినా మళ్లీ పశ్చిమ దేశాల్లో చలికాలం వచ్చేటప్పటికీ కేసులు పెరిగి పెనుమార్పులొస్తాయా అన్నది తెలుసుకునేందుకు డిసెంబర్, జనవరి వరకు వేచి చూడాలి. మళ్లీ ఏప్రిల్ వచ్చేటప్పటికీ పరిస్థితులు ఎలా ఉంటాయనేది బేరీజు వేయాల్సి ఉంది.
మాల్స్, షాపుల్లో అరగంటైనా ప్రమాదమే..
ప్రస్తుతం వైరస్ సోకినా లక్షణాలు బయటపడని అసింప్టమేటిక్ వ్యక్తులు, ప్రీ సిమ్టమ్స్ ఉన్న వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌లు, మనుషుల మధ్య దూరం పాటించడంతో పాటు గుంపుల్లోకి వెళ్లొద్దు. షాపింగ్ మాల్స్‌తో పాటు గాలి, వెలుతురు సరిగా లేని షాపుల్లోనూ అరగంట ఉన్నా ప్రమాదమే. విశాలమైన ప్రదేశాలు, గాలి, వెలుతురు ఎక్కువగా ప్రసరించే చోట్లలోనే ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment